జంట వ్యాధులతో గజగజ | sugar and bp in amaravati people | Sakshi
Sakshi News home page

జంట వ్యాధులతో గజగజ

Jan 15 2018 9:17 AM | Updated on May 25 2018 7:10 PM

sugar and bp in amaravati people  - Sakshi

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రజలను జంట భూతాలు (మధుమేహం, బీపీ) పీక్కుతింటున్నాయి. వారికి తెలియకుండానే వారి శరీరంలోని అవయవాలను క్షీణింపజేస్తున్నాయి. ఇటీవల కాలంలో యువతపైన కూడా తమ ప్రభావం చూపుతున్నాయి. రానున్న కాలంలో మరింత ప్రమాదం పొంచి ఉందని వైద్యులు  హెచ్చరిస్తున్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రైవేటు బ్యాంకులో పనిచేసే 35 ఏళ్ల యువకుడు ఇటీవల ఎక్కువ నీరసంగా ఉండటంతో  వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. రక్తపోటు అధికంగా ఉండడంతో పాటు, మూత్రపిండాల్లో ఫిల్టర్స్‌ పదిశాతం వరకూ దెబ్బ తిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదేళ్ల నుంచి రక్తపోటు ఉన్నా గుర్తించక పోవడంతో ఆ ప్రభావం మూత్ర పిండాలపై చూపింది. ప్రస్తుతం రక్తపోటు క్రానిక్‌ (దీర్ఘకాలిక వ్యాధిగా)డీసీజ్‌గా మారినట్లు వైద్యులు తెలిపారు.
ఇరిగేషన్‌శాఖలో పనిచేసే 28 ఏళ్లు ఉద్యోగి తరచూ కళ్లు తిరిగినట్లు ఉండటంతో ఇటీవల వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అతని శరీరంలో చక్కెర స్థాయి 160 ఉండటంతో పాటు, హెచ్‌బీఏ 1సీ 10కి చేరింది. మరికొంతకాలం ఇదే పరిస్థితి ఉంటే  గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరించారు.
ఇలా వీరిద్దరే కాదు.. నగరంలో అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంట భూతాల బారిన పడుతున్నారు. నగరంలోని ఆస్పత్రుల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్ధారణ అవుతుంది. చిన్న వయస్సులోనే సోకుతున్న వ్యాధులపై అప్రమత్తం కాకుంటే రానున్న రోజుల్లో మనిషి జీవిత కాలంలో పది నుంచి పదిహేనేళ్లు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో వయస్సు 30 సంవత్సరాలు దాటిన వారిలో 12 శాతం మంది మధుమేహం, 10.5 శాతం మంది బీపీతో భాదపడుతున్నట్లు తేలింది.

జంట వ్యాధులకు కారణాలివే
జీవనశైలిలో మార్పులు, మాంసాహారం, కార్బోహైడ్రేడ్స్‌ ఎక్కువుగా ఉండే  జంక్‌ ఫుడ్స్‌  తీసుకోవడం, శారీరక శ్రమ లేక పోవడం కారణంగా తేలింది. అంతేకాకుండా ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా రక్తపోటు పెరగడానికి కారణంగా గుర్తించారు. రాజధాని ప్రాంత ఉద్యోగుల్లో 70 శాతం మంది ఒత్తిడికి గురవడం కూడా చిన్న వయస్సులోనే రక్తపోటు, బీపీకి కారణాలుగా చెబుతున్నారు.

వీటిని అరికట్టేందుకు ఏం చేయాలంటే..
జంట వ్యాధులను అరికట్టేందుకు ప్రతిరోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం, వాకింగ్‌ లాంటివి తప్పక చేయాలి.
విధి నిర్వహణలో, జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగ చేయడం మంచిది.
ఆహారంలో కార్బోహైడ్రేడ్స్‌ తక్కువుగా ఉండేలా చూసుకోవాలి, మాంసాహారం, జంక్‌ ఫుడ్స్‌ను తగ్గించాలి.
పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజా పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువుగా తినాలి.
శరీరంలో బీపీ, చక్కెర స్థాయి, కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకునేలా తరచూ పరీక్షలు చేయించుకోవాలి.
ప్రతి మనిషి నెలకు 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం.
ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది.

ముందు చూపే మేలు
చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు గురైన వారిని నిత్యం చూస్తున్నాం.  పదేళ్లలో వాటి ప్ర భావం గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాలపై పడుతుంది. కాళ్లు, శరీరంపై పుళ్లుపడి మానక పోవడం వంటి సమస్యలతో ఎక్కువ మంది మా వద్దకు వస్తున్నారు. అలాంటి వారికి శస్త్ర చికిత్స చేసి సాధారణ స్థితికి తెస్తున్నాం. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాయామం, ఆహార నియమాలు  ముఖ్యం. – డాక్టర్‌ కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ వ్యాధి నిపుణుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement