
శతాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ రుచులు
ఉస్మానియా యూనివర్సిటీలో మూడు రోజుల పాటు జరగనున్న ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థులతో పాటు
తెలంగాణ వంటకాల వడ్డన.. 3 రోజుల పాటు ఆహ్వానితులకు భోజనాలు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో మూడు రోజుల పాటు జరగనున్న ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థులతో పాటు ఆహ్వానితులకు తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. ఇందుకు సంబంధించిన మెనూ సిద్ధం చేయాలని పలువురు సీనియర్ అధ్యాపకులు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్న విద్యార్థులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులతో కలసి ప్రతి రోజు 20వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నారు.
అయితే ప్రతి రోజు మధ్యాహ్నం మాత్రమే భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. భోజనాల నిమిత్తం విద్యార్థులకు ప్రత్యేక టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. హాస్టల్ విద్యార్థులకు వారి వారి హాస్టల్ మెస్‌లలో భోజనాలు ఏర్పాటు చేయనుండగా, డే స్కాలర్లు, ఇతర ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లతో భోజన సదుపాయం కల్పించనున్నారు.
నాన్‌వెజ్ వంటకాలు: ఓయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యే వారందరికీ కోడి కూడా, తలకాయ కూర, బోటీ, వంటి నాన్‌వెజ్ వంటకాలను రుచి చూపించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. దీనిపై సంబంధిత శతాబ్ది ఉత్సవాల ప్రత్యేకాధికారిని సంప్రదించగా ‘ఏయే వంటకాలు సిద్ధం చేయాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేద’న్నారు.