
జిల్లాల పునర్విభజనపై సీఎస్‌కు నివేదిక
జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన తాజా నివేదికను భూపరిపాలన కమిషనర్ రేమండ్ పీటర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు...
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన తాజా నివేదికను భూపరిపాలన కమిషనర్ రేమండ్ పీటర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందజేసినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధ వారం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం జరుగనున్న నేపథ్యంలో తాజా నివేదికకు ప్రాధాన్యమేర్పడింది. మంగళవారం సీఎస్‌ను కలిసిన సీసీఎల్‌ఏ నివేదికలోని అంశాలపై సుమారు మూడుగంటల పాటు చర్చించినట్లు సమాచారం.
ఈ నెల 20న జరిగిన సదస్సు అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి తాజాగా అందిన ప్రతిపాదనలను సీసీఎల్‌ఏ నివేదికలో పొందుపరిచారని తె లుస్తోంది. జిల్లాల సంఖ్య 24 లేదా 26 అనే అంశం పక్కనబెడితే, ప్రతిపాదిత జిల్లాల్లో తక్షణం కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పేర్కొన్నారని, మిగిలిన ప్రభుత్వ శాఖల విభజన కొంత ఆలస్యంగా జరిగినా ఇబ్బంది లేదని తెలిపినట్లు సమాచారం.
ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో కొత్త జిల్లాలు ఏర్పడితే జిల్లాపరిషత్‌ల విభజన, కొత్త మండలాలు ఏర్పడితే మండల పరిషత్‌ల విభజనకు సంబంధించి సమగ్రమైన ప్రతిపాదనలను ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కొత్త జిల్లాలకు జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఏవిధమైన పద్ధతులను పాటించాలనే దానిపై కసరత్తు జరుగుతోందని వివరించినట్లు సమాచారం. బుధవారం జరగనున్న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అనంతరం శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు సూచించిన అంశాల మేరకు ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉందని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు.