కాలంతో ‘కాళేశ్వరం’ పరుగు! | Boom in the Kaleshwaram works | Sakshi
Sakshi News home page

కాలంతో ‘కాళేశ్వరం’ పరుగు!

Jan 14 2018 1:05 AM | Updated on Oct 30 2018 7:50 PM

Boom in the Kaleshwaram works - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మెజారిటీ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌ నాటికి సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సంక్రాంతి నాటికి మరో నాలుగున్నర నెలల గడువే ఉన్న నేపథ్యంలో ప్రతి రోజూ నీటిపారుదల శాఖకు పరీక్షే కానుంది. ఓ వైపు బ్యారేజీల పనులు, గేట్ల ఏర్పాటు, మరోవైపు పంపులు, మోటార్ల బిగింపు, ఇంకోవైపు సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లను సమాంతరంగా చేపట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ల మోటార్లు ఫిబ్రవరి చివరి నాటికి విదేశాల నుంచి రానుండగా.. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీల్లో పంపుల బిగింపు ఇప్పటికే మొదలైంది.

మిడ్‌మానేరు వరకు.. 
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్‌లను వేగంగా పూర్తిచేసి జూన్‌ నుంచి కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీ గోదావరి జలాలను మిడ్‌మానేరుకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. అన్ని బ్యారేజీలు, పంపుహౌస్‌లలో ఇప్పటికే మెజార్టీ మట్టి పని, కాంక్రీట్‌ పనులు పూర్తికాగా... కీలకమైన గేట్లు, మోటార్ల బిగింపు జరగాలి. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో మాత్రం పనులు నెమ్మదిగా జరుగుతుండగా.. వాటిని నవంబర్‌ చివరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ పనులు పూర్తికాకున్నా మేడిగడ్డ పంపుహౌస్‌ ద్వారా ఒక టీఎంసీ చొప్పున నీటిని తరలించే అవకాశమున్న నేపథ్యంలో.. మిగతా పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అన్నారం బ్యారేజీకి 66 గేట్లు ఏర్పాటు చేసే ప్రక్రియ మూడు రోజుల్లో మొదలు కానుంది. మేడిగడ్డలో 85, సుందిళ్లలో 74 గేట్లు అమర్చాల్సి ఉండగా.. వాటన్నింటికీ మే చివరి వారానికి పూర్తి చేయనున్నారు. ఇక మేడిగడ్డకు అవసరమైన 11 మోటార్లు, అన్నారం వద్ద అవసరమైన 8 మోటార్లను ఆస్ట్రియా నుంచి తెప్పిస్తుండగా.. సుందిళ్ల కోసం దేశీయంగానే తీసుకోనున్నారు.

17 నుంచి మంత్రి హరీశ్‌ పర్యటన 
సీఎం ఆదేశాల మేరకు గతేడాది డిసెంబర్‌లో మూడు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పర్యటిం చిన మంత్రి హరీశ్‌రావు.. సంక్రాంతి అనంతరం 17 నుంచి మరో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. బ్యారేజీ, పంపుహౌస్, టన్నెళ్ల పనులను పరిశీలించి.. పనుల వేగంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

వచ్చే నెలలో రెండు పంపులకు డ్రైరన్‌ 
ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6, 8లలో ఫిబ్రవరి మొదటి వారంలో రెండు పంపులను డ్రైరన్‌ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్యాకేజీ–6లో గ్రావిటీ కెనాల్, టన్నెల్, పంపుహౌస్‌లు నిర్మించాల్సి ఉండగా 88 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 124 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు పంపులను ఇప్పటికే సిద్ధం చేశారు. మరో రెండు పంపుల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇక ప్యాకేజీ–7లో మేడారం రిజర్వాయర్‌తో పాటు 11.24 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణం అవసరంకాగా.. టన్నెళ్ల నిర్మాణం పూర్తయి లైనింగ్‌ పనులు జరుగుతున్నాయి.

ఇక ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యంతో 22,036 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే ఏడు పంపులను అమర్చుతున్నారు. మొత్తంగా 115.40 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. ఈ అతి భారీ మోటార్లలో రెండింటిని ఫిబ్రవరి తొలివారంలో డ్రైరన్‌ నిర్వహించి పరిశీలించనున్నారు. మిగతా మోటార్లను జూన్‌ నాటికి సిద్ధం చేసేలా ప్రణాళిక వేశారు. మొత్తంగా ఈ మూడు ప్యాకేజీల పనులకు మే 31 డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఇక విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లను మార్చి నాటికి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement