
ఎందుకీ లోగుట్టు?
రాజధాని అభివృద్ధి భాగస్వామ్యం కోసం రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న ‘స్విస్ చాలెంజ్’ పద్ధతిని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
రాజధాని నిర్మాణానికి ‘స్విస్ చాలెంజ్’ టెండర్‌పై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ
సాక్షి, హైదరాబాద్: రాజధాని అభివృద్ధి భాగస్వామ్యం కోసం రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న ‘స్విస్ చాలెంజ్’ పద్ధతిని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దీనికన్నా సీల్డ్ కవర్ టెండర్ విధానమే మేలని స్పష్టం చేసింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో విదేశీ కంపెనీల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది. ప్రతి విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని నిలదీసింది.
స్విస్ ఛాలెంజ్‌కు సంబంధించిన అన్ని విషయాలను బహిర్గతం చేయాల్సిందేనని గతంలో ఇదే హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం గుర్తు చేసింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకునేందుకు అవి అధికారుల వ్యక్తిగత ఆస్తులు కావని, ప్రజల ఆస్తులని స్పష్టం చేసింది. ఆ ఆస్తులకు అధికారులు కేవలం ధర్మకర్తలు మాత్రమేనని తేల్చి చెప్పింది. రాజధాని నిర్మాణానికి సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు (స్విస్ చాలెంజ్) ఆహ్వానిస్తూ జారీ అయిన టెండర్ నోటిఫికేషన్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై నిర్ణయాన్ని ఈ నెల 26వ తేదీన వెలువరిస్తామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 6.84 చదరపు కిలోమీటర్లలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధికి పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ గత నెల 18న సీఆర్‌డీఏ కమిషనర్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ కంపెనీ ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డెరైక్టర్ బి.మల్లికార్జునరావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం మరోసారి విచారణ జరిగింది.
ఆదాయ వివరాలు చెబితే నష్టమేమిటి?
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. టెండర్ నోటిఫికేషన్‌లోని ప్రతి అంశంలో పారదర్శకత లోపించిందన్నారు. ఇందులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించిన వివరాలను ఎక్కడా కూడా బహిర్గతం చేయలేదన్నారు. అలాగే పలు అంశాలపై పిటిషనర్‌తో పాటు ఇతర డెవలపర్లకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని నివేదించారు. బిడ్లు దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఆదాయం ఇంత వస్తుందని తెలిస్తే డెవలపర్‌కు కూడా ఎంత వస్తుందో తెలుస్తుందని, దీంతో బిడ్ దాఖలు విషయంలో స్పష్టత వస్తుందని చెప్పారు. అయినా ఈ విషయాన్ని బహిర్గతం చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో పిటిషనర్ ఇప్పటివరకు బిడ్ దాఖలు చేయలేకపోయారని తెలిపారు. బిడ్ సమర్పణ గడువును 60 రోజులకు పెంచేలా ఆదేశాలివ్వాలని కోరారు.
సీల్డ్ కవర్‌లో ‘సింగపూర్’ ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టు ప్రధాన ప్రతిపాదకుడు సమర్పించిన ప్రతిపాదనలన్నీ సీల్డ్ కవర్‌లో రహస్యంగా ఉన్నాయన్నారు. బిడ్లన్నింటినీ స్వీకరించిన తర్వాత బిడ్డర్లందరి సమక్షంలో సీల్డ్‌కవర్‌ను తెరుస్తామని వివరించారు. ఆదాయ వివరాలు తప్ప మిగిలిన అన్నింటినీ బహిర్గతం చేశామని చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. అసలు విషయాన్ని బహిర్గతం చేయకుండా అన్నీ చేశామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఇటువంటి భారీ ప్రాజెక్టుల విషయంలో ప్రతి చిన్న అంశాన్ని బహిర్గతం చేయాల్సిందేన ని స్పష్టం చేశారు. ఏజీ స్పందిస్తూ.. ప్రభుత్వ కంపెనీకి 42 శాతం ఆదాయం వస్తుందన్నారు. ఎంత ఆదాయం వస్తుం దో తెలియజేయడం వల్ల ప్రభుత్వానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. ప్రధాన ప్రతిపాదకుడు 20 శాతానికి ప్రతిపాదనలు ఇచ్చి ఉంటారనుకుంటే ఆ విషయాన్ని బహిర్గతం చేయడం వల్ల పోటీ బిడ్డర్లు 21 శాతానికి మాత్రమే బిడ్లు దాఖలు చేస్తారని, దీనివల్ల ప్రభుత్వానికి 1 శాతం మేర ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అందువల్లే ఆదాయ వివరాలను బహిర్గతం చేయలేదన్నారు.
ఏజీ అభ్యర్థనలు తిరస్కరణ
అసలు పిటిషనర్‌కు బిడ్‌లో పాల్గొనే అర్హతే లేదంటూ ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వివరాలను ఏజీ కోర్టు ముందుంచారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి వీటన్నింటినీ తదుపరి విచారణ సమయంలోనే పరిశీలిస్తామని, ప్రజా ప్రయోజనాలున్న ప్రాజెక్టుల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఏజీ దాదాపు 20 సార్లకు పైగా కౌంటర్ల దాఖలుకు అనుమతి కోసం అభ్యర్థించారు. బిడ్ల దాఖలుకు సెప్టెంబర్ 1 చివరి తేదీ అని, ఈ దశలో టెండర్ల ప్రక్రియ ఆగిపోతే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఏజీ అభ్యర్థనలను న్యాయమూర్తి తిరస్కరించారు. ‘అయినా అంతా రహస్యంగా సాగే స్విస్ విధానం ఎందుకు? సీల్డ్ కవర్ టెండర్ల విధానాన్నే అమలు చేస్తే బాగుంటుంది కదా. అయినా మీకు సమయం లేదన్న కారణంతో మిగిలిన అన్ని విషయాల్లో చూసీ చూడనట్లు వ్యవహరించాలా?’ అని ప్రశ్నించారు. ఏజీ పదేపదే కౌంటర్ దాఖలు కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ.. శుక్రవారం మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్‌పై నిర్ణయం వెలువరించిన తర్వాత కౌంటర్ దాఖలు చేసుకోవచ్చునని న్యాయమూర్తి రామచంద్రరావు తేల్చిచెప్పారు.
చెప్పేదొకటి.. ఆచరణలో జరిగేదొకటి
న్యాయమూర్తి జోక్యం చేసుకుని ‘అసలు విషయం బహిర్గతం చేయకపోవడంలో మీకుండే అధికారం ఏమిటి? మీరు చేస్తున్న దాని వల్ల కలిగే నష్టం ఏమిటో మీకు అర్థం కావడం లేదు. ప్రతిసారీ ఇలానే చెబుతారు. కాగితాలపై ఒకటి ఉంటుంది. ఆచరణలో మరొకటి జరుగుతుంది. ఇవన్నీ ఎవరికి తెలియవు?’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని శుక్రవారం వెలువరిస్తానని చెప్పారు. ఏజీ స్పందిస్తూ.. శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేస్తామని, దానిని పరిగణనలోకి తీసుకున్న తర్వా త నిర్ణయం వెలువరించాలని కోరారు. అయితే పిటిషన్‌ను విచారణకు స్వీకరించే సమయంలో కౌంటర్ దాఖలు చేస్తామనడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన తర్వాత కౌంటర్ దాఖలు చేసుకోవచ్చునని, అన్ని అంశాలను తుది విచారణ సమయంలో పరిగణనలోకి తీసుకుంటానని తెలిపారు.