breaking news
Secretary General Rajiv Sharma
-
జిల్లాల పునర్విభజనపై సీఎస్‌కు నివేదిక
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన తాజా నివేదికను భూపరిపాలన కమిషనర్ రేమండ్ పీటర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందజేసినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధ వారం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం జరుగనున్న నేపథ్యంలో తాజా నివేదికకు ప్రాధాన్యమేర్పడింది. మంగళవారం సీఎస్‌ను కలిసిన సీసీఎల్ఏ నివేదికలోని అంశాలపై సుమారు మూడుగంటల పాటు చర్చించినట్లు సమాచారం. ఈ నెల 20న జరిగిన సదస్సు అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి తాజాగా అందిన ప్రతిపాదనలను సీసీఎల్ఏ నివేదికలో పొందుపరిచారని తె లుస్తోంది. జిల్లాల సంఖ్య 24 లేదా 26 అనే అంశం పక్కనబెడితే, ప్రతిపాదిత జిల్లాల్లో తక్షణం కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పేర్కొన్నారని, మిగిలిన ప్రభుత్వ శాఖల విభజన కొంత ఆలస్యంగా జరిగినా ఇబ్బంది లేదని తెలిపినట్లు సమాచారం. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో కొత్త జిల్లాలు ఏర్పడితే జిల్లాపరిషత్‌ల విభజన, కొత్త మండలాలు ఏర్పడితే మండల పరిషత్‌ల విభజనకు సంబంధించి సమగ్రమైన ప్రతిపాదనలను ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కొత్త జిల్లాలకు జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఏవిధమైన పద్ధతులను పాటించాలనే దానిపై కసరత్తు జరుగుతోందని వివరించినట్లు సమాచారం. బుధవారం జరగనున్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు సూచించిన అంశాల మేరకు ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉందని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఉరుకులు పరుగులు..!
ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వ కసరత్తు షురూ * అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ సమావేశం * ఇప్పటివరకూ అందిన ఖాళీల సంఖ్య 19 వేలు * 24 గంటల్లో ఖాళీ పోస్టుల వివరాలివ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఖాళీల వివరాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులోభాగంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇప్పటివరకూ 19 వేల ఖాళీలకు సంబంధించి వివిధ విభాగాల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. కొన్ని విభాగాల నుంచి ఖాళీల సమాచారం అందలేదు. దీంతో.. అసలు ఖాళీలు ఎన్ని.. ప్రాధాన్యతాక్రమంలో భర్తీ చేయాల్సినవెన్ని.. జోనల్, మల్టీజోనల్, జిల్లా స్థాయి పోస్టుల వివరాలను విభాగాలవారీగా సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఖాళీల వివరాలు, సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతల వివరాలను వెంటనే అందించాలని ఆదేశించారు. మంగళవారంలోగా ఖాళీల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. మొత్తం 25 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తే ఖజానాపై ప్రతి నెలా రూ. 90 కోట్ల భారం పడుతుందని, ఏటా రూ. వెయ్యి కోట్లకు మించి బడ్జెట్ అవసరమవుతుందని ఆర్థిక శాఖ నివేదించింది. గరిష్ఠ వయోపరిమితి పెంపు.. కొత్త ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగుల గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లకు పెంచాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. దీర్ఘకాలంగా నియామకాలు చేపట్టకపోవటంతో లక్షలాది మంది అభ్యర్థులకు సాధారణ వయోపరిమితి దాటిపోయింది. అందువల్ల నిరుద్యోగులకు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు సాధారణ వయోపరిమితి 34 ఏళ్లుగా.. యూనిఫాం సర్వీసులకు 28 ఏళ్లుగా అమల్లో ఉంది. బుధవారంనాటి మంత్రివర్గ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. జోనల్ వ్యవస్థపై మల్లగుల్లాలు ఉమ్మడి రాష్ట్రంలో 371(డి) కింద ఆరు జోన్ల వ్యవస్థ ఉంది. విభజన అనంతరం తెలంగాణలో రెండే జోన్లు ఉన్నాయి. వీటిని రద్దు చేసి ఒక్కటిగా విలీనం చేయాలా.. నాలుగు జోన్లుగా పునర్వ్యవస్థీకరించాలా.. కొత్త ఉద్యోగ నియామకాలకు ఏ విధానం అనుసరించాలనే దానిపై అధికార వర్గాల్లో తర్జనభర్జన మొదలైంది. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ జోన్ల విధానమే అమల్లో ఉంది. దీనికి మార్పులు చేయాలంటే చట్టసవరణ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అందువల్ల రెండు జోన్ల విధానంలోనే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశముంది. ‘శిశు సంక్షేమం’లో సగం పోస్టులు ఖాళీ రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీల సంఖ్యను అధికారులు తేల్చారు. ఈ శాఖలో దాదాపు సగం పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. ఆయా విభాగాల్లో ప్రతిఏటా పదవీ విరమణ చే సినవారి స్థానంలో ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టకపోతుండడమే ఇందుకు కారణమని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదక సమర్పించారు. ఈ మేరకు ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కార్ సమాయత్తమవుతోంది. ఖాళీల కారణంగా వివిధ ప్రాజెక్టుల అమలు ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) రాష్ట్రవ్యాప్తంగా 149 ప్రాజెక్టు(డివిజన్)ల్లో అమలవుతుండగా, 72 సీడీపీవో పోస్టులు ఎంతోకాలంగా భర్తీ చేయలేదు. రా్రష్ట్రవ్యాప్తంగా ఐసీడీఎస్ పరిధిలో కొనసాగుతున్న 35,600 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించేందుకు సూపర్ వైజర్పోస్టులు 374 ఉండగా, వీటిలో 186 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇవి కాక మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న జువైనల్ హోమ్స్, వికలాంగుల సంక్షేమ విభాగాల్లో మూడు, నాలుగో తరగతి కేటగిరీ పోస్టులు 102 ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలోనే ఆయా విభాగాల్లో ఖాళీ పోస్టులు భర్తీ అవుతాయని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.