కృష్ణమ్మకు గుండెకోత | sand mafia in guntur district | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మకు గుండెకోత

Feb 10 2018 9:27 AM | Updated on Aug 28 2018 8:41 PM

sand mafia in guntur district - Sakshi

నదిలో నుంచి పడవల్లోకి డ్రెడ్జర్‌తో ఇసుక తోడివేత

తుళ్లూరు: పార్టీ మాది...అధికారం మాది.. ఇసుక మాది..అంటూ తుళ్లూరు మండలంలో అధికార పార్టీ నాయకులు బరి తెగిస్తున్నారు. నియోజకవర్గ, జిల్లాలోని ముఖ్య నేతల అండతో దోపిడీకి తెగబడుతున్నారు. ఉచిత ఇసుక ముసుగులో లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందిన కాడికి దోచుకొని లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఈ దందా అంతా ఎక్కడో కాదు.. సీఎం నివాసానికి ఆనుకుని ఉన్న కరకట్ట పొడవునా సాగుతోంది. ‘పేదవాడికి ఉచిత ఇసుక అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇసుకపై అక్రమ దందా చేస్తే ఏ పార్టీకి చెందిన వారినైనా వదిలి పెట్టం. ఇసుక విధానం సక్రమంగా అమలు చేయడానికి డివిజన్, జిల్లా స్థాయిల్లో టాస్క్‌ఫోర్క్‌ అమలు చేస్తున్నాయని’ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలు మాటలకే పరిమితం తప్పా అమలు కావడం లేదు.

మామూళ్ల మత్తులో అధికారులు
గతంలో పొక్లెయిన్ల ద్వారా కృష్ణా నదిలో ఇసుకను తవ్వేవారు. ఇప్పుడు ఏకంగా డ్రెడ్జర్స్‌ ద్వారా 10 నుంచి 20 అడుగుల లోతులో గోతులు తీసి తోడేస్తున్నారు. వాటిల్లో సందర్శకులు, పడవలు బోల్తా పడి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. మూడు నెలల కిందట జరిగిన ఫెర్రీ ఘాట్‌ ప్రమాదంలో 24 మంది జల సమాధి అయ్యారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఇసుక తవ్వకాలను నియంత్రించడంలో జిల్లా మైన్స్, విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టనట్టు ఉన్నారంటే మామూళ్ల మత్తులో ఉన్నారేమోనని ఆరోపణలు వెలువడుతున్నాయి. పర్యావరణం సైతం దెబ్బతిన్నా అక్రమార్కులు నిబంధనలు మాత్రం పట్టించుకోవడం లేదు. పగలు,రాత్రీ తేడా లేకుండా నదికి నిలువునా గుండె కోత పెడుతున్నారు. ఇష్టారీతిగా వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ టీడీపీ నేతలే ఈ దందాను కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.

అక్రమంగా డంపింగ్‌
ఇసుక రవాణా కోసం ప్రభుత్వం ర్యాంపు మంజూరు చేయకపోయినా అధికార పార్టీకి చెందిన నేతలు స్థానిక నియోజకవర్గ, జిల్లా నాయకుల అండతో ఉచిత ముసుగులో దందాను నిర్వహిస్తున్నారు. తుళ్లూరు మండల పరిధిలో కొత్తగా ఉద్దండ్రాయునిపాలెం ఇసుక రేవును స్థానిక నేత నడుపుతున్నట్టు గుసగుసలాడుకుంటున్నారు. ఇదే కాదు అన్ని ఇసుక రీచ్‌లను పంచుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెలరేగి పోతున్నారు. నది గర్భాన్ని ధ్వంసం చేసి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేస్తూ అక్రమార్జన ద్వారా  లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.

నిత్యం లారీల్లో రవాణా
ఉచితం ముసుగులో నిత్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. రెవెన్యూ, మైన్స్, పోలీస్‌ అధికారులు అటువైపు చూడటమే లేదు. ఇదే అదునుగా కొందరు టీడీపీ కార్యకర్తలు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పగలంతా రవాణా చేస్తూ రాత్రి సమయాల్లో లారీలకు ఎగుమతులు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర జిల్లాల్లో ఇసుకకు మంచి డిమాండ్‌ ఉన్నందున లారీ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్మకాలు జరుపుతున్నారు. ఈ అక్రమ రవాణా గురించి రెవెన్యూ అధికారులకు తెలిసినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

రోజుకు రూ.10 లక్షల పైనే వ్యాపారం
తుళ్లూరు మండల పరిధిలో కరకట్టకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో 70 వరకు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటికి తోడు 70 లారీలు రేవుల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తుంటాయి. ఒక్కో ట్రాక్టర్, లారీ 7 నుంచి 10 ట్రిప్పులు వేస్తాయి. ఇలా రోజుకు ట్రాక్టర్‌ ద్వారా సుమారు రూ.5 వేలు, లారీ ద్వారా రూ.10 వేల పైనే అక్రమంగా ఆదాయం సమకూరుతోంది. మొత్తంమీద రోజుకు రూ.10 లక్షల పైనే వ్యాపారం జరుగుతోంది.

చర్యలు చేపడతాం
అక్రమంగా ఇసుకను తరలిస్తే కచ్చితంగా చర్చలు తీసుకుంటాం. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటాం. –పూర్ణచంద్రరావు, తుళ్లూరు తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement