సెలెక్ట్‌ స్మార్ట్ | GHMC Elections Special | Sakshi
Sakshi News home page

సెలెక్ట్‌ స్మార్ట్

Jan 15 2016 5:12 AM | Updated on Sep 3 2017 3:41 PM

సెలెక్ట్‌ స్మార్ట్

సెలెక్ట్‌ స్మార్ట్

స్మార్ట్ సిటీ..విశ్వనగరం...లివబుల్ సిటీ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలతోపాటు అందరి నోటా ఇదే మంత్రం.

స్మార్ట్ సిటీ..విశ్వనగరం...లివబుల్ సిటీ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలతోపాటు అందరి నోటా ఇదే మంత్రం. డల్లాస్, న్యూయార్క్.. వంటి విశ్వ నగరాల సరసన భాగ్యనగరిని నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆశయం నెరవేరాలంటే త్వరలో గ్రేటర్ పాలకమండలికి ఎన్నికవనున్న కార్పొరేటర్లు ‘హైటెక్ గురూ’ల అవతారం ఎత్తాల్సిందే అంటున్నారు సిటీజనులు. వాట్సప్.. ఫేస్‌బుక్.. ట్విట్టర్ వంటి సోషల్ మీడియాను, ఆన్‌లైన్, ఇంటర్నెట్ మాధ్యమాలను వినియోగించుకొని స్థానిక సమస్యలను గుర్తించడం మొదలు... అది పరిష్కారం అయ్యే వరకు స్మార్ట్‌గా పనిచేసే నవతరం కార్పొరేటర్లు సిటీకి అవసరం అంటున్నాయి మెజార్టీ వర్గాలు. 
- సాక్షి, సిటీబ్యూరో
 
* హై‘టెక్’ కార్పొరేటర్‌లతోనే విశ్వనగరానికి బాటలు..
* విద్యావంతులైన అభ్యర్థులకే ప్రాధాన్యం
* ఆ దిశగా పార్టీలూ ఆలోచించాలి: మేధావి వర్గాలు

నాలుగు వందల ఏళ్ల చారిత్రక హైదరాబాద్ సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే మహానగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు కూడా పరిపాలనలో కొత్త ఒరవడిని సష్టించే దిశగా..పౌరులకు సత్వర సేవలందించేందుకు సాంకేతికంగా పట్టు సాధించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితుల్లో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వినియోగం తప్పనిసరి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకునేందుకు ఇంటర్నెట్ మాధ్యమం ఇప్పుడు కీలకంగా మారింది.

ఈనేపథ్యంలో కంప్యూటర్, పీసీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వినియోగించుకోవడంతోపాటు, కనీస విద్యార్హతలుండి ప్రజలకు అవసరమైన దరఖాస్తులు, వారికి అవసరమైన సమాచారం చేరవేసే సామర్థ్యాలున్న వారికి టిక్కెట్లిస్తే మేలన్న వాదన వినిపిస్తోంది.
 
గతమంతా అంతంతే..
బల్దియా ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్లకు కనీస విద్యార్హతలుండాలన్న నిబంధన తెరమీదకు వస్తోంది. గత బల్దియా పాలకమండలిని(2009) పరిశీలిస్తే మొత్తం 150 మంది కార్పొరేటర్లలో  పీజీ వంటి ఉన్నత విద్య చదివినవారు కేవలం ముగ్గురే ఉన్నారు. ఈసారైన ఆయా పార్టీల నేతలు ఆలోచించి ఉన్నత విద్య, ఉరిమే ఉత్సాహం, సేవాతత్పరత కలిగిన యువతీ యువకులకు సీట్లు కేటాయించాలని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని పౌరులకు జాప్యం లేకుండా స్మార్ట్‌సేవలు అందించాల్సిన పాలకమండలి సభ్యులకు కనీస విద్యార్హతలుండాలన్న వాదనలు జోరందుకున్నాయి.  డివిజన్ స్థాయిలో స్థానికంగా నివాసం ఉండి త్వరితగతిన ప్రజలకు సేవచేసేవారికే ప్రధాన రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం కల్పించాలని సర్వత్రా కోరుతున్నారు.
 
చదువులో రంగ హరి...
2009లో మహానగరపాలక సంస్థలో 150 మంది కార్పొరేటర్లు ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఎన్నికయ్యారు. వీరిలో నిరక్షరాస్యులు ఒక్కరు, పదోతరగతి లోపు చదివినవారు 18 మంది ఉన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు 41 మంది, ఇంటర్మీడియట్ తత్సమాన విద్యనభ్యసించినవారు 30 మంది, డిగ్రీ పూర్తిచేసిన వారు 57 మంది ఉన్నారు. ఇక పీజీ పూర్తిచేసినవారు కేవలం ముగ్గురు మాత్రమే ఉండడం విశే షం. కాగా ఇందులో బీటెక్ పూర్తిచేసినవారు ఒక్కరు,న్యాయశాస్త్రం చదివినవారు 6 గురు,ఎంబీఏ చేసినవారు ఒక్కరు,పాలిటెక్నిక్ డిప్లమో పూర్తిచేసినవారు ఒక్కరు,బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తిచేసినవారు ఒక్కరు, బీఎంఎస్ చేసినవారు ఒక్కరు కాగా..ఐటీఐ చదివినవారు ఒక్కరుండడం గమనార్హం.
 
ఈసారైనా విద్యావంతుల సంఖ్య పెరిగేనా..?
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బల్దియా ఎన్నికల్లో ఈసారైనా నేరచరిత్ర లేని, ఉన్నత విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తటస్థులకు టిక్కెట్లివ్వాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీలు బల్దియా బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తును త్వరలో పూర్తిచేయనున్నాయి. నేడోరేపో అభ్యర్థులను ఖరారు చేయనున్నాయి. కానీ ఈసారి కూడా ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో యధావిధిగా అంగబలం, అర్థబలం, కులం, మతం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాయా..లేక అభ్యర్థుల గుణగణాలు, విద్యార్హతలు,సేవాదక్పథం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాయా అన్నది ప్రశ్న.
 
పట్టభద్రులకు టికెట్లివ్వాలి
బల్దియా ఎన్నికల్లో డిగ్రీ విద్యార్హతలున్న వారు, నేరచరిత్ర లేనివారికి టిక్కెట్లు ఇవ్వాలని మా సుపరిపాలన వేదిక తరఫున అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాం. ఇంటర్మీడియెట్ విద్యార్హత ఉంటేనే బల్దియా బడ్జెట్, నగరపాలక సంస్థ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన ఉంటుంది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో స్థానికసంస్థలకు  పోటీచేస్తున్న అభ్యర్థులకు పదోతరగతి విద్యార్హత ఉండాలన్న నిబంధనను  గతంలో సుప్రీంకోర్టు కూడా సమ ర్థించింది. స్వాతంత్రం సిద్ధించి 65 ఏళ్లయిన నేపథ్యంలో నగరంలో నిరక్షరాస్యులకు టికెట్లు కేటాయించడం అవివేకమే అవుతుంది.
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి
 
విద్య, సామాజిక స్పృహ అవసరం
ఎప్పటి నుంచో హైదరాబాద్‌ని అభివద్ధి చెందుతున్న నగరంగా అనుకుంటున్నాం. అయితే నగరం బహుముఖ అభివృద్ధి సాధించాలంటే.. రాబోయే పాలకులు ఉన్నత విద్యావంతులై, సామాజిక స్పహ ఉంటే బాగుంటుంది. మారుతున్న అవసరాలు, కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎన్నికయ్యే కార్పొరేటర్లు కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఉత్తమం. ప్రపంచంతో నగరం పోటీ పడాలంటే ఎలక్ట్రానిక్ (ఈ) వ్యవస్థపై వారికి అవగాహన అవసరం.
- బి.సంజీవరావు, ఉపాధ్యాయుడు
 
ఉన్నత చదువు అదనపు అర్హత...
ఉన్నత చదువు ఉన్నంత మాత్రాన ఉత్తమ పాలకులుగా మారుతారన్న నియమం ఏమీ లేదు. నామమాత్రంగా చదువుకున్న వారు కూడా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాకపోతే ఇతర మెట్రో నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలంటే కార్పొరేటర్లు డిగ్రీ చేసి ఉంటే కొంత అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సులువుగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. ఉన్నత చదువును ప్రజా సేవ కార్యక్రమాల్లో మిళితం చేస్తే.. కార్పొరేటర్లకు ఎదురే ఉండదు.
-  డా. జీబీ రెడ్డి, యూఎఫ్‌ఆర్‌ఓ జేడీ, ఓయూ
 
నిస్వార్థ నాయకులే కావాలి
కార్పొరేటర్లుగా ఎన్నికయ్యే వారు నిస్వార్థ నాయకులై ఉండాలి. కబ్జాకోర్లు, నేరచరిత్రులకు టికెట్లు ఇవ్వకూడదు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవాభావం ఉన్నవారికే నా ఓటు. నగరాభివద్ధికి నిస్వార్థ నేతలే పాటుపడతారన్నది నా న మ్మకం. ఇక చదువుకు అన్ని పార్టీలు ప్రాముఖ్యత ఇవ్వాలి. విద్యావంతులు ఎన్నికైతే ప్రజల సమస్యలు త్వరితగతిన అర్ధం చేసుకోగలుగుతారు. అందుకనుగుణంగా ఉత్తమ సేవలు అందే అవకాశం ఉంటుంది.
-  సుమశ్రీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement