ఆ విమానాల చార్జీలు రెట్టింపు!

Airlines Accused of Hike Prices After Thomas Cook Collapse - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్రిటిష్‌ ట్రావెల్‌ ఏజెన్సీ థామస్‌ కుక్‌ అనూహ్యంగా దివాలా తీయడంలో లండన్‌కు చెందిన దాదాపు 1,60,000 మంది ప్రయాణికులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకున్నారు. వారంతా తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. వారంతా ‘హాలీడే ప్యాకేజీ’ కింద థామస్‌ కుక్‌ కంపెనీకి ముందుగానే డబ్బులు చెల్లించడంతో చేతిలో అదనపు డబ్బులు లేకపోవడం వల్ల ఇంటికి వెళ్లేందుకు తిప్పలు తప్పడం లేదు. థామస్‌ కుక్‌ దివాలా కారణంగా ఆ సంస్థ బుక్‌ చేసిన విమానయాన టిక్కెట్లు, హోటళ్లలో బసలు అన్నీ రద్దయిపోయాయి. ఇదే అదనుగా జెట్, టూయీ లాంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రయాణికుల అవసరాన్ని దోచుకుంటున్నాయి. ఆ సంస్థలు విమానయాన చార్జీలను సోమవారం నాటి నుంచి అనూహ్యంగా రెట్టింపు చేశాయి. పలు హోటళ్లు, రెస్టారెంట్లు హాలీ డే ప్యాకేజీలను కూడా రెట్టింపు చేశాయట.

‘డిమాండ్‌–సరఫరా’ ఆర్థిక సూత్రాన్ని బట్టే తాము చార్జీలను వసూలు చేస్తున్నామని, లేకపోతే తక్కువ రేట్లకు టిక్కెట్లను మంజూరు చేసి ‘థామస్‌ కుక్‌’ సంస్థ లాగా దివాలా తీయాలా! అని జెట్‌ 2 విమానయాన సంస్థ ప్రతినిధ ఒకరు వ్యాఖ్యానించారు. తమ పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఇటు విమానయాన సంస్థలు, అటు హోటళ్లు గద్దల్లా దోచుకుంటున్నాయని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. తాము వచ్చేటప్పుడు 250 పౌండ్లకు, రిటర్న్‌ టిక్కెట్‌ను 260 పౌండ్లకు బుక్‌ చేసుకోగా, ఇప్పుడు జెట్‌ 2లో రిటర్న్‌ టిక్కెట్‌ 413 పౌండ్లకు పెంచారని టర్కీలోని దలామన్‌లో ఓ ప్రయాణికుడు వాపోయారు. విమానం టిక్కెట్‌ కింద తమ నుంచి థామస్‌ ఒక్కరికి 317 పౌండ్లను వసూలు చేయగా, ఇప్పుడు అదే టిక్కెట్‌ ధరను వర్జిన్‌ ఐలాండ్‌ విమానయాన సంస్థ 570 పౌండ్లకు పెంచిందని మరో ప్రయాణికుల కుటుంబం ఆరోపించింది. 178 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్‌ కుక్‌ కథ సోమవారం ముగిసిపోయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకున్న 22 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. పరోక్షంగా మరెంతో మంది ఉపాధి కోల్పోయారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top