
భూ దురాక్రమణపై న్యాయ విచారణ జరపాలి
రాజధాని నిర్మాణం మాటున సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ మొదలు, మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు
♦ వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్
♦ రాజధాని నిర్మాణం పేరిట అధికారపార్టీ నేతలు
♦ భారీ దోపిడీకి పాల్పడ్డారని విమర్శ
♦ హైదరాబాద్ హైటెక్‌సిటీ విషయంలో అమలు చేసిన విధానాన్నే ఇక్కడా అనుసరించారని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం మాటున సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ మొదలు, మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్పడిన భూదురాక్రమణ బాగోతంపై న్యాయవిచారణకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో అధికారపార్టీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని, ప్రజాధనం లూటీ చేస్తున్నారని తాము గతంలో అనేకసార్లు చెప్పామని, తాజాగా ‘సాక్షి’ పత్రికలో వచ్చిన ఆధార సహిత కథనంతో అది నిజమని రుజువైందని చెప్పారు. తక్షణం ఈ వ్యవహారంపై న్యాయవిచారణకు ఆదేశించి చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.
ముందుగానే భూములు కొన్నారు..
ఏపీ కొత్త రాజధాని అమరావతి ప్రాంతంలో వస్తుందని అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేయడానికి ముందు రెండు నుంచి ఆరునెలల మధ్యలో టీడీపీ మంత్రులు, అగ్రనేతలు ఆ పరిసరాల్లో అమాయక రైతులనుంచి, ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల రైతులనుంచి తక్కువ ధరలకు భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని బొత్స తెలిపారు. నారా లోకేశ్ మొదలు కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, బినామీలతో రాజధాని ప్రాంతంలో భారీఎత్తున భూములు కొనుగోలు చేశారన్నారు. మంత్రులు దేవినేని ఉమ, రావెల కిశోర్‌బాబులు వారి సతీమణుల పేర్లతోనే భూములు కొన్నారన్నారు.
ఎంపీ మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్‌తోపాటు ఎందరో భూములు కొన్నారన్నారు. చంద్రబాబు విజయవాడలో నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్స్ భవనం యజమానులూ ఇక్కడ భూదందా చేశారన్నారు. వీరు చేసిన కొనుగోళ్లలో కొన్ని అసైన్డ్ భూములూ ఉన్నాయంటే.. ఏ ఉద్దేశంతో కొన్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ కొనుగోళ్లన్నీ ఏ ఐదేళ్ల క్రితమో... పదేళ్ల క్రితమో జరగలేదని, రాజధానిని ఫలానాచోట పెడతామని ప్రకటన వెలువడటానికి కేవలం రెండు నుంచి ఆరునెలల మధ్యలో జరిగాయన్నారు.
తమవారు భూములు కొన్నచోటే ..
ఏపీకి కొత్త రాజధాని నిర్ధారణకోసం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేస్తే అదిచ్చిన నివేదికను పక్కనపెట్టిన టీడీపీవారు.. ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేని మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కమిటీ వేసి రాజధాని స్థలనిర్ధారణ చేశారని బొత్స గుర్తుచేశారు. వీరంతా భూములు ఎక్కడైతే కొన్నారో అక్కడే రాజధాని ఉండాలని నారాయణ కమిటీ నిర్ణయించడం గమనించాలన్నారు. ఇలాంటి వాటిని తనకనుకూలంగా మల్చుకుని తన బినామీలకు లబ్ధి చేకూర్చడం, దోపిడీకి పాల్పడటంలో చంద్రబాబు దిట్టన్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణానికి ముందే తన వందిమాగధులతో భూములు పెద్దఎత్తున కొనుగోలు చేయించి సొమ్ము చేసుకున్న చరిత్ర ఆయనదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ మంత్రులు, నేతలందరూ మిగతా 13 జిల్లాల్లో కాదని రాజధాని ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని బొత్స ప్రశ్నించారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండే వీలున్నా టీడీపీవారు కొన్న భూములకు ధర రావాలనే ఉద్దేశంతోనే తాత్కాలిక సచివాలయమంటూ చంద్రబాబు హడావుడి చేస్తూండటం వాస్తవం కాదా? అని నిలదీశారు.
పోలవరం అవినీతిపై కేంద్రం విచారణకు ఆదేశించాలి..
పోలవరంపై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తపరిస్తే సరిపోదని, కేంద్రంతో చెప్పి విచారణకు ఆదేశించేలా చూడాలని బొత్స సూచించారు. విభజనచట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకోవాల్సి ఉండగా.. చంద్రబాబు తానే నిర్మాణానికి పూనుకున్నారన్నారు. వ్యయఅంచనాల్ని నూరుశాతం పెంచేసి, పట్టిసీమ అనే అవినీతి ప్రాజెక్టును తెరపైకి తెచ్చి రూ.కోట్లాది ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. మొత్తం కేంద్రమే ఖర్చును భరించాల్సిన పోలవరానికి రూ.100 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించడం సిగ్గనిపించట్లేదా? అని ప్రశ్నించారు. రాజ్యసభ సీటును వైఎస్సార్‌సీపీకి దక్కకుండా చేయాలనేది టీడీపీ ఆలోచనగా ఉందని విలేకరులు ప్రస్తావించగా..‘అది ఆలోచన కాదు.. దురంహకారమంటారు’ అని బొత్స అన్నారు.