సరి 'కొత్త'గా పాలన!


విజయదశమి రోజున కొత్తగా 21 జిల్లాలకు అంకురార్పణ





 

 రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలపైనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతమున్న పది జిల్లాలకు తోడు ఈ నెల 11న విజయదశమి రోజున కొత్తగా 21 జిల్లాలకు అంకురార్పణ జరుగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. చాలా చోట్ల ప్రస్తుతమున్న ప్రభుత్వ కార్యాలయాలనే కలెక్టరేట్లుగా మార్చగా.. కొన్ని చోట్ల మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలను కలెక్టర్ కార్యాలయాలుగా సిద్ధం చేసింది. సదుపాయాలను బట్టి ప్రస్తుతం ఆయా భవనాల్లోనే అన్ని శాఖలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్‌తో పాటు జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఇతర శాఖల అధిపతులకు నూతన భవనాల నిర్మాణానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. అప్పటిదాకా తాత్కాలిక ఏర్పాట్లే దిక్కు కానున్నాయి. ఇక కొత్త జిల్లాల్లో ఆయా శాఖలకు అధిపతులుగా కింది కేడర్ల అధికారులకు అవకాశం లభిస్తోంది. మొత్తంగా కొన్ని శాఖలను కలిపేయడం, మరికొన్ని శాఖలకు సిబ్బందిని కుదించడం వంటి చర్యలతో ప్రభుత్వం కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటును పూర్తి చేసింది. గత 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ దీనిపైనే దృష్టిని కేంద్రీకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో ఆయా శాఖల స్వరూపం ఎలా ఉండనుంది, శాఖలకు అధిపతులుగా ఎవరు ఉంటారు, పరిపాలనా విధానం తదితర అంశాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

 

 జిల్లా పోలీస్ బాస్‌లుగా ఐపీఎస్‌లే!


 - పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పోలీసు శాఖ ఏర్పాట్లు

 - 24 పోలీస్ సబ్ డివిజన్లు,28 సర్కిళ్ల ఏర్పాటు

 

 పోలీసు శాఖలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రస్తుత విధానమే కొనసాగనుంది. జిల్లా పోలీస్ బాస్‌లుగా ఐపీఎస్ అధికారులనే నియమిస్తారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం నాటికి కొత్త జిల్లాల పోలీస్ బాస్‌ల నియామకాన్ని పూర్తి చేసేందుకు వీలుగా పోలీసు శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో పరిపాలన విభాగం, నేరాలకు సంబంధించిన బాధ్యతలను అదనపు ఎస్పీ పర్యవేక్షించేవారు. ఇప్పుడు వారి స్థానంలో సీనియర్ డీఎస్పీ అధికారులను నియమించనున్నారు. ప్రస్తుతమున్న ఎస్పీలను అదే స్థానాల్లో కొనసాగించి.. నూతనంగా ఏర్పాటయ్యే జిల్లాల్లో కొత్త వారిని నియమిస్తారు.



ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పోలీస్‌స్టేషన్లు, సర్కిళ్లు, సబ్ డివిజన్లలోనూ మార్పులు చేర్పులు చేశారు. నూతనంగా ఏర్పడనున్న రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా పోలీసుశాఖ కూడా కొత్తగా 24 సబ్ డివిజన్లను, 28 సర్కిళ్లను ఏర్పాటు చేస్తోంది. నూతన మండలాలకు అనుగుణంగా కొత్తగా 56 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు పోలీసుశాఖలో కీలకమైన సీఐడీకి సంబంధించి మరో రెండు ప్రాంతీయ యూనిట్లను ఏర్పాటు చేయాలని హోంశాఖ భావిస్తోంది. అందుకు అనుగుణంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకటి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో ప్రాంతీయ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ, సైనిక సంక్షేమానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుత విధానాన్నే కొనసాగించనున్నారు.



 కొత్త కమిషనరేట్లకు ఎస్పీలే బాసులు

 మరోవైపు ఐపీఎస్‌ల కొరత కారణంగా నూతన జిల్లాలకు బాసుల నియామకంపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో గ్రేహౌండ్స్, సీఐడీ, ట్రాఫిక్, సీసీఎస్ వంటి విభాగాల నుంచి కొంత మంది ఐపీఎస్‌లను తీసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మ నిర్ణయించారు. కొంత మంది సీనియర్ ఏఎస్పీలకు అడ్‌హాక్ ప్రమోషన్లు కల్పించి నూతన జిల్లాల బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక 16 మంది అదనపు ఎస్పీలను నాన్ కేడర్ ఎస్పీలుగా నియమించనున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరోవైపు నూతనంగా ఏర్పడనున్న కమిషనరేట్లకు ఐజీ స్థాయి అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎస్పీలనే కొనసాగించాలని హోంశాఖ భావిస్తోంది.

 

 కొత్త జిల్లాల్లో ‘డీఈవో అండ్ డీపీవో’

 - ఎస్‌ఎస్‌ఏ డీపీవో, డిప్యూటీ ఈవో పోస్టులు రద్దు!

 - ఖరారైన విద్యా శాఖ సమగ్ర స్వరూపం

 

 సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో పాఠశాల విద్యా శాఖ సమగ్ర స్వరూపం ఖరారైంది. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాల్లో సర్దుబాటు చేసింది. ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇపుడున్న విభాగాలను సగానికి కుదించి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు అన్నీ సిద్ధం చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో వేర్వేరుగా ఉన్న డీఈవో, సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ (డీపీవో) కార్యాలయాలను విలీనం చేస్తోంది. కొత్త జిల్లాల్లో ఇక  డీఈవో పరిధిలోనే అన్ని కార్యక్రమాలూ కొనసాగుతాయి. ఈ రెండింటిలోని సిబ్బందిని కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసింది. ఇప్పటివరకు ఉన్న డీఈవో కార్యాలయాల్లోని స్ట్రక్చర్ రూపురేఖలను మార్చేసింది. ఎస్‌ఎస్‌ఏ డీపీవోను రద్దు చేసి, కొత్త జిల్లాల్లో డీఈవో అండ్ డీపీవోగా కొనసాగించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విద్యా శాఖకు జిల్లాల్లో 961 మంజూరైన పోస్టులుండగా, 761 మంది పని చేస్తున్నారు. మిగతావి ఖాళీగా ఉన్నాయి. కొత్త జిల్లాల్లో 969 పోస్టులు కావాలని లెక్కలు తేల్చింది. ప్రస్తుతానికి ఉన్న సిబ్బందినే అన్ని జిల్లాలకూ సర్దుబాటు చేసింది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డిప్యూటీ ఈవో) పోస్టులను రద్దు చేసింది. 120 కొత్త మండలాల్లో ఎంఈవో పోస్టులను సృష్టించేందుకు చర్యలు చేపట్టింది.



 ఇప్పటివరకున్న వ్యవస్థ ఇదీ..

  ఇప్పుడు డీఈవో కార్యాలయాల్లో డీఈవో కింద డిప్యూటీ ఈవో, అసిస్టెంట్ డెరైక్టర్ (ఏడీ), అసిస్టెంట్ కమిషనర్ ప్రభుత్వ పరీక్షల విభాగం (ఏసీజీ), అకౌంట్స్ ఆఫీసర్ (ఏవో), డిప్యూటీ ఈవో (ఆర్‌ఎంఎస్‌ఏ) ఉన్నారు. ఇక ఏడీ కింద సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్, లాస్ట్‌గ్రేడ్ సర్వీసెస్ స్వరూపాలు ఉండగా, ఎస్‌ఎస్‌ఏ డీపీవో కింద సెక్టోరియల్ ఆఫీసర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) ఉన్నారు. సెక్టోరియల్ ఆఫీసర్ కింద అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్, మినిస్టీరియల్ స్టాఫ్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ స్వరూపం ఉంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ కింద సీనియర్ అకౌంటెంట్ ఉండగా, ఈఈ కింద డిప్యూటీ ఈఈ ఉన్నారు.



 కొత్త డీఈవో కార్యాలయాల స్వరూపం ఇలా..

► కొత్త జిల్లాల్లో డీఈవో అండ్ డీపీవో ఒకరే ఉంటారు. వీరి కింద ఏడీ, ఏసీజీఈ, ఫైనాన్స్ ఏవో ఉంటారు. ఏడీ కింద సూపరింటెండెంట్, సీని యర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, లాస్ట్‌గ్రేడ్ సర్వీసెస్ ఉంటాయి. ఎఫ్‌ఏవో కింద సీనియర్ అకౌంటెంట్ ఉంటారు.

► ప్రస్తుతం ఉన్న డీఈవోలతో పాటు డిప్యూటీ ఈవో, ఏడీలనే డీఈవో ఆండ్ డీపీవోగా నియమిస్తారు. 31 జిల్లాల్లోని ప్రభుత్వ పరీక్షల విభాగం పనులను ప్రస్తుతం ఉన్న 10 జిల్లాల్లోని ఏసీజీసీలకు అప్పగిస్తారు. ప్రస్తుత ఆర్‌ఎంఎస్‌ఏ పరిధిలోని 10 మంది ఎఫ్‌ఏవోలు, 10 మంది ఏవోలు, ఎస్‌ఎస్‌ఏ పరిధిలోని 7 మంది అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లను అన్ని డీఈవో కార్యాలయాలకు సర్దుబాటు చేస్తున్నారు.

 

 ఇంటర్‌కు జిల్లాల్లో అధికారి ఒక్కరే

 ఇంటర్మీడియట్ విద్య కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీవీఈవో), ఇంటర్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించే రీజనల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్‌ఐవో) వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తోంది. కొత్త జిల్లాల్లో ఈ రెండింటిని కలిపి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) పేరుతోనే కొత్త కేడర్‌ను సృష్టించి, అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. డీఐఈవో పరిధిలోనే జిల్లాల్లోని ఇంటర్ విద్య, ఇంటర్ బోర్డు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం 11 మంది ఆర్‌ఐవోలు (ప్రిన్సిపల్ కేడర్), 7 మంది డీవీఈవోలు మొత్తంగా 18 మంది ఉన్నారు.



మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న 18 మందిని 18 జిల్లాల్లో డీఐఈవోలుగా నియమించి, మిగతా జిల్లాలను వారి పరిధిలోకే తీసుకురానున్నారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ కమిటీకి ఇంటర్మీడియట్ విద్య శాఖ, ఇంటర్ బోర్డు అందజేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా కొనసాగుతున్న 13 మంది ఇకపై 13 జిల్లాల్లో డీఐఈవోలకు సహాయకులుగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పేరుతో పని చేస్తారు. మిగతా 18 జిల్లాల్లో సూపరింటెండెంట్లు డీఐఈవోలకు సహాయకులుగా ఉంటారు. ఏవోలకు సీనియర్ అసిస్టెంట్లు సహాయకులుగా ఉంటారు. మొత్తానికి ఇంటర్మీడియట్ విద్య, బోర్డు కార్యకలాపాలను.. ప్రస్తుతమున్న 78 మందితోనే కొత్త జిల్లాల్లోనూ కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

 ఎంవీఐలే జిల్లా అధికారులు

 రవాణాశాఖకు సంబంధించి ప్రతి జిల్లాకు ఒక అధికారి ఉంటారు. ప్రస్తుతమున్న జిల్లాల్లో పలుచోట్ల జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లు, మరికొన్నిచోట్ల డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లు, ఇంకొన్ని చోట్ల మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ)లు జిల్లాస్థాయి అధికారులుగా ఉన్నారు. కొత్త జిల్లాల నేపథ్యంలో ఎక్కువ జిల్లాలకు ఎంవీఐలే జిల్లా అధికారులుగా వ్యవహరించనున్నారు. రవాణాశాఖలో సిబ్బంది కొరత ఉంది. దీంతో కొత్త జిల్లాల్లో పని ప్రారంభించేం దుకు పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ కోరినా.. ఉన్న సిబ్బందితోనే నెట్టుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వనపర్తి, నాగర్‌కర్నూలు, వికారాబాద్, భూపాలపల్లిలో మినహా అన్ని కొత్త జిల్లాల్లో రవాణాశాఖకు కార్యాలయాలున్నాయి. ఈ నాలుగు చోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.



ప్రధాన కార్యాలయం, జిల్లా స్థాయి కార్యాలయాల నుంచి కంప్యూటర్ల తరలింపు ఇప్పటికే పూర్తయింది. ఇక ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్ చేసుకున్న కొత్త జిల్లాల పరిధిలోని వారికి దసరా నుంచి కొత్త కార్యాలయాల్లోనే సేవలు అందిస్తారు. ఇప్పటికే స్లాట్లను వాటి పరిధిలోకి బదిలీ చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో సిబ్బందిలో గందరగోళం లేకుండా ఉండేందుకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  కొత్త జిల్లాలకు రిజిస్ట్రేషన్ కోడ్‌ల కేటాయింపుపై ఆదివారం స్పష్టత రానుంది.

 

 ఆర్టీసీలో జిల్లా అధికారులుగా డీవీఎంలు

 ఆర్టీసీలో ఒక్క హైదరాబాద్ జోన్ మినహా మిగతా చోట్ల పాలనా వ్యవస్థలో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక జిల్లాను రీజియన్‌గా పరిగణిస్తూ రీజనల్ మేనేజర్ పర్యవేక్షణలో ఉండగా.. ఈ అధికారి కింద ఇద్దరు డీవీఎం కేడర్ అధికారులు ఉన్నారు. వీరిలో ఒకరు డిప్యూటీ సీటీఎంగా ఆపరేషన్స్‌ను, మరొకరు డిప్యూటీ సీఎంఈగా మెయింటెనెన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేశారు. డిప్యూటీ సీటీఎం, డిప్యూటీ సీఎం ఈలను డీవీఎంగానే మార్చేసి.. కొత్త జిల్లాలకు అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. రెండు రకాల విధులనూ వారే పర్యవేక్షిస్తారు.



ఒక జిల్లా నాలుగు కొత్త జిల్లాలుగా మారిన చోట ఒక్కో అధికారికి రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా 17 మంది డీవీఎం స్థాయి అధికారులు ఉండగా... గ్రేటర్ పరిధిలోని 4 జిల్లాలుపోగా మిగతా జిల్లాల బాధ్యతలను వారికి అప్పగించారు. అంటే ఎనిమిది మందికి ఒక్కో జిల్లా చొప్పున, మరో ఎనిమిది మందికి రెండు జిల్లాల చొప్పున బాధ్యతలు ఇవ్వగా.. ఒక అధికారికి 3 జిల్లాల బాధ్యత అప్పగించారు. హా ఆదిలాబాద్, నిర్మల్‌కు సంబంధించి నిర్మల్‌లో ప్రధాన కార్యాలయం ఉంటుంది. కరీంనగర్, పెద్దపల్లి కలిపి కరీంనగర్‌లో.. వరంగల్, భూపాలపల్లి కలిపి వరంగల్‌లో.. వరంగల్ రూరల్, మహబూబాబాద్ కలిపి హన్మకొండలో.. మహబూబ్‌నగర్, వనపర్తి కలిపి మహబూబ్‌నగర్‌లో.. నల్లగొండ, సూర్యాపేట కలిపి నల్లగొండలో.. మెదక్, సంగారెడ్డి కలిపి సంగారెడ్డిలో.. హైదరాబాద్, శంషాబాద్, మేడ్చల్(మల్కాజిగిరి) కలిపి హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రాలు ఉంటాయి. మిగతావి ఏ జిల్లా కేంద్రంలో ఆ జిల్లా ప్రధాన కార్యాలయాలు ఉం టాయి. శంషాబాద్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తారు. హా సిద్దిపేట, జగిత్యాల, సూర్యాపేటల్లో సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలు సమకూర్చుకున్నారు. కొత్తగూడెంలో బస్టాండ్‌పైన ఉన్న భవనాన్ని కార్యాలయంగా మార్చారు. హా మెదక్, జనగామ, యాదాద్రి, భూపాలపల్లిలలో ఒకే డిపో చొప్పున ఉన్నాయి.

 

 ఆర్‌అండ్‌బీ అధికారులుగా ఈఈలు

 రోడ్లు భవనాల శాఖలో ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారిగా సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఉండగా.. ఇకపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) స్థాయి అధికారులు ఆ బాధ్యతను నిర్వర్తిస్తారు. మూడు, నాలుగు జిల్లాలకు కలిపి పర్యవేక్షణాధికారిగా ఎస్‌ఈ వ్యవహరిస్తారు. ఇక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ) పెద్ద జిల్లాల్లో ముగ్గురు చొప్పున, చిన్న జిల్లాల్లో ఇద్దరు చొప్పున ఉంటారు. కొత్తగా ఏర్పడేవి సహా అన్ని జిల్లాల్లో ఆర్‌అండ్‌బీ కార్యాలయాలున్నందున వాటి ద్వారానే పాలన ప్రారంభిస్తారు. ఈఈ పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నందున కొత్తగా 4 పోస్టులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్‌అండ్‌బీకి సంబంధించి న కొందరు ఈఈ స్థాయి అధికారులు డిప్యుటేషన్‌పై వేరే శాఖల్లో పనిచేస్తున్నారు. కొందరు సెలవుల్లో ఉన్నారు. వారితో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇక ఈ శాఖ పరిధిలో మూడు సర్కిళ్ల హెడ్‌క్వార్టర్లను మార్చనున్నారు. ములుగు నుంచి భూపాలపల్లికి, మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు, కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూలుకు మారుస్తారు.



 కొత్తగా మూడు సీటీవో కార్యాలయాలు

 వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, వికారాబాద్‌లలో సీటీవో కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఉప్పల్‌లో కొత్త సర్కిల్‌ను ఏర్పాటు చేస్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top