గ్రామ పంచాయతీల అధికారాలను కత్తిరించేందుకు ప్లాన్ చేసిన ప్రభుత్వ పెద్దలు, తమ బండారాన్ని బయటపెట్టిన కిందిస్థాయి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల అధికారాలను కత్తిరించేందుకు ప్లాన్ చేసిన ప్రభుత్వ పెద్దలు, తమ బండారాన్ని బయటపెట్టిన కిందిస్థాయి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా.. గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాలను రద్దు చేసే హక్కును కలెక్టర్లకు కల్పించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా జీవో నెంబరు 55ను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించక మునుపే ఉత్తర్వుల తుది ప్రతి(ఫైనల్ డ్రాఫ్ట్) ప్రభుత్వ వెబ్‌సైట్లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.
జీవో 55 జారీ పట్ల సర్పంచుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో జీవోను ఉపసంహరించుకున్నట్లు సర్కారు ప్రకటించింది. కానీ, తెలిసో తెలియక తుది ప్రతిని వెబ్‌సైట్లో పెట్టిన పాపానికి ముగ్గురు సెక్షన్ అధికారులను మాత్రం సర్కారు చిక్కుల్లో పడేసింది. ఉత్తర్వులు బహిర్గతం కావడానికి కారకులుగా భావిస్తూ ఒక సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీపై అభియోగాలు మోపుతూ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పదిరోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అనంతరం విచారణ జరిపి శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.