సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విప్లవ రచయితల సంఘం(విరసం) రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, సీనియర్ సభ్యులు వరవరరావు, కార్యవర్గ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
యూనివర్సిటీల్లో అణిచివేత విధానాలు
Jan 19 2016 12:21 PM | Updated on Sep 3 2017 3:55 PM
- నిష్పాక్షిక విచారణ జరగాలి
- ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విప్లవ రచయితల సంఘం(విరసం) రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, సీనియర్ సభ్యులు వరవరరావు, కార్యవర్గ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
దేశంలో విశ్వవిద్యాలయాలన్నీ మైనార్టీ, నిమ్న, దళిత విద్యార్థుల పాలిట కబేళాలుగా మారుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలను మత రాజకీయాలకు కేంద్రంగా మలుచుకోదలుచుకున్న బీజేపీ చర్యలే రోహిత్ మృతికి కారణమని వారు పేర్కొన్నారు. జ్ఞాన భండాగారాలుగా విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తుల కబంధ హస్తాల్లో నలిగిపోతుండడానికి నిదర్శనమే దళిత విద్యార్థుల సస్పెన్షన్, బలవన్మరణాలని వారు వివరించారు. మద్రాస్ ఐఐటీలో అంబేద్కర్ పెరియార్ స్టడీ సెంటర్‌ని బ్యాన్ చేయడం మొదలు హెచ్‌సీయూలో ఐదుగురు విద్యార్థుల బహిష్కరణ దాకా బ్రాహ్మణీయ ఆధిపత్యమే కనిపిస్తుందని వారు పేర్కొన్నారు. గత కొంత కాలంగా యూనివర్సిటీల్లో సాగిన, సాగుతున్న అణచివేత విధానాలపై నిష్పాక్షిక విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని విరసం ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.
Advertisement
Advertisement