అధర్మ పోరాట దీక్ష ఫలించిందా?

TDP Government Conduct Meetings With Public Money Says IYR - Sakshi

విశ్లేషణ

గత కొద్దికాలంగా రాష్ట్ర ప్రభుత్వం ధర్మ పోరాట దీక్షల పేరుతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రజాధనంతో సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ ధర్మ పోరాట దీక్షలకు ఫైనల్స్‌ రూపంలో హస్తిన నగరంలో ఈ మధ్యనే భారీ స్థాయిలో దీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ దీక్షలను ప్రజాధనాన్ని ఉపయోగిస్తూ పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాల రూపంలో నిర్వహిస్తున్నారు కనుక ఈ సభలు, సమావేశాల వలన ఒరిగిన ప్రయోజనం ఏమిటో తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికీ, అడిగే హక్కు ప్రజలకూ ఉన్నది. నిన్నటికి మొన్న నిర్వహించిన హస్తిన ధర్మ పోరాట దీక్షకు జీవో 216 ద్వారా 10 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజల తరలింపుకోసం  ప్రత్యేక రైలు సదుపాయం కల్పించడానికి రైల్వేశాఖ వారికి కోటి 12 లక్షల రూపాయలు చెల్లింపు చేస్తూ జీవో 262 విడుదల చేశారు. ఇంత ప్రజాధనాన్ని వినియోగించి చేసిన ఈ ధర్మ పోరాట దీక్ష ఫలితాలను పరిశీలించే ముందు ఈ దీక్షకు ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షలో రాష్ట్రానికి చెందిన ఏ ప్రతిపక్ష నాయకుడూ హాజరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం  నాలుగేళ్లుగా బీజేపీతో పాటు కేంద్రంలో భాగస్వాములుగా ఉండి ఆనాడు లేవనెత్తని చాలా అంశాలను ఈరోజు లేవనెత్తడం, ఆ రోజు ఇదే అంశాలపై ఉద్యమించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల మిగిలిన విపక్షాల వారు ఈరోజు ప్రభుత్వంతో ఈ అంశంపై కలిసి రావటం లేదు. ఆరోజు ప్రత్యేక హోదా సంజీవనినా అని ప్రశ్నించి, ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేసి ఈ రోజు కేంద్రంతో పోట్లాడుతాం.. మీరూ కలిసి రండి అంటే విపక్షాలు  సుముఖంగా లేవు. ఈ పరస్పర విరుద్ధ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన విపక్షాలు ఈ దీక్షలకు దూరంగా ఉంటున్నాయి. విపక్షాలను కలిపి తీసుకుని పోలేని ధర్మపోరాట దీక్ష ఆదిలోనే విఫలమైనది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సమయం నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సహజంగానే ఈనాడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ధర్మ పోరాట దీక్షలో వారు ప్రస్ఫుటంగా పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం వెన్నుదన్నులతో ఈ ఉద్యమాన్ని కొనసాగించటంలో కీలకపాత్ర పోషిస్తున్న కొన్ని స్వయంప్రకటిత పౌర సంఘాలు వాటి నాయకులు చాలా ప్రముఖంగా ఈ దీక్షలో కనిపించారు. హస్తినలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన ఒక వేదిక గనుక సహజంగానే కేంద్ర ప్రభుత్వాన్ని తూలనాడటానికి అన్ని జాతీయ స్థాయి విపక్షాలు క్యూ కట్టాయి.

కానీ ప్రజాధనాన్ని వెచ్చించి చేసిన ఈ దీక్ష ఏమి సాధించింది అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. వచ్చిన ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా ప్రధాన అంశమైన పరిశ్రమ రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాకు మద్దతు తెలపలేదు. రాహుల్‌ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపారు కానీ పరిశ్రమ రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కాదు. పరిశ్రమ రాయితీలు లేని ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీకి సమానమే కానీ ఏ విధంగానూ ఎక్కువ కాదు. మరి ఎవరి నుంచి ఎటువంటి హామీలు రాకుండా కేవలం రాష్ట్రప్రభుత్వ వ్యయంతో కేంద్ర ప్రభుత్వాన్ని దూషించడానికి ఏర్పాటు చేసిన ఒక సభ గానే హస్తిన ధర్మ పోరాట దీక్ష మిగిలిపోతుంది. రాష్ట్రంలో ప్రసారమాధ్యమాలన్నీ ముఖ్యంగా ప్రాంతీయ భాష ప్రసార మాధ్యమాలు చాలా బహిరంగంగా తెలిసిన కారణాలవల్ల ఈ ప్రభుత్వం ఎట్లాంటి తప్పులు చేసినా వత్తాసు పలకటం పరిపాటి అయిపోయింది.

ప్రశ్నించతగిన స్థాయిలో సామాజిక సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఏపీలో లేకుండా పోయినారు. కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జంకూగొంకూ లేకుండా ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటానికి సాహసిస్తున్నది. మరి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాయావతి ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఏనుగుల ఖరీదు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు అది ఈ సందర్భంలో కూడా తప్పకుండా వర్తిస్తుంది. హస్తినలో కొలువుదీరిన ధర్మ పోరాట దీక్ష ఒక విధంగా నాకు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన కౌరవ సభ తిరిగి కొలువుతీరినట్లు కనిపించింది. నాటి రాష్ట్ర విభజనలో ప్రముఖ పాత్ర పోషించిన నాటి ప్రధాని ధృతరాష్ట్రవర్యులు దీక్షలో ప్రధాన పాత్ర వహిం చారు. రాష్ట్ర విభజన చట్టాన్ని రూపొందించిన శకుని గారు కూడా చాలా ప్రముఖంగా కనిపించారు. లక్ష్మణ కుమార్లవారు వచ్చి హాజరు వేసుకొని వెళ్లారు. విభజనలో కీలక పాత్ర పోషించిన స్త్రీ రూపంలోని దుర్యోధనులవారు మాత్రం సభకు వేంచేయలేదు. మొత్తంమీద విభజన గాయాలపై సీఎం మాట ల్లోనే కారం చల్లే విధంగా సభ కొనసాగింది.

వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ‘‘ iyrk45@gmail.com
ఐవైఆర్‌ కృష్ణారావు
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top