అధిక ఉష్ణోగ్రతలకు కారణాలివే...
⇒ ఆయా ప్రాంతాల్లో హరిత వాతావరణం (గ్రీన్‌బెల్ట్) తగ్గడం
⇒ ఉత్తర, పశ్చిమ భారత ప్రాంతాల నుంచి వీచే వేడి గాలులు
⇒ వాహనాల కాలుష్యం, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎండలు మండిపోనున్నాయి. రోహిణి కార్తెలోనే కాదు ఎండా కాలమంతా రోళ్లు పగిలేలా ప్రతాపం చూపించనున్నాయి. వడగాడ్పులు విజృంభించనున్నాయి. మొత్తం గా ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్‌మెంట్ సంస్థలు హెచ్చరించాయి. ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రతలు గత 116 ఏళ్లలో జనవరి అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఎనిమిదో స్థానంలో నిలిచాయని వెల్లడించాయి. తెలంగాణ, ఏపీలతో పాటు మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో కొంత ఎక్కువగా.. గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావొచ్చని హెచ్చరించాయి.
గతేడాది కంటే ఎక్కువగా..
ఈసారి తెలంగాణలో వడగాడ్పులు సాధారణం కంటే 47 శాతం అధికంగా వీస్తాయని, ఇది గతేడాది కంటే ఎక్కువ రోజుల పాటు కొనసాగుతాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ‘‘1981–2010 మధ్య ముప్పై ఏళ్ల సరాసరి ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి సగటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ అధికంగా నమోదవుతాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 90 రోజుల సరాసరి సాధారణ ఉష్ణోగ్రతలకు ఒక డిగ్రీ అధికంగా నమోదవుతాయి. అంటే ఒక రోజు 4 డిగ్రీలు అధికంగా ఉండొచ్చు.. మరోరోజు 5 డిగ్రీలు అధికంగా ఉండొచ్చు.. ఇంకోరోజు సాధారణం కంటే తక్కువగానూ నమోదు కావచ్చు’’అని వై.కె.రెడ్డి వెల్లడించారు. అయితే ఎల్‌నినో, లానినోల ప్రభావంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని తెలిపారు. అడవులు తగ్గిపోవడం, వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
మండుతున్న రాజధాని
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పటికే మండుతున్న ఎండలతో భగ్గుమంటోంది. రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో తీవ్రత మరింత పెరుగుతుందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వడగాడ్పులు తీవ్రంగా వీయవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ కేసులు, మరణాలు పెరిగే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, వైద్యారోగ్య తదితర ప్రభుత్వ శాఖలు ప్రజారోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
గతేడాది పెద్ద సంఖ్యలో వడగాడ్పుల మరణాలు
దాదాపు వందేళ్లతో పోల్చితే గతేడాదే (2016) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలిచింది. గత వేసవిలో రాజస్థాన్‌లోని ఫలోడి ప్రాంతంలో ఏకంగా 51 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది వడగాడ్పుల బారినపడి దేశవ్యాప్తంగా దాదాపు 700 మంది మరణించగా.. అందులో 400 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారేనని అంచనా.
అధిక ఉష్ణోగ్రత, వడగాడ్పులతో సమస్యలు
ఎండలో బయటికి వెళ్లే వారు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల తీవ్రంగా అస్వస్థతకు గురవుతారు. తగిన చికిత్స, సహాయం అందకపోతే మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. వేడిగాలులకు వాహన కాలుష్యం తోడవడంతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి సమస్య పెరిగే అవకాశం ఉంటుంది.