అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి తమకు డిపాజిట్ల రూపంలో రావాల్సిన రూ.30 కోట్లకు బదులుగా ఆ సంస్థకు
కొందరు అగ్రిగోల్డ్ డిపాజిటర్ల ప్రతిపాదనపై తేల్చి చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి తమకు డిపాజిట్ల రూపంలో రావాల్సిన రూ.30 కోట్లకు బదులుగా ఆ సంస్థకు విజయవాడలో ఉన్న ఆస్తిని తమకు బదలాయించాలని కోరుతూ కొందరు డిపాజిటర్లు చేసిన విజ్ఞప్తిని ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. తాము డిపాజిటర్లకు భూములు పంచడం లేదని, డబ్బులు పంచుతామని తేల్చి చెప్పింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎగవేయడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌తో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.
ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం తరఫు న్యాయవాది వి.పట్టాభి స్పందిస్తూ.. తమ సంఘంలో ఉన్న 7 లక్షల మంది డిపాజిటర్లకు అగ్రిగోల్డ్ నుంచి రూ.30 కోట్లు రావాల్సి ఉందని, ఇందుకు ప్రతిగా విజయవాడలోని 39 ఎకరాల భూమిని తమకు బదలాయించాలని కోరారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఈ ప్రతిపాదనను ధర్మాసనం తిరస్కరించింది. తమకు అందరి డిపాజిటర్ల ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేసింది.
కార్పొరేట్ కార్యాలయం వేలం రద్దు
విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ కార్పొరేట్ కార్యాలయం వేలానికి మొత్తం 8 బిడ్లు రాగా, బుధవారం నాటి వేలం పాటకు ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. ఈ ఇద్దరిలో ఓ వ్యక్తి అత్యధికంగా రూ.12.13 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, మరో వ్యక్తి రూ.12.09 కోట్లకు బిడ్ దాఖలు చేశారు. రెండో వ్యక్తి కోట్ చేసిన మొత్తానికి మించి వేలం పాట పడేందుకు ముందుకు రాలేదు. దీంతో ఒకే వ్యక్తితో వేలం నిర్వహణ సరికాదని, దీనిని రద్దు చేస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.