‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా.. | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా..

Published Wed, Sep 17 2014 1:07 AM

‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా.. - Sakshi

* సైనిక చర్యకు తలవంచిన ఏడో నిజాం
* రజాకార్ల ఆగడాలు అంతమైన రోజు
* స్వేచ్ఛావాయువులు పీల్చిన హైదరాబాదీలుభారత్ వశమైన హైదరాబాద్ సంస్థానం
* ‘సెప్టెంబర్ 17’ ప్రత్యేకం


సాక్షి, సిటీబ్యూరో: 1947లో దేశానికి స్వాతంత్య్ర వచ్చినా హైదరాబాదీలు మాత్రం రజాకార్ల ఆగడాలకు బలయ్యారు. వారి వేధింపు లను భరించలేక విసిగి వేసారి పోయారు. విముక్తి కోసం  కలలుగన్నారు. వారు అనుకున్నట్టుగానే 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు లొంగుబాటుతో ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చారు. భారత సైన్యం నలువైపుల నుంచి హైదరాబాద్‌ను ముట్టడించడంతో ఎట్టకేలకు ఏడో నిజాం వెన్నుచూపాడు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంతో జనమంతా పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. మువ్వన్నెల జెండాలతో పరుగులు తీశారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
 
‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా..
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున ‘ఆపరేషన్ పోలో’ పేరిట సైనిక చర్యకు దిగింది. అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లబ్‌భాయి పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం నాలుగు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది.

నగరానికి  300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్‌దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ.రుద్ర మద్రాస్ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్  నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది. అయినా చివరి క్షణం వరకు నిజాం ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగించింది.
 
సెప్టెంబర్ 14న: దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్ , వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ దాడిని ఎదిరించలేక నిజాం సైనికులు పరుగులు తీశారు. కనిపించిన రోడ్లను, వంతెనలను ధ్వంసం చేశారు. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఆకాశంలో తిరుగుతున్న భారత యుద్ధ విమానాలకు తమ ఉనికి తెలిస్తే బాంబులు వేస్తారనే భయంతో రజాకార్లు ఇళ్లల్లో లైట్లు ఆర్పేయాలని హెచ్చరించారు.
 
సెప్టెంబర్ 16న: ఆ రోజు రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల వశమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్‌చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. కానీ సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు.
 
సెప్టెంబర్ 17న: ఆ రోజు సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించడంతో నగర వాసుల్లో ఉత్సాహం ఉరకలేసింది. అడుగడుగునా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు భారత సైన్యం కవాతు చేసింది.
 
అదే రోజు సాయంత్రం రేడియో ప్రసంగంతో..
సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రసంగించారు. ‘నా ప్రియమైన ప్రజలారా!..  నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. ఈ పని ఇదివరకే చేయాల్సింది. ఆలస్యమైనందుకు విచారిస్తున్నా. యుద్ధం నుంచి నా సైన్యాన్ని విరమించుకుంటున్నా. ఐక్యరాజ్యసమితిలో పెట్టిన కేసు కూడా ఉపసంహరించుకుంటున్నా’ అని ప్రకటించారు. ఆ మరుసటి రోజు ఆయన గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని క లిశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement