అడవి దొంగలెవరు? 

Tribals Protest Against Forest Officer In Sirpur Kaghaznagar - Sakshi

విశ్లేషణ

సుప్రీంకోర్టు ముందున్న సమస్య, కాగజ్‌నగర్‌ మండలంలో సార్సాల శివార్ల అడవుల్లో జరిగిన దాడులను విచారిస్తున్న పోలీసుల ముందున్న సమస్య ఒకటే. ఎవరు అడవులను ఆక్రమిస్తున్నారు? తరతరాలనుంచి అడవుల్లో ఉంటున్న ఆదివాసులను ఎవరు తరిమేస్తున్నారు?  పోడు వ్యవసాయం కొన్ని తెగల ఆదివాసులకు జీవన వృత్తి. గిరిజనేతర వ్యాపార రాజకీయ శక్తులకు అది లాభదాయకమైన వ్యాపారం.  ఆదివాసులకు అడవుల్లో బతికే హక్కు, అటవీ ఉత్పత్తులను వాడుకునే అధికారం ఇవ్వాలని శతాబ్దాల కాలం నుంచి సాగిన ఉద్యమాల ఫలితంగా 2006లో అటవీవాసుల హక్కులను గుర్తిం చారు కాని విధివిధానాలను ఎంత దుర్మార్గంగా వక్రీకరిస్తున్నారో తెలియదా? ఆక్రమణ దారులెవరో అటవీ అధికారులకు తెలియదా? ఎమ్మెల్యేలు ఎవరికి అండగా ఉన్నారో తెలియదా?  ఆక్రమణ దారుల అవినీతికా లేక ఆదివాసుల హక్కులకా ఈ చట్టాలు? అడవిలో సంపదను చూస్తున్న ప్రభువులకు ఆదివాసుల బ్రతుకులు కనిపించడం లేదా? ఆంగ్లేయుల పాలన, నిజాంపాలనలో కూడా ఇదే సమస్య తలెత్తింది.

నిరంకుశ పాలన సాగిస్తున్న అటవీ అధికారులపైన, వారిని వాడుకుంటున్న పాలకులమీద ఉద్యమించారు. ఆస్ట్రియన్‌ సామాజిక శాస్త్రవేత్త హైమండార్ఫ్‌ నిజాం ఆహ్వానం పైన తెలంగాణ జిల్లాలకు వచ్చి ఆదిలాబాద్‌ తదితర ఆదివాసుల పరిస్థితులు పరిశీలించి వారికోసం ప్రత్యేక హక్కులను గుర్తించి అమలు చేయవలసిన అవసరం ఉందని వివరించాక కొంత అర్థం అయింది. గిరి జనుల భూములను గిరిజనులకే ప్రత్యేకించాలనే చట్టాలు కూడా వచ్చాయి. వన్‌ ఆఫ్‌ సెవెంటీ చట్టం కింద గిరిజనేతరులు భూములు కొన్నా వాటిని తిరిగి గిరిజనులకు ఇప్పించడానికి అధికారులకు, ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చారు. అభివృద్ధి చేస్తాం అంటూ అడవుల్లో జొరబడి, అమాయకులైన వారిని మోసం చేసి, వారి భూములు ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడం అభివృద్ధి అనీ, ఆక్రమించిన వారిలో కూడా పేదలు ఉన్నారని వారిని వెళ్లగొడితే హక్కులకు భంగం అని వాదించే మేధావులు చాలా మందే ఉన్నారు. డబ్బు సంపాదించడం, ఎన్నికల్లో గెలవడం తప్ప మరో లక్ష్యంలేని పార్టీలు, నేతలు పుట్టుకొచ్చిన ఈ కాలంలో ఆదివాసుల బతుకుల గురించి వారికి అర్థమయ్యేట్టు చెప్పడం సాధ్యమా?గిరిజనేతరులపై భూమి ఆక్రమణ నిషేధ చట్టం వన్‌ ఆఫ్‌ సెవెంటీకి తూట్లుపొడిచిన వారెందరో. అధికారులు ఆదివాసులను వెళ్లగొట్టి అడవులను ఆక్రమించి టేకును, ఎర్రచందనాన్ని ఇతర అటవీ సంపదను స్మగ్లింగ్‌ చేస్తూ ధనికులైపోతున్నారు.

రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలు మంత్రులు అవుతున్నారు. గెలిచే గుర్రాల పేరిట ఈ నేర సంపన్నులకే పార్టీ టికెట్లు అమ్ముకుని ఎమ్మెల్యేలుగా మార్చుతున్నారు. అటవీ అధికారులమీద పెత్తనం చెలాయించి తాము, తమ సోదరులు, అనుయాయులు ఆక్రమించిన భూములను రక్షించుకోవడానికి ఇటువంటి ఎమ్మె ల్యేలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. అడవులను డొల్లచేసే నాయకులు ఎమ్మెల్యేలవుతారు. వారు కూడా పార్టీ ఫిరాయిస్తారు.  దోచుకో, దాచుకో, కష్టమైతే పార్టీ మారు, అనే విధానానికి రాజకీయపార్టీలు ముగింపు పాడేదాకా అడవులు ఆక్రమిస్తారు, గనులు తవ్వుకుం టారు, ఏవో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప పార్టీ ఫిరాయింపులన్నీ దోచింది దాచడానికే. 

ఆదివాసుల హక్కులపై అటవీ అధికారులు అన్యాయంగా చేస్తున్న దాడులు నిజమైన ఆదివాసులకు హాని కలిగిస్తున్నాయి. పై అధికారులు, రాజ కీయ నాయకులు మొత్తం అడవులకే ఎసరు పెడుతూ ఉంటే, కింది అధికారులు అవినీతిపరులై పోతున్నారు. అన్నలు ఎమ్మెల్యేలయితే తమ్ములు ఏ వ్యాపారమైనా చేస్తారేమో అని ఇటీవల సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌  సార్సాల గ్రామంలో అటవీ అధికారిణి అని తపై జరిగిన దాడి నిరూపిస్తున్నది. ఎమ్మెల్యేగారు తమ్ముడిని రక్షించడానికి జనం ఏ విధంగా అబద్ధం చెప్పాలో ప్రబోధిస్తున్న వీడియో కూడా వైరల్‌గా ప్రసారం అవుతున్నది. 2009లో కోనేరు కోనప్పను స్మగ్లర్‌ వీరప్పన్‌తో పోల్చుతూ కేసీఆర్‌ ప్రచారం చేసిన నాటి వీడియోలు కూడా ప్రసారంలో ఉన్నాయి. బీఎస్పీ తరపున పోటీ చేసి గెలిచిన ఇతడిని తర్వాత తెరాస లోకి చేర్చుకున్నారు. ఇన్నాళ్లకు ఈ వీడియోలు బయటపడ్డాయి. ఈ విధంగా సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు అధికార ఎంఎల్‌ఏపై కూడా కేసులుంటాయా? సోషల్‌ మీడియా ప్రభావంతో నేరాలపై వెల్లడవుతున్న ఎలక్ట్రానిక్‌ రికార్డులకు చట్టం ప్రకారం సాక్ష్య విలువ ఇచ్చారు. ఇవి కత్తిరించి అతికించినవి కావని ప్రయోగశాలలో తేలితే చాలు.. ఇందులో ఉన్న అంశాలను నిజాలుగా భావించాలి. న్యాయస్థానాలు ఇంట ర్నెట్‌లో ఉన్న పత్రాలకు, దృశ్యాలకు మళ్లీ బలపరిచే సాక్ష్యాలు అడగకుండా నేరగాళ్లను పట్టుకుని శిక్షించకపోతే ఈ దురన్యాయాలకు సాక్ష్యాలే ఉండవు. కొత్త టెక్నాలజీతో కొత్త నేరాలు చేసే ప్రభుత్వ నేరగాళ్లకు శిక్షలు పడేదెట్లా?

వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్
కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com
మాడభూషి శ్రీధర్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top