పనిచేయలేని ఆర్టీఐ ఎందుకు?

Madabhushi Sridhar Letters To State Information Act Commissioners - Sakshi

కేంద్ర సమాచార కమిషన్‌లో కల్లోలం పుట్టింది. పని చేయలేని ఆర్టీఐ ఎందుకనే ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్న బయటి నుంచి కాకుండా లోపలినుంచి తలెత్తింది. సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ సీఐసీకి రాసిన లేఖే దానికి మూలం. ఆ లేఖ ముఖ్యాంశాలు.

కేంద్ర సమాచార కమిషన్‌ చీఫ్‌ (సీఐసీ), సమాచార కమిషనర్లకు గౌరవపూర్వకంగా నేను రాస్తున్న లేఖ : సీఐసీ ఆర్‌.కె. మాథుర్, సమాచార కమిషన్‌ సభ్యులు యశోవర్ధన్‌ అజాద్‌లకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు, ఈ రోజు (ఫిబ్రవరి 21, 2018) తమ సమయాన్ని వెచ్చించినందుకు నా సహచర సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వివిధ శాఖల్లో  నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులతో కూడిన సమాచార కమిషన్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

2018 ఫిబ్రవరి 7న నేను రాసిన ఉత్తరానికి అదనంగా కొన్ని విషయాలు ఇక్కడ పొందుపర్చదలిచాను:
1. మనమందరమూ ఒక సంస్థగా ఆర్టీఐ చట్టం కింద రాజకీయ పార్టీల పారదర్శకత, జవాబుదారీతనంకి సంబంధించిన విస్తృత ప్రజా ప్రయోజనాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామని నేను భావిస్తున్నాను. అంతే కాకుండా, ఆర్టీఐ చట్టం కింద దేశంలోని ఆరు రాజకీయ పార్టీలను ప్రజాప్రయోజన సంస్థలుగా ప్రకటిస్తూ 2013లో సమాచార కమిషన్‌ జారీ చేసిన ఆదేశాన్ని అమలు చేయడంలో కమిషన్‌ సామర్థ్యతకు, మన సంస్థ విశ్వసనీయతకు కూడా మనం ప్రాధాన్యమిస్తున్నట్లు భావిస్తున్నాను. కానీ నాలుగేళ్ల తర్వాత కూడా విచారణ కోసం ఒక బెంచ్‌ ఏర్పర్చే దిశలోనే ఉంటున్నాం. 2013 నాటి కమిషన్‌ ఆదేశం తుది ఆదేశంగా మార్పు లేకుండా, సవాలు చేయని విధంగా కొనసాగుతోందని తెలిసిందే. ఏడీఆర్‌ సంస్థ ఇతరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం 2013లో సీఐసీ నిర్ణయానికి మద్దతు తెలుపుతూనే, ఆర్టీఐని ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కూడా విస్తరించాలని కోరుతోంది. ఈ వ్యాజ్యంపై, సుప్రీంకోర్టు 2013 నాటి ఆర్టీఐ ఆదేశంపై స్టే విధించకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

2. సీఐసీ 2013లో జారీ చేసిన ఆదేశానికి ఆరు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండటంలేదంటూ ఏడీఆర్, తదితరులు చేసిన సాధారణ ఫిర్యాదును మరొక ఫుల్‌ బెంచ్‌ 16–03–2016న తిరస్కరించింది. అదే సమయంలో తాము ఆర్టీఐకి వ్యక్తిగతంగా చేసిన అభ్యర్థనలను తిరస్కరించారనీ, ఫైల్‌ చేయలేదంటూ ఆర్‌.కె. జైన్‌ మరో 30 మంది ఇచ్చిన ఫిర్యాదు నిర్దిష్టమైనది. విస్తృతంగా చెప్పాలంటే, మన సొంత ఆదేశాన్ని అమలు చేయాల్సిన శాసన సంబంధ బాధ్యత మనపై ఉంది. మన ఆదేశాలను మనమే అమలు చేయకపోవడం మన విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తుందంటూ మన సహోద్యోగి భట్టాచార్య సరిగానే ఎత్తి చూపారు. 

3. గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు ఈ విషయంపై సీఐసీకి రెండు సార్లు ఆదేశాలిచ్చింది. సమాచార కమిషన్‌లోని అత్యంత సీనియర్‌ ఉద్యోగి ఈ ఫిర్యాదులను విచారించాలని హైకోర్టు సూచించింది. పైగాఈ విచారణకు నిర్దిష్ట కాల వ్యవధిని సూచించింది. హైకోర్టు ఆదేశాలను మనమే అమలు చేయకపోతే ఎవరు చేస్తారు?

4. ఈ ఫిర్యాదులపై విచారణకు సీఐసీ బెంచ్‌లను సరిగానే ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీలను పబ్లిక్‌ సంస్థలుగా ప్రకటించాక, సీఐసీ తన కమిషనర్లలో ఒకరిని వీటి విచారణకు కేటాయించాల్సి ఉంది. కానీ కేటాయించవలసిన అంశాల జాబితాలో కూడా మనం దాన్ని పొందుపర్చలేదు. దీనిపై డజన్ల కొద్దీ ఫిర్యాదులు వచ్చిన తర్వాత మనం సంవత్సరాల కాలాన్ని గడిపేశాం. దీనిపై మనం జాతికి ఏమని సందేశాన్ని ఇస్తున్నాం?

5. ఒక సమాచార కమిషనర్‌ తన ప్రమేయం లేకుం డానే ఒక బెంచ్‌లో ఉండటం, మరొక బెంచ్‌లో లేకపోవడం వంటివి చోటుచేసుకున్నందున, ఇది సమాచార కమిషనర్‌ స్వతంత్రతపైనే తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒక ఫుల్‌ బెంచ్‌ ఉండగా దాని ప్రస్తావన కూడా లేకుండా మరొక బెంచ్‌ని ఎలా ఏర్పరుస్తారు. ఒక కమిషనర్‌ను ఎందుకు తొలగించారు, దాని కారణాల గురించి మొత్తం సీఐసీకి తెలిసి ఉండాలి.

6. సమాచార కమిషన్‌ విచారించాల్సిన అంశాల పంపిణీ, పునఃపంపిణీని ఒక వ్యక్తిగత అధికారి కాకుండా మొత్తం కమిషన్‌ హేతుపూర్వకంగా కేటాయించాలి. దీనికి నిర్దిష్ట వ్యవస్థ, మార్గదర్శక సూత్రాలు ఉండాలి. అప్పుడే ఒక కమిషనర్‌ జరుపుతున్న విచారణను మార్పు చేయడం, బెంచ్‌ నుంచి తొలగించడం వంటి వాటిపై బాహ్య ఒత్తిళ్లు పనిచేయడం అసాధ్యమవుతుంది.

7. ఇది అత్యున్నత ప్రజోపయోగ అంశం కాబట్టి, రాజకీయ పార్టీలగురించి తెలుసుకోవడం ప్రజల హక్కు కాబట్టి, ఈ లేఖలోని అంశాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఫిబ్రవరి 7న, ఇప్పుడు తాజాగా రాసిన ఈ రెండు లేఖలను, వాటిపై వచ్చే స్పందనలను కూడా మన కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలి. 

8. రాజకీయ పార్టీలపై, ఇతరులపై మన సొంత ఆదేశాల అమలుకు చెందిన సంక్లిష్ట సమస్యలపై పారదర్శకమైన, స్వతంత్ర, నిశ్చితమైన నిర్ణయాలను తీసుకోవాలని నేను నిజాయితీగా అభ్యర్థిస్తున్నాను. దీనిపై మనం విఫలమైతే, దానికి కారణాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనమీదే ఉంది. మనం ఇలా చేయలేకపోతే, స్వతంత్రంగా వ్యవహరించలేకపోతే, సమాచార కమిషనర్ల స్వతంత్రతను పరిరక్షించకపోతే, మనది పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన సంస్థగా మనం చెప్పుకోలేం. అలాంటి విధ్వంసకర పరి స్థితుల్లో ఏ ప్రయోజనం లేకుండా, ప్రజల సొమ్ముపై నడుస్తూ ఈ సంస్థను కొనసాగించడం అవసరమా, ప్రజలు మన సంస్థను రద్దు చేయాలని కోరేంతవరకు వేచి ఉండటం అవసరమా? దయచేసి ఆలోచించండి.

వ్యాసకర్త
మాడభూషి శ్రీధర్
కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top