
67,677 కోట్ల భారం!
ఏళ్లకేళ్లు జాప్యం జరుగుతుండడంతో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు భారంగా మారుతున్నాయి. అంచనా వ్యయాలు వేల కోట్ల మేర పెరిగిపోతున్నాయి.
► సాగునీటి ప్రాజెక్టుల వ్యయం పైపైకి..
► అంచనాల సవరణలతో ఖజానాపై పెనుభారం
► ప్రాజెక్టు పనుల్లో జాప్యమే ప్రధాన కారణం
► వ్యయం, ప్రయోజనాల మధ్య భారీగా అంతరం
► 36 ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం
రూ. 1,76,833 కోట్లు
► సవరణల అనంతరం వ్యయం
రూ. 2,44,617 కోట్లు
► కాళేశ్వరం, పాలమూరుల్లో అదనపు అంచనా
రూ. 57,784 కోట్లు
►పలు ప్రాజెక్టుల కింద ఇప్పటికే పెంపు రూ. 10,000 కోట్లు
హైదరాబాద్ : ఏళ్లకేళ్లు జాప్యం జరుగుతుండడంతో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు భారంగా మారుతున్నాయి. అంచనా వ్యయాలు వేల కోట్ల మేర పెరిగిపోతున్నాయి. సరైన ప్రణాళికా లోపం, అనుమతులు తీసుకోవడంలో నిర్లక్ష్యం, నిధుల ఖర్చునే ప్రామాణి కంగా తీసుకోవడం, పనులు జరుగుతున్నాయిలే అనే భ్రమలో అధికారులు ఉండడం, కాంట్రాక్టర్ల అలసత్వం వంటివే దీనికి కారణమవుతున్నాయి. ప్రాజెక్టుల్లో చాలా వరకు పనులు జరిగినా.. అటవీ, భూసేకరణ, రైల్వే, సహాయ పునరావాసం రూపంలో చివరికి అసలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రాజెక్టుల వ్యయ అంచనాలను పెంచాల్సి వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 15 ప్రాజెక్టుల పరిధిలో ఏకంగా రూ.10 వేల కోట్ల అంచనాలను పెంచగా... పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల కింద మరో రూ.57 వేల కోట్ల మేర అంచనాలను సవరించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఈ సవరణల కారణంగా రూ.67,677.98 కోట్ల మేర అదనపు భారం పడుతోంది.
అనుమతులను పట్టించుకోనందునే!
ప్రాజెక్టుల పరిధిలో కాల్వల తవ్వకం, పైప్లైన్ల ఏర్పాటు, రిజర్వాయర్ల నిర్మాణాలపై అధికారులు చూపుతున్న శ్రద్ధ ఇతర అనుమతులపై చూపడం లేదు. దాంతో ఏళ్లకేళ్లు గడుస్తున్నా అనుమతులు అందడం లేదు. కల్వకుర్తి ప్రాజెక్టును ఏడేళ్ల కింద రూ.2,990 కోట్లతో చేపట్టగా.. తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే రూ.3,264 కోట్లు ఖర్చు పెట్టారు కూడా. అయితే 150 ఎకరాల అటవీ భూమికి సంబంధించి ఇప్పటికీ అనుమతి రాని కారణంగా ఆయకట్టుకు నీరందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దేవాదుల ప్రాజెక్టును రూ.9,427 కోట్లతో చేపట్టగా.. వ్యయం భారీగా పెరిగింది. ఇప్పటివరకు రూ.8,390 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. కానీ 830 ఎకరాల అటవీ భూమికి సంబంధించి ఇప్పటికీ అనుమతులు లేవు. భీమా ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ, ఎస్సారెస్పీ–2 పరిధిలో ఆర్అండ్బీ రోడ్ల సమస్యలు, వరద కాల్వ పరిధిలో సహాయ పునరావాసం, నెట్టెంపాడు పరిధిలో రైల్వే క్రాసింగ్ వంటి సమస్యల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. దీంతో మొత్తంగా 7 భారీ, 8 మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో అంచనాలను సవరించారు. ఈ 15 ప్రాజెక్టుల వాస్తవ పరిపాలనా ఆమోదం రూ.23,907.44 కోట్లుగా ఉండగా... వాటిని రూ.33,800.71 కోట్లకు సవరించారు. అంటే రూ.9,893.27 కోట్ల మేర భారం పెరిగింది. ఈ నెలలోనే కల్వకుర్తి, మత్తడివాగు, నీల్వాయిలకు చెందిన సవరించిన అంచనాల ఉత్తర్వులు రాగా.. మరిన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఉత్తర్వులు రావాల్సి ఉంది.
పాలమూరు మోత..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూ.35,200 కోట్ల అంచనాతో చేపట్టారు. తొలి డిజైన్ ప్రకారం ఈ పథకం ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90 టీఎంసీల వరద జలాలను తీసుకుని 10 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని సంకల్పించారు. అయితే తర్వాత రోజు తీసుకునే నీటిని 2 టీఎంసీలకు, ఆయకట్టు లక్ష్యాన్ని 12.3 లక్షల ఎకరాలకు పెంచారు. దీంతో అంచనా వ్యయం రూ.50,985 కోట్లకు చేరింది. అంటే అదనంగా రూ.15,785 కోట్ల భారం పడుతోంది. ఈ సవరించిన అంచనాలకు ఆమోదం రావాల్సి ఉంది. ఇందులో స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్ల కారణంగా వ్యయం రూ.1,090 కోట్ల మేర పెరగ్గా... వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ వంటి కారణాలతో వ్యయం రూ.2,700 కోట్ల మేర పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఇక్కడ డిస్ట్రిబ్యూటరీ (ప్రధాన కాల్వలకు అనుబంధంగా ఉండే చిన్న కాల్వల)ల సర్వే ఇంకా పూర్తికావాల్సి ఉంది. ఆ సర్వే పూర్తయితే డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి మరో రూ.10 వేల కోట్లు అవసరమనేది అధికారుల ప్రాథమిక అంచనా.
కాళేశ్వరం వాత..
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.38,500 కోట్ల అంచనాతో చేపట్టారు. కానీ దీనిని రీడిజైన్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టడంతో.. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.80,499.71 కోట్లకు చేరుతోంది. ఈ ప్రాజెక్టులో తొలుత 16 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా.. తర్వాత 18.2 లక్షల ఎకరాలకు పెంచారు, మరో 18 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేయాలని నిర్ణయించారు. నీటి నిల్వ కోసం నిర్మించే రిజర్వాయర్ల సామరాథ్యన్ని 11.43 టీఎంసీల నుంచి ఏకంగా 144 టీఎంసీలకు పెంచారు. దీంతో ఇక్కడ వ్యయం ఏకంగా రూ.80,499.71 కోట్లకు చేరింది. అంటే తొలి అంచనాలతో పోలిస్తే రూ.41,999.71 కోట్ల అదనపు భారం పడుతోంది. మొత్తంగా ప్రధానమైన పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు సవరణలతోనే రూ.57,784.71 కోట్ల మేర అదనపు భారం పడనుంది.
పెరగనున్న నిధుల అవసరాలు
రాష్ట్రంలో కొన్నేళ్లుగా 36 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు చేపట్టగా.. వాటికి మొత్తంగా రూ.1,76,833 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే 15 ప్రాజెక్టుల కింద అంచనాలను రూ.10 వేల కోట్ల మేర సవరించడంతో.. ఇది రూ.1.86 లక్షల కోట్లకు చేరుకుంది. దీనికి అదనంగా సవరించనున్న పాలమురు, కాళేశ్వరం అంచనా వ్యయాలు కలుపుకొంటే మొత్తంగా అంచనా వ్యయం రూ.2,44,617 కోట్లకు చేరుతుంది. ఇందులో ఇప్పటికే రూ.53,280 కోట్ల మేర ఖర్చు జరిగినట్లు అంచనా. అంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే ఇంకా రూ.1,91,337 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండనుంది.
ఖర్చుకు తగిన ప్రయోజనముందా?
ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.9 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67.78 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. అయితే ప్రాజెక్టుల అంచనా వ్యయాలు మారుతుండటంతో ‘కాస్ట్ బెనిఫిట్ రేషియో (వ్యయం–ప్రయోజనాల నిష్పత్తి)’ మారుతోంది. పాలమూరు, కాళేశ్వరం మినహాయిస్తే.. మిగతా 15 ప్రాజెక్టుల్లో ఆయకట్టు అదే అయినా వ్యయం మాత్రం పెరుగుతోంది. దీంతో వ్యయంతో పోలిస్తే ప్రయోజనం తగ్గే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ ప్రాజెక్టు అంచనా వ్యయం, ఆయకట్టును పరిగణనలోకి తీసుకుంటే ఏటా ప్రాజెక్టు నిర్వహణకు అయ్యే ఖర్చు రూ.17 వేల కోట్ల వరకు ఉంటుందని... ఆదాయం మాత్రం రూ.4 వేల కోట్లేనని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వ అభిప్రాయం ఏమిటి, వాస్తవాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
=========================
పలు ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో పరిపాలనా అనుమతి, సవరణ తర్వాత అంచనాలు (రూ.కోట్లలో)
ప్రాజెక్టు పరిపాలనా అనుమతి సవరణతో వ్యయం
పాలమూరు 35,200 50,985
కాళేశ్వరం 38,500 80,499.71
కల్వకుర్తి 2,990 5,072.73
నెట్టెంపాడు 1,862.73 2,404.22
భీమా 2,158.40 2,658.48
కోయిల్‌సాగర్ 458.25 708.17
ఎస్సారెస్పీ–2 1,043.14 1303.28
వరద కాల్వ 4,729.26 5,940.09
దేవాదుల 9,427.73 13,445.44
నీల్వాయి 137.71 212.24
ర్యాలివాగు 33.30 56.39
గొల్లవాగు 96.61 110.31
పెద్దవాగు 163.78 246.69
కొమ్రం భీం 450.14 882.36
మత్తడివాగు 58.50 62.50
మోదికుంటవాగు 124.60 456.39
పాలెంవాగు 173.29 241.42
==================================================
మొత్తం 97,607.44 1,65,285.42
==================================================
(వీటిలో పాలమూరు, కాళేశ్వరం వ్యయాల పెంపును ఆమోదించినా.. అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. మిగతా ప్రాజెక్టుల ఉత్తర్వులు వెలువడ్డాయి).