సాగునీటిదే మళ్లీ అగ్రస్థానం | Irrigated water is the top again | Sakshi
Sakshi News home page

సాగునీటిదే మళ్లీ అగ్రస్థానం

Jan 24 2018 2:23 AM | Updated on Jan 24 2018 2:23 AM

Irrigated water is the top again - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈ మారు బడ్జెట్‌లో సాగునీటికే మళ్లీ అగ్రస్థానం దక్కే అవకాశం ఉంది. రెండేళ్లుగా నీటి పారుదల శాఖకు కేటాయిస్తున్న రూ.25 వేల కోట్ల బడ్జెట్‌కు అదనంగా మరో పది శాతాన్ని పెంచి కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ అందింది. దీంతో ఇప్పటికే నీటిపారుదల శాఖ తయారు చేసిన రూ.50 వేల కోట్ల ప్రతిపాదనలను మార్చి కొత్తగా రూ.29,091 కోట్లతో తుది ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపింది. 

మరో 10 శాతం అదనపు కేటాయింపు.. 
గత(2016–17, 2017–18) బడ్జెట్లలో సాగు నీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు చేస్తూ వచ్చింది. 2016–17 బడ్జెట్‌లో కేవలం రూ.14,918 కోట్ల మేర మాత్రమే ఖర్చు జరిగింది. జరగని భూసేకరణ కారణంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.7,860 కోట్లు కేటాయించినా చివరికి రూ.2,851.88 కోట్లకు సవరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.6,280 కోట్లు కేటాయించినా రూ.2,280 కోట్లే ఖర్చయింది. 2017–18 బడ్జెట్‌లోనూ రూ.25 వేల కోట్ల కేటాయింపులు జరిగినా, ఈ నెల 20 నాటికి రూ.15,273.15కోట్లు మేర ఖర్చయింది. ఇందులో రూ.6,532.68 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. మార్చికి కనిష్టంగా ఆర్థిక శాఖ మరో రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు ఇస్తానని అంటోంది. ఈ లెక్కన చూసినా ఈ ఏడాది ఖర్చు రూ.18 వేల కోట్లను దాటడం కష్టమే.  

ఈసారి ఎన్నికల బడ్జెట్‌ 
ప్రస్తుతం మెజార్టీ ప్రాజెక్టులకు సంబంధించి కోర్టు కేసులు, పర్యావరణ, అటవీ సమస్యలు పరిష్కారం కావడం, అదీగాక వచ్చే ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో సాగునీటికి మళ్లీ అగ్రపీఠం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే నీటి పారుదల శాఖ వారం రోజుల కిందట మొత్తంగా రూ.49,539.13 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందులో పాలమూరుకు ఏకంగా రూ.13,350 కోట్లు, కాళేశ్వరానికి రూ.11,851 కోట్లు కావాలన్న ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే నీటి పారుదల శాఖ, ఆర్థిక శాఖల మధ్య జరిగిన చర్చల అనంతరం గత ఏడాది కన్నా 10 శాతం అదనపు కేటాయింపులతో ఈ ప్రతిపాదనలను రూ.30 వేల కోట్లకు కుదించాలన్న సూచనలు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం రూ.29,091 కోట్లతో ప్రతిపాద నలు సిద్ధం చేశారు.

ఇందులో ప్రగతి పద్దు కింద రూ.27,747 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,344 కోట్లు ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.9 వేల కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ..4 వేల కోట్లకు ప్రతిపాదించారు. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆర్డీఎస్, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలకు కలిపి మొత్తంగా రూ.1,793 కోట్లు కోరగా, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కింది అవసరాలకు రూ.1,853 కోట్లు ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ, భక్తరామదాస, వైరా, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులకు రూ.1,596 కోట్లు కోరగా, ఆదిలాబాద్‌ జిల్లాలోని లోయర్‌ పెనుగంగ, ప్రాణహిత, కుమురం భీం ప్రాజెక్టులకు రూ.1,118 కోట్ల మేర ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై ప్రస్తుతంఆర్థిక శాఖ పరిశీలన చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement