కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు దేశ వనరుల్ని దోచిపెడుతున్న వైనానికి నిరసనగా మే 4,5 తేదీల్లో రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు దేశ వనరుల్ని దోచిపెడుతున్న వైనానికి నిరసనగా మే 4,5 తేదీల్లో రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలకు భూమి, నీరు, విద్యుత్ ఉచితంగా ఇస్తూ సామాన్య ప్రజానీకాన్ని గాలికొదిలేస్తున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ మూడవ దశను తీవ్రంగా కొనసాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
అభివృద్ధి పేరుతో చేపట్టిన ప్రాజెక్టులతో సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. హరితహారం పేరుతో ఏజెన్సీలోని ఆదివాసులను అటవీ అధికారులు గెంటివేయడంతో లక్షలాది మంది నిర్వాసితులవుతున్నారన్నారు. కరీంన గర్, వరంగల్ జిల్లాల్లో గ్రానైట్ రాతి గుట్టలను ధ్వంసం చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారన్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి పోలీసు యంత్రాంగాన్ని ఆధునీకరిస్తూ రాష్ట్రంలో రక్తపుటేరులు పారించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని ప్రకటనలో పేర్కొన్నారు. మే 4, 5తేదీల్లో చేపట్టిన బంద్‌కు ప్రజలు బాసటగా నిలవాలని మావోయిస్టు పార్టీ కోరింది.