కోర్టు ఉత్తర్వులపై సుజనా అప్పీల్ | Sujana chowdary appeals on High court orders | Sakshi
Sakshi News home page

కోర్టు ఉత్తర్వులపై సుజనా అప్పీల్

Jul 9 2015 2:04 AM | Updated on Sep 2 2018 5:11 PM

కోర్టు ఉత్తర్వులపై సుజనా అప్పీల్ - Sakshi

కోర్టు ఉత్తర్వులపై సుజనా అప్పీల్

సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మారిషష్ కమర్షియల్ బ్యాంక్(ఎంసీబీ)కి మధ్య అప్పు వివాదానికి సంబంధించి సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన అప్పీల్‌పై హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

తీర్పు వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మారిషష్ కమర్షియల్ బ్యాంక్(ఎంసీబీ)కి మధ్య అప్పు వివాదానికి సంబంధించి సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన అప్పీల్‌పై హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తమకు బకాయిపడ్డ డబ్బుపై ఎంసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు మారిషస్‌లోని హేస్టియా అనుబంధ కంపెనీ.
 
ఈ కంపెనీ ఎంసీబీ నుంచి రూ.106 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణానికి సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. అయితే తీసుకున్న అప్పును హేస్టియా తీర్చకపోవడంతో హామీగా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ ఆస్తులు అమ్మి తమ అప్పులు తీర్చేలా ఆదేశాలివ్వాలంటూ ఎంసీబీ హైకోర్టులో కంపెనీ పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి ఎంసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుజనా యూనివర్సల్ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా సుజనా తరఫు న్యాయవాది, ఎంసీబీ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement