అంగారకుడిపై జీవం ఉందా?

Asteroids, hydrogen make great recipe for life on Mars - Sakshi

నిజమేనంటున్న శాస్త్రవేత్తలు

నిర్ధారించని నాసా

అంగారకుడిపై జీవం ఉండేదా? ఉందా? దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నామంటున్నారు కొందరు పరిశోధకులు. మరో భూమి కాగలదని భావిస్తున్న అరుణ గ్రహంపై జీవం ఉండటమే కాదు.. ఇప్పుడు అక్కడ శిలీంధ్రాలు పెరుగుతున్నాయని వీరి వాదన. నీళ్లలో పెరిగే నాచు.. పుట్టగొడుగుల్లాంటి శిలీంధ్రాల రూపంలో ఇవి ఉన్నాయని, క్యూరియాసిటీ రోవర్‌ పంపిన చిత్రాల ఆధారంగా వీరు ఈ అంచనాకు వచ్చినట్లు.. జర్నల్‌ ఆఫ్‌ ఆస్ట్రో బయాలజీ అండ్‌ స్పేస్‌ సైన్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ద్వారా వెల్లడైంది.

క్యూరియాసిటీ పంపిన కనీసం 15 చిత్రాల్లో అత్యంత సాధారణ స్థాయి జీవం తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్‌ రెజీనా డాస్‌ చెప్పారు. ఈ రకమైన జీవం ఇప్పుడు కూడా అక్కడ పెరుగుతూ ఉండొచ్చునని.. లేదంటే ఒకప్పుడు అక్కడ మనుగడ సాగించి ఉండవచ్చునని ఆయన అంటున్నారు. వీరి అంచనా  ప్రకారం అంగారకుడి వాతావరణంలో ఉన్న మీథేన్‌ వాయువు ఒక క్రమ పద్ధతిలో హెచ్చుతగ్గులకు లోనవుతోంది. అక్కడి జీవం బతికి ఉన్నప్పుడు ఒకలా, చనిపోయినప్పుడు మరోలా మీథేన్‌ స్థాయిలు మారుతున్నాయన్నమాట. క్యూరియాసిటీ పంపిన చిత్రాలు మూడు రోజులకు సంబంధించినవైతే.. మొదటి రోజు చిత్రంలోని నాచు కంటే మూడో రోజు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

నాసా ఏమంటోంది?
రెజీనా డాస్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించామని స్పష్టంగా చెబుతున్నప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) దీనిపై వ్యాఖ్యానించలేదు. నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉల్కా శకలాలు ఢీకొట్టినందున ఒకప్పుడు అంగారకుడిపై జీవం ఉండేందుకు అవసరమైన అన్ని అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అంగారక గ్రహం ఏర్పడిన తొలినాళ్లలో అక్కడి వాతావరణంపై హైడ్రోజన్‌ ఎక్కువగా ఉండి ఉంటే.. గ్రహశకలాలు ఢీకొట్టడం వల్ల జీవం ఏర్పడేందుకు అత్యంత కీలకమైన నైట్రోజన్‌ రూపాలు నైట్రైట్లు (ఎన్‌ఓ2), నైట్రేట్లు (ఎన్‌ఓ3)లు ఏర్పడతాయని, క్యూరియాసిటీ రోవర్‌ వీటిని గేల్‌ క్రేటర్‌ ప్రాంతంలో సేకరించిన మట్టి, రాతి నమూనాల్లో గుర్తించిందని పేర్కొంది.

అంగారకుడిపై అత్యంత పురాతనమైన సరస్సులు, భూగర్భ జలాలు ఉన్నది ఈ గేల్‌ క్రేటర్‌లోనే కావడం గమనార్హం. క్యూరియాసిటీ గుర్తించిన నైట్రోజన్‌ రూపాలు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేసింది. ప్రయోగంలో హైడ్రోజన్‌ ఎక్కువైన కొద్దీ నైట్రేట్లు, నైట్రైట్ల మోతాదు ఎక్కువ కావడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. అంగారకుడిపై హైడ్రోజన్‌ ఎక్కువగా ఉండి ఉంటే జీవం మనుగడకు అవసరమైన పరిస్థితులు ఉండేవన్న నిర్ధారణకు వచ్చారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top