
సాక్షి, హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్) ఎలక్ట్రో మెకానికల్ (ఈఅండ్‌ఎం) పరికరాల ధరల పెంపు విషయంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, బీహెచ్‌ఈఎల్‌కు హైకోర్టు మూడు వారాల గడువునిచ్చింది. మూడు వారాలలోపు కౌంటర్ దాఖలు చేసి, కాపీని పిటిషనర్ నాగం జనార్దన్‌రెడ్డికి అందచేయాలని ప్రభుత్వానికి, బీహెచ్‌ఈఎల్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇస్కీ) ఇచ్చిన ధరలను పక్కనపెట్టి డిపార్ట్‌మెంటల్ కమిటీ సలహాదారు చెప్పిన ప్రకారం ఈఅండ్‌ఎం పరికరాల ధరను మోసపూరితంగా పెంచారని, దీనివల్ల ఖజానాకు కోట్లల్లో నష్టం వాటిల్లుతోందని, దీనిపై దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలని నాగం జనార్దన్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, బీహెచ్‌ఇఎల్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం గురించి నాగం జనార్దన్‌రెడ్డి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కౌంటర్ల దాఖలు విషయంలో తమకు మరో మూడు వారాల గడువు కావాలని ప్రభుత్వం, బీహెచ్‌ఇఎల్ తరఫు న్యాయవాదులు కోరారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.