హీరో ఆగమనం!

YS Jagan Mohan Reddy Grand Victory In 2019 Election - Sakshi

కామెంట్‌

అలలు అలలుగా అల్లుకుంటూ పెను ఉప్పెన కెరటమై ఉప్పొంగిన జనసంద్రపు గళ ఘోష చెవిలో ప్రతిధ్వనించినట్టు... కలలన్నీ కలిసిపోయి ఒక మహా స్వప్నాన్ని కనుల ముందట ఆవిష్క రించినట్టు... ఏమి విజయమిది! సమకాలీన రాజ కీయ చరిత్రలో దీనికి సాటి రాగల దృష్టాంతమెక్క డున్నది? నూటికి 90 శాతం లోక్‌సభ సీట్లను, సుమారు 85 శాతం అసెంబ్లీ సీట్లను తుడిచిపెట్టి 50 శాతానికిపైగా ఓట్లను కొల్లగొట్టి ప్రజాభిమానా నికి కొత్త హద్దురాళ్లను పాతిన అపూర్వ ఘట్టం ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదే శ్‌లో 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అసలు ప్రతి పక్షమే లేదు. కాంగ్రెస్‌లో టికెట్‌ దొరకని∙కొందరు తిరుగుబాటు అభ్య ర్థులూ, అక్కడక్కడా విసిరేసినట్టు కమ్యూనిస్టులు మాత్రమే పోటీ.

అయినా కూడా అప్పటి కాంగ్రెస్‌ పార్టీ ఈ స్థాయి విజయాన్ని సాధించలేక పోయింది. 75 శాతం సీట్లను మాత్రమే గెలవగలిగింది. గణాంకాలను పరిశీలిస్తే 1994లో ఎన్టీఆర్‌ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూటమి సాధించిన విజయం మాత్రమే ఈ గెలుపునకు సమీపంగా నిలబడగలుగు తుంది. అయితే అప్పుడు టీడీపీకి ఉభయ కమ్యూనిస్టుల బలం తోడ య్యింది. ఆ రెండు పార్టీలు కలిసి 34 సీట్లను గెలుచుకున్నాయి. పోరాట పటిమలేని అర్భక శ్రేణుల నాయకత్వంలో కాంగ్రెస్‌ పోరాడింది. గట్టిగా తంతే కుప్పకూలే శిథిల సౌధంలాంటి స్థితి నాటి కాంగ్రెస్‌ పరిస్థితి. మరి ఇప్పుడు? టక్కుటమార విద్యల్లో పుతిన్, ట్రంప్‌లకు పాఠాలు చెప్పగల అంతర్జాతీయ మాయల మరాఠీతో పోరాటం. రాష్ట్ర ప్రజల సహజ వనరు లను దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఎరవేశాడు. మొత్తం మీడియాలను కవచంలా వాడుకున్నాడు. వేయని ఎత్తు లేదు, చేయని తప్పు లేదు. వేయిగొడ్లను తిన్న రాబందును నేలకూల్చిన గాలివానలాగా వైఎస్సార్‌సీపీ సాధించిన ఈ గెలుపు ఎలా సాకారమయ్యింది?

ఈ అపురూప విజయం కేవలం గణాంకాల వంటి సాంకేతిక అంశాల తోనే కొలిచేది కాదు. ఇదొక మానవీయ విజయం. ఇదొక మహోదాత్త విజయం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కోరి కష్టాలను కౌగిలించుకున్న ఒక హీరో పోరాట పటిమకు ప్రతిరూపం ఈ విజయం. ఈ ఒక్క మాట చెబితే అధికారం నీదేనని ఎందరు బతిమాలి చెప్పినా... అసత్య వాగ్దానాలను ఇవ్వడానికి నిరా కరించి, ఓటమికే సిద్ధపడిన జగన్‌మోహన్‌ రెడ్డి వంటి రాజకీయ నాయ కుడు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కాగడా పట్టుకొని వెతికినా కనిపించడు. అవినీతి, అక్రమార్జన, స్వార్థాలే పరమార్థాలుగా పతనమవుతున్న నేటి రాజకీయ వ్యవస్థలో వైఎస్‌ జగన్‌ ఉత్థానం నిస్సంశయంగా ఒక మేలి మలుపు. 

జగన్‌ రాజకీయ రంగంలోకి ప్రవేశించి సరిగ్గా పదేళ్లు. ఈ పదేళ్లలో ఆయన జీవితం లిఖించిన  చరిత్ర మరో వందేళ్ల వరకు పాఠాలు చెబుతుంది. ఈ పదేళ్లలో ఆయన తనను తాను మలుచుకున్న తీరు నిరుపమానం. ఇచ్చిన మాట తప్పితే అందలమెక్కిస్తామని ఆశలు చూపినా.. మా మాట వినకుంటే కష్టాలపాలవుతావని భయపెట్టజూసినా చలించకుండా జగన్‌మోహన్‌రెడ్డి నిబ్బరంగా నిలబడిన తీరు అనన్యసామాన్యం. చేయని తప్పులకు నిందలు మోయాల్సి వచ్చినా, జైల్లో మగ్గాల్సి వచ్చినా మాట తప్పని తీరునూ, మడమతిప్పని తత్వాన్ని జనం క్రమంగా అర్థం చేసుకున్నారు. విలువలతో కూడిన రాజకీయ జీవితం కోసం ఆయన తనను తాను కష్టపెట్టుకున్న తీరును ప్రజలంతా గమనించారు. రాజకుమారుడిలాగా జీవించే అవకాశాలున్నా తృణప్రాయంగా కాలదన్ని కష్టాల కొలిమిలో తనను తాను కాల్చుకున్నాడు. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలాడు. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ప్రజల్లో తిరుగుతూ, వాళ్ల బాధలు, గాథలు వింటూ ధైర్యం చెబుతూ తన చెమట చుక్కలు ధారబోసి ఒక రాజకీయ పార్టీని ప్రజల హృదయాల్లో ఆయన నిర్మించుకున్నాడు. ఉన్నత విలువలతో కూడిన నిజాయితీ, నిబద్ధత కలిగిన రాజకీయాలు నడిపి ప్రజల మనసులను గెలుచుకున్నాడు. ఆయన పదేళ్ల కఠోర శ్రమకు ప్రజలిచ్చిన కానుక ఈ విజయం. 

అందుకే ఈ విజయం పవిత్రమైనది. ఈ విజయం అత్యంత విలువైనది. ఈ విజయం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఈ విజయం ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. అందుకే  ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మె ల్యేలు, ఎంపీలంతా ఈ విజయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించి విలువలతో కూడిన కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం చుట్టవలసి ఉంటుంది. ప్రజా సంక్షేమమే ఊపిరిగా భావించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలతో నిర్మించిన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని ప్రజలు భావి స్తున్నారు. మాట తప్పని నీతిమంతుడూ, మడమతిప్పని ధీరోదాత్తుడూ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతు న్నందువలన అనతికాలంలోనే ఒక పావన నవజీవన బృందావనంగా నవయుగాంధ్ర రూపుదిద్దుకోవాలని యావన్మంది ప్రజల ఆకాంక్ష.


వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top