మాటరాని మౌనమిది..! | His language is silent for three decades | Sakshi
Sakshi News home page

మాటరాని మౌనమిది..!

Jan 5 2018 1:09 AM | Updated on Jan 5 2018 1:09 AM

His language is silent for three decades - Sakshi

సాక్షి, గుంటూరు: లక్షలాది జీవరాసుల్లో మానవుడికి మాత్రమే దక్కిన అదృష్టం మాట్లాడటం. కానీ ఓ వ్యక్తి మాత్రం మూడు దశాబ్దాలుగా మాట్లాడటం మానివేసి మౌనమునిగా మారిపోయాడు. అదేమంటే విలువైన మాటను పొదుపు చేయాలని సాధన చేశా.. అది శాశ్వతంగా అలవాటైందని సైగలు, చిటికెల శబ్దాలు, చేతిరాతతో  చెప్పుకొచ్చాడు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామంలోని కశిందుల పూర్ణచంద్రరావు ఇంట్లోకి వెళితే మూగసైగలే కనిపిస్తాయి.

అంతమాత్రాన ఆ ఇంట్లో మూగవాళ్లు ఎవరైనా ఉన్నారనుకుంటే పొరపాటు పడినట్లే. ఆ ఇంట్లోని వారందరికీ మాటలు వచ్చు. కానీ ఇంటి పెద్ద అయిన పూర్ణచంద్రరావు గత 30 ఏళ్లుగా మాట్లాడకుండా కేవలం సైగలు, చిటికెల శబ్దాలతోనే కాలం గడుపుతూ వస్తున్నారు. పూర్ణచంద్రరావు, ధనలక్ష్మి దంపతులకు నలుగురు పిల్లలు. వీరిలో వెంకట సత్యభీమలింగేశ్వరరావు, బసవశంకర్, సుధారాణి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుండగా.. చిన్నకుమార్తె యశోద తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.

ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తండ్రి నోటి నుంచి ఒక్కచిన్నమాట కూడా వారి చెవిన పడలేదు. వారికి ఏం కావాలో కూడా సైగలు, చేతిరాత ద్వారానే పూర్ణచంద్రరావు కనుక్కునేవారు. పిల్లలు ఫోన్‌ చేసినా.. వారు చెప్పింది వినడమే గానీ వారి మాటలకు మాత్రం బదులు చెప్పరు. ఏదైనా చెప్పాలనుకుంటే భార్యకు చేతిరాతతో వివరించి.. ఆమె ద్వారా పిల్లలకు సమాధానమిస్తారు. ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తే.. ‘విలువైన దానిని దాచుకోవడం అందరూ చేసేదే కదా! ధనం కంటే మాటకే విలువ ఎక్కువ అని భావించాను.

మొదట్లో పొదుపుగా మాట్లాడేవాణ్ని. రానురానూ అసలు మాట్లాడటమే మానివేశాను’ అని పూర్ణచంద్రరావు పేపర్‌ మీద రాసి చూపించారు. తనకు గురువైన సూర్యానంద సరస్వతి స్వామి(బొగ్గులకొండ స్వామి) మౌనంగా ఉండాలని ఉపదేశించడంతో ఆయన్ని అనుసరించానని చెప్పుకొచ్చారు. ‘1982లో చిన్న గురువు మారుతికుమార్‌తో సూర్యానంద సరస్వతి స్వామి కోటప్పకొండలో బ్రహ్మోపదేశం చేయించారు. అప్పటి నుంచి మౌనంగా ఉండటం మొదలుపెట్టాను. దేవుడిపై భారం వేసి జీవనం సాగించాను. ఆయన దయ వల్ల పిల్లలందరూ స్థిరపడ్డారు’ అని పేపర్‌పై రాసి చూపించారు.  


మొదట్లో ఇబ్బందిగా ఉండేది
అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సైగలు చేస్తుంటే మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. క్రమక్రమంగా ఆయన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు సైగల ద్వారా, చిటికెల ద్వారా ఆయన ఏం చెబుతున్నారో కూడా నాకు ఇట్టే అర్థమవుతోంది. మాట్లాడాలని మేము కూడా ఆయన్ని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు.      – ధనలక్ష్మి, భార్య

హేళన చేసినా.. పట్టించుకోలేదు
మా నాన్న సైగలు చేస్తుంటే గ్రామస్తులు హేళన చేసేవారు. ఏది పడితే అది మాట్లాడి ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కంటే.. నాన్నలా మౌనంగా ఉండటం గొప్పగా అనిపించింది. నాన్నను చూసి పూర్తిగా మౌనం పాటించలేకపోయినా.. తక్కువ మాట్లాడటం అలవాటు చేసుకున్నాం.     – సుధారాణి, కుమార్తె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement