
పాత చిత్రం
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం ఓటమిని నిర్ణయించే శారు. ఆ విషయం రాష్ట్ర ముఖ్య మంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికే అర్ధమైపోయింది. రాష్ట్రంలోనే కాక, దేశంలోనే చక్రం తిప్పే గొప్ప నాయకుడిగా తనని ఫోకస్ చేసుకుంటున్న బాబు ఈసారి ఓడిపోతే ఢిల్లీలో పరపతి కోల్పోయి, ఎవరూ పట్టించుకోని స్థితికి చేరుకుంటారు. అందుకే గెలుపు తనకు అత్యవసరం. దానికోసమే ఏం చేయడానికైనా ఆయన సిద్ధపడుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి, నరేంద్రమోదీ, కేసీఆర్ ఒక్కటై తనను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మొదలుపెట్టిన ప్రచారం కేవలం ప్రజల సానుభూతి పొందడానికే. అలిపిరిలో జరిగిన బాంబు పేలుడులో చావునుంచి బయటపడి, సానుభూతి పనిచేసి విజయం సాధిస్తానని 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు జనం ఓడించిన సంగతి గుర్తులేదా? సానుభూతి ఉన్నా సమర్థత లోపించినప్పుడు జనం పక్కనబెడతారు. ఈ విషయం అప్పుడే మరిచిపోతే ఎలా?
పవన్‌కల్యాణ్‌తో, కేఏ పాల్‌తో లోపాయికారీ ఒప్పం దం కుదుర్చుకుని వారి వెనక ఉన్నారనుకుంటున్న వర్గాలవారి ఓట్లను చీల్చడానికి చంద్రబాబు కుట్రపన్నారు. పాల్ పార్టీ హెలికాప్టర్ గుర్తులో ఉండే ఫ్యాన్ వల్ల నిరక్షరాస్యులు, వృద్ధులు అయోమయంలో పడి హెలికాప్టర్‌కి వేస్తారని భ్రమించి, అతగాడితో ప్యాకేజీ మాట్లాడుకుని రంగంలోకి దించాడు. గుర్తు ఒక్కటే కాదు... పేర్లు కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను పోలివుండేలా కొంతమంది అనామకుల్ని ఎంపిక చేసి నిలబెట్టేలా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. కారుకు దగ్గరగా ఉన్న ట్రక్కు, ఆటో గుర్తులతో అనామకుల్ని నిలబెట్టాడు. కానీ ఇక్కడ బెడిసికొట్టింది. కారు గెలిచింది. కానీ గెలిచిన అభ్యర్థుల మెజారిటీ తగ్గింది. అందుకే వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
శత్రువు పది తలల పాము అయినప్పుడు ఏ చిన్న అవకాశాన్నీ వదలకూడదు. చంద్రబాబు నాయకుడు కాదు... మేనేజర్ అని కేసీఆర్ చెబుతుంటారు. అది చిన్నమాట. అతను మానిపులేటర్. తిమ్మిని బమ్మి చేయగలడు. అయితే అనుకూల మీడియాలో ఇంతకాలం చేసినట్టు చేద్దామంటే ఇప్పుడు సాగలేదు. సోషల్ మీడియా బలోపేతం కావడమే ఇందుకు కారణం. అదే ఇవాళ జగన్ బలం. అంతిమ నిర్ణేతలు ప్రజలే తప్ప కుట్రదారులు కాదు. పుకార్లు పుట్టించడంలో, వ్యక్తిత్వహననం చేయడంలో బాబు, ఆయన బలగం దిట్టలు. తెలంగాణ విషయంలో ఇలాగే చేశారు. కానీ అవేమీ పనిచేయలేదు. దేశంలోకెల్లా ఆదర్శవంతమైన పాలనను కేసీఆర్ అందిస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువైన జగన్‌పై సైతం ఆయన అధికారంలోకొస్తే హింసాదౌర్జన్యాలు పెరుగుతాయని బాబు ప్రచారం చేశారు. అల్లర్లూ, హత్యలూ జరిపించి వాటిని వైఎస్సార్‌సీపీపైకి నెట్టి జగన్‌ను చులకన చేయాలని పథకం పన్నాడు.
కానీ దీన్ని జగన్ ఓపికతో ఎదుర్కొని ప్రజల్లో నిలబడ్డారు. ఆ తర్వాత తప్పుడు సర్వేలతో మాయ చేద్దామని చూశారు. ఎమోషనల్ స్టాటిస్టిక్స్ అని ఒక లెక్క ఉంటుంది. ప్రజల భావోద్వేగాల ద్వారా ఫలితాలను లెక్కగట్టవచ్చు. జగన్ సభల్లో జనంలోని ఉద్వేగం, కేకలు, అరుపులు చూస్తే ప్రజల నిర్ణయమేమిటో తెలిసిపోయింది. ‘తీసుకొచ్చిన’ ప్రజలు అంతటి ఉద్వేగంతో ఉండరు. ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకొచ్చి, ఉద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందా మని బాబు చూసినా అవేమీ పనిచేయలేదు. ఏపీ ప్రజలు టీడీపీ ఓటమిని ఎప్పుడో నిర్ణయించేశారు.
వ్యాసకర్త : సునీత, ప్రముఖ రచయిత్రి