
‘ఇలాంటి వార్త నేనెక్కడా వినలేదు’
రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విస్మయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విస్మయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. వివిధ పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 48 మంది టీఆర్‌ఎస్‌లో చేరితో రాజకీయపార్టీలేవైనా ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఏం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్రనేతలనే ప్రశ్నించినట్టుగా తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండేళ్లపాలనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సమగ్ర నివేదికను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు, పార్టీ ఇన్‌చార్జీల సమక్షంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. బీజేపీ ముఖ్యులతో ఢిల్లీలో ఇటీవల జరిగిన ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చ, నిర్ణయాలు జరిగాయి. బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి నెలకోసారి రాష్ట్రంలో పర్యటించాలని అమిత్ షా నిర్ణయించారు.
అయితే పార్టీ ఫిరాయింపులపై అమిత్ షా విస్మయాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఇలాంటి అప్రజాస్వామిక చర్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యల వల్ల జరిగే దుష్పరిణామాలపై క్షేత్రస్థాయిదాకా చర్చకు పెట్టాలని పార్టీ శ్రేణులకు అమిత్ షా సూచించారు. ‘టీడీపీ ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడమే కాకుండా మంత్రి పదవిని కట్టబెట్టారా? ఇలాంటి వార్తను నేనెక్కడా వినలేదు. ఇంత జరిగితే ఆ పార్టీలేం చేస్తున్నాయి? ప్రజాస్వామ్య పరిరక్షణకు మీరేం చేస్తున్నారు? ప్రజల్లో అవగాహన, సున్నితత్వం పెంచడానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించారు.