రద్దుల పద్దులో రిజర్వేషన్లు !

Professor Kanche Ilaiah Speaks About Reservations  - Sakshi

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం ప్రకారం లభిస్తున్న రిజర్వేషన్లపై దాపరికం లేకుండా చర్చించాల్సి ఉందని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో గత ఏడుదశాబ్దాలుగా దేశంలో అమలవుతూ వస్తున్న రిజర్వేషన్లు ప్రమాదంలో పడనున్నాయి. దేశంలో గోరక్షణ చట్టాల పేరుతో దళితుల, ఆదివాసీల, మైనారిటీల ఆహార ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన ప్రస్తుత పాలకులు ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేశారు. తాజాగా ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తికి మంగళం పాడేశారు. ఇక రామమందిర నిర్మాణం. రిజర్వేషన్‌ చట్టం రద్దు వీరి కీలక ఎజెండాగా మారాయి.

వీలైనంత త్వరలో రిజర్వేషన్‌ రద్దు బిల్లును కూడా కేంద్రం తీసుకు వచ్చే ప్రమాదం ఉంది. మనం ఇప్పుడు దళిత, ఓబీసీ, ఆదివాసీ, మైనారిటీ, శరణార్థుల హక్కులను రద్దు చేసే యుగంలో ఉంటున్నాం. ఇది మన ప్రజాస్వామ్యం నూతన దశ. ఆరెస్సెస్‌ రిజర్వేషన్లను వ్యతిరేకించే సంస్థగా ఉంటోంది. ఆ సంస్థ అధినేత మోహన్‌ భాగవత్‌కు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చాలా ప్రకటనలు చేసిన రికార్డు కూడా ఉంది. ఆగస్టు 19న ఆయన తాజా ప్రకటనలో రిజర్వేషన్ల సమస్యపై నిర్దిష్ట దిశలో తప్పక చర్చించాల్సిందేనని వక్కాణించారు. ’’ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్‌కు సంబంధించి దాపరికం లేకుండా చర్చించాల్సి ఉంద’’ని ఆరెస్సెస్‌ చీఫ్‌ చెప్పారు. ఆయన గతంలోనూ ఇలాంటి ప్రకటనలే చేసి ఉన్నారు. 

ఆరెస్సెస్‌ దీర్ఘకాలంగా తాను పెట్టుకుంటూ వచ్చిన అజెండాలను ఒక్కటొక్కటిగా మోదీ ప్రభుత్వం ద్వారా అమలు చేయిస్తోంది. పశువులను మేపే శూద్ర రైతుల ఆర్థిక వ్యవస్థను, దళిత, ఆదివాసీ, ముస్లింలు నిర్వహిస్తున్న ఆహార ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేందుకోసం గోరక్షణ చట్టాలను రూపొందించాల్సిందిగా అది రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చింది. ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని తీసుకురావలసిందిగా కూడా ఆరెస్సెస్‌ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ కోవలో తాజాగా ఆర్టికల్‌ 370కి కూడా మంగళం పాడేసింది. దాని దీర్ఘకాలిక ఎజెండా అమలుకు సంబంధించి మరో రెండు ప్రధాన సమస్యలు పెండింగులో ఉన్నాయి.

అవి రామమందిర నిర్మాణంపై తీర్మానం. రిజర్వేషన్‌ చట్టాల రద్దు. సమీప భవిష్యత్తులోనే ఆరెస్సెస్‌ వీటి అమలుకు కూడా పావు కదపనుంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓబీసీల ఓట్లను భారీగా రాబట్టుకున్న నరేంద్రమోదీని ఇప్పుడు రిజర్వేషన్‌ రద్దు చట్టాన్ని అమలు చేయాలని ఆరెస్సెస్‌ ఒత్తిడికి గురిచేయవచ్చు. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. కాంగ్రెస్‌ వేదికలపై పనిచేస్తున్న రిజర్వేషన్‌ వ్యతిరేక మేధావులు రిజర్వేషన్‌ రద్దు చట్టాన్ని పూర్తిగా బలపరుస్తారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మనీష్‌ తివారీ, జనార్ధన్‌ ద్వివేదీలు రిజర్వేషన్‌లపై ఏ వైఖరితో ఉన్నారో దేశం మొత్తానికే తెలుసు. చాలామంది లౌకికవాద మేధావులు తమ హృదయంలో రిజర్వేషన్ల వ్యతిరేకులుగా ఉంటున్నారు.మోహన్‌ భాగవత్‌ తేలికగా తీసిపారవేయదగిన స్థాయి వ్యక్తి కాదు. బీజేపీ, ఆరెస్సెస్‌ యంత్రాంగాల్లో ఆయనకు చాలా పట్టుంది. తాను చంద్రగుప్తునికి కౌటిల్యుడి వంటివాడు. ముర అనే శూద్ర/ఓబీసీకి చెందిన మహిళ పుత్రుడే మౌర్యుడు. కులవ్యవస్థను వ్యవస్థీకృతం చేయడానికి అవసరమైన ప్రతి పనినీ, చర్యనూ కౌటిల్యుడు.. చంద్రగుప్త మౌర్యుడితో చేయించాడు. 

కులవ్యవస్థపై, మన విద్యా సంస్థల్లోని సైన్స్‌ వ్యతిరేక, మానవ వ్యతిరేక స్వభావంపై చర్చించాలని ఆరెస్సెస్‌ ఎన్నడూ కోరలేదు. పైగా శూద్రులకు, ఎస్సీలకు, ఆదివాసులకు ఎలాంటి హక్కులను ప్రసాదించని వేదాలు, రామాయణం, మహాభారతంపై చర్చించాలని ఈ సంస్థ కోరింది. ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ హిందూ మతంలో మానవ సమానత్వం గురించి ఎన్నడూ మాట్లాడిన పాపాన పోలేదు. హిందూ మతం నుంచి అంటరానితనాన్ని రద్దు చేయాలని ఒక్క ప్రకటన కూడా ఆయన విడుదల చేయలేదు. హిందూ మతం పరిధిలో శూద్రులకు, ఓబీసీలకు, ఆదివాసీలకు అర్చకత్వ హక్కులను కల్పించడమే ఆయన ఏనాడూ మాట్లాడలేదు. హిందూమతంలో పురుషులతోపాటు మహిళలకు కూడా సమాన హక్కులు ఇవ్వాలని తాను ఎప్పుడూ బహిరంగ ప్రకటన చేయలేదు. పైగా చరిత్రాత్మక పోరాటాల ద్వారా ప్రజలు సాధించుకున్న కొన్ని హక్కులను రద్దు చేయాలని బలంగా వాదించేవారు.

కులవ్యవస్థ రద్దుపై మోహన్‌ భాగవత్‌ ఎన్నడూ ప్రకటించలేదు. హిందూమతంలోనూ వెలుపలా బ్రాహ్మణాధిపత్యాన్ని రద్దు చేయాలని అయన ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. ప్రధానంగా దళితులు, ఓబీసీలే ఉంటున్న వ్యవసాయ కూలీల వేతనాలు పెంచడంపై తానెన్నడూ మాట్లాడింది లేదు. కానీ రిజర్వేషన్లపై తీవ్రంగా చర్చించాల్సి ఉందంటూ ఆయన పదే పదే మాట్లాడుతూ వచ్చారు.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆరెస్సెస్‌ చీఫ్‌ ఏ కీలక ప్రకటన చేసినా ప్రధాని నరేంద్రమోదీ మాత్రం మౌనవ్రతం పాటిస్తుంటారు. ఆయన మౌనం తన గురువు ఆదేశాన్ని పూర్తిగా ఆమోదించడాన్నే సూచిస్తుంది. ఆరెస్సెస్‌లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సంస్థకు కండబలంగా మాత్రమే ఉంటున్నారు. పెద్దగురువు ఆదేశాలను ఏమాత్రం వ్యతిరేకించకుండా వీరికి పూర్తిగా బ్రెయిన్‌వాష్‌ చేస్తుంటారు. జాతి ప్రయోజనాల బట్టే ఆరెస్సెస్‌ పనిచేస్తుందని వీరికి నూరిపోస్తుంటారు. జాతి ప్రయోజనాలు సమాజంలోని విడి వర్గాల ప్రయోజనాలకు పైనే ఉంటాయి మరి.

దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు హిందూ సమాజంలో విభాగాలు మాత్రమే. బ్రాహ్మణవాదపు ప్రతిభా మూర్తులే జాతికి ప్రతి బింబం అన్నమాట. దీన్ని ఏ పరిస్థితుల్లోనూ ఇబ్బందిపెట్టరాదు. సంఘ్‌ పరివార్‌లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చే సైద్ధాంతిక శిక్షణలో కులాలకు, కమ్యూనిటీలకు, మహిళలకు ఇవ్వాల్సిన సమాన హక్కుల కంటే దేశంలోని మైనారిటీ మతస్తులే అసలు శత్రువులని నూరిపోస్తుంటారు.ఏబీసీలకు చెందిన మన ప్రధాన మంత్రి కూడా దీనికి భిన్నంగా ఉండరు. రిజర్వేషన్‌ బిల్లు రద్దు కనుక పార్లమెంటు ముందుకు వస్తే దాన్ని ఆమోదింపచేసే బాధ్యత మోదీ మీదే ఉంది. పైగా దానికి అనుగుణంగా ఓట్లేయడానికి ప్రతిపక్ష పార్టీలనుంచి బొచ్చెడుమంది సభ్యులు క్రాస్‌ ఓటు వేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కూడా.

దేశంలో శూద్ర, ఓబీసీ, దళిత నేపథ్యంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలకు మోహన్‌ భాగవత్‌ నిర్నిరోధక శక్తిని నిలువరించే సత్తా లేదు. శక్తివంతుడైన ఓబీసీ ప్రధానమంత్రి గత అయిదేళ్ల పాలనలో దేశంలోని మొత్తం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు వంటి అత్యున్నత విద్యాసంస్థలను రిజర్వేషన్‌ సమస్యపై మోహన్‌ భాగవత్‌ను అనుసరించే వ్యక్తుల చేతుల్లో పెట్టారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఐఐటీ, ఐఐఎమ్‌ల డైరెక్టర్లలో చాలామంది రిజర్వేషన్లపై ఆరెస్సెస్‌ అధినేత అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నవారే. చివరకు కమ్యూనిస్టులలో కూడా చాలామంది  ఈ సిద్ధాంతాన్నే విశ్వసిస్తున్నారు. కులపరమైన అసమానతలకు సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు అనేక పార్టీల రాజకీయ సరిహద్దులు చెరిగిపోతుంటాయి. రిజర్వేషన్‌ బిల్లు తీరా పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజున మోహన్‌ భాగవత్‌ తన నిజమైన మిత్రులను తప్పక కనుగొంటారు.

అదేసమయంలో అంబేడ్కర్, ఆయన అనుయాయులు,  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తుతుంటారు. ముస్లింలు అంతర్జాతీయ కమ్యూనిటికీ చెందినవారు కాబట్టి ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పుడు అదొక ప్రపంచ సమస్య అయిపోయింది. కానీ రిజర్వేషన్ల రద్దు చట్టం ఉనికిలోకి వచ్చినప్పుడు ఏ అంతర్జాతీయ వేదిక కూడా దానిగురించి చర్చించబోదు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు.. ముస్లింలలాగా అంతర్జాతీయ శక్తిగా లేరు. రిజర్వేషన్ల పరిధికి అవతల ఉన్న కులాల్లో రిజర్వేషన్‌ వ్యతిరేక సెంటిమెంట్‌ బీజేపీ అధికారంలోకి వచ్చాక బాగా పెరుగుతోంది.

దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఇప్పటివరకు ఇంగ్లిష్‌ చదివిన మేధో శక్తి దన్ను లేదు. సర్‌ సయ్యద్‌ హమద్, అలీగర్‌ ముస్లిం యూనివర్శిటీ ప్రభావ ఫలితంగా ముస్లింలు ఇంగ్లిష్‌ చదువుకున్న విద్యావంతుల వర్గంగా మారారు. కానీ అలాంటి సెక్షన్‌ దళితులకు, ఓబీసీలకు లేదు. రిజర్వేషన్‌ చట్టం రద్దుకు ఆరెస్సెస్‌ తప్పకుండా బలమైన పునాదిని సిద్ధం చేస్తుంటుంది. ప్రాచీనకాలపు వర్ణధర్మ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని గోల్వాల్కర్‌ తన ఒక పుస్తకంలో ప్రతిపాదించారు. మహాత్మాగాంధీ కూడా వర్ణధర్మ పునరుద్ధరణకు అనుకూలంగా వాదించారు కాబట్టి ఆరెస్సెస్‌ శక్తులు గాంధీ భావాల మద్దతును కూడా తీసుకోవచ్చు. 

ఆరెస్సెస్, బీజేపీలు రిజర్వేషన్‌ బిల్లు రద్దుకు పూనుకుంటే, సెక్యులర్‌ ముసుగులోని రిజర్వేషన్‌ వ్యతిరేక శక్తులు చాలావరకు వారికి మద్దతు ఇస్తాయి. లౌకికవాదులు కాంగ్రెస్‌ పాలనలో విద్యా సంస్థలను నిర్వహించినప్పుడు రిజర్వేషన్ల అమలుకు తిరస్కరించిన చరిత్ర కూడా ఉంది. నేడు ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో ఆరెస్సెస్, బీజేపీకి కొత్త మద్దతుదారులు చాలామంది దొరికారు. అలాగే రిజర్వేషన్ల రద్దు విషయంలోనూ ప్రతిపక్ష శిబిరం నుంచి వీరికి మరింత మద్దతు లభించవచ్చు కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఇప్పుడు దళిత, ఓబీసీ, ఆదివాసీ, మైనారిటీ, శరణార్థుల హక్కులను రద్దు చేసి యుగంలో ఉంటున్నాము. ఇది ప్రజాస్వామ్యం నూతన దశ.


ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ   

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top