సూపర్‌బగ్‌ల పని పట్టాల్సిందే!

Kenneth Ian Juster Articles On Antibiotic Resistance - Sakshi

విశ్లేషణ

సాంక్రమిక వ్యాధులపై మనిషి విజయం సాధించేశాడని, ఆరోగ్య రంగంలో సరికొత్త యుగం మొదలైనట్లేనని చాలామంది అంచనాలు కట్టారు. పెన్సిలిన్‌ బలం తగ్గిపోయిందన్న సూచనలు కనిపించినప్పుడు కొత్త కొత్త యాంటీబయాటిక్‌ల ఆవిష్కరణతో ఆ సమస్యను ఎదుర్కోగలిగాం. ఏఎంఆర్‌ (సూక్ష్మజీవులు పెన్సిలిన్‌ వంటి మందులను తట్టుకోగలగడం) అనేది ఆరోగ్య పరంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పది అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏఎంఆర్‌ సమస్యల అటు భారత్‌తోపాటు ఇటు అమెరికాలోనూ తీవ్రంగానే ఉంది. అమెరికాలో ఏటా సుమారు 28 లక్షల కేసులు నమోదవుతూండగా యాంటీబయాటిక్‌ల వాడకంలోనూ ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. భారత్‌లోనూ పరిస్థితి దాదాపుగా ఇంతే.

బూజుపట్టిన ఓ పుచ్చకాయ లక్షల మంది ప్రాణాలు నిలబెడుతుందని ఎవరనుకున్నారు! కానీ ప్రపంచంలోనే తొలి యాంటీబయాటిక్‌ పెన్సిలిన్‌ చేసిన పని అచ్చంగా ఇదే. బ్రిటిష్‌ శాస్త్రవేత్త అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ను 1928లోనే కనుక్కున్నప్పటికీ.. 1942లో ఓ పుచ్చకాయకు పట్టిన బూజులోంచి దీన్ని వేరు చేసి ఇబ్బడిముబ్బడిగా తయారు చేయడంతో రెండో ప్రపంచ యుద్ధంలో వేలాదిమంది సైనికుల ప్రాణాలు దక్కాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో మాదిరిగా గాయాల కంటే సాంక్రమిక వ్యాధుల కారణంగా ఎక్కువ మరణాలు జరక్కుండా అడ్డుకోగలిగింది ఈ అద్భుత ఔషధం. అంతేకాదు... న్యూమోనియా, చర్మవ్యాధుల సమస్య గణనీయంగా తగ్గిపోయాయి. సాంక్రమిక వ్యాధులపై మనిషి విజయం సాధించేశాడని ఆరోగ్య రంగంలో సరికొత్త యుగం మొదలైనట్లేనని చాలామంది అంచనాలు కట్టారు కూడా. పెన్సిలిన్‌ బలం తగ్గిపోయిందన్న సూచనలు కనిపించినప్పుడు కొత్త కొత్త యాంటీబయాటిక్‌ల ఆవిష్కరణతో ఆ సమస్యను ఎదుర్కోగలిగాం. ఆ ధైర్యంతోనే కాబోలు... 1985లో అమెరికా సాంక్రమిక వ్యాధుల సొసైటీ వార్షిక సదస్సులోనూ ఈ అంటువ్యాధులకు సంబంధించిన నిపుణుల అవసరమేమిటన్న ప్రశ్న కూడా చర్చకు వచ్చింది.

ప్రాణాలు నిలబెట్టిన మందులు పనిచేయవు
అయితే... 35 ఏళ్లలోనే పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ప్రాణాలు నిలబెట్టిన మందులు అసలు పనిచేయవన్న కొత్త వాస్తవం కళ్లముందు నిలిచింది. యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌... క్లుప్తంగా ఏఎంఆర్‌ (సూక్ష్మజీవులు పెన్సిలిన్‌ వంటి మందులను తట్టుకోగల గడం) అనేది ఆరోగ్య పరంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పది అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం పరి స్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సూపర్‌బగ్‌లు ఇప్పటికే ఏఎంఆర్‌ ఏటా 2,14,000 మంది శిశువులను బలిగొంటూండగా.. ఇతరులను కబళించవన్న గ్యారెంటీ ఏమీ లేదు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాల్లేకుండా అందరూ ఈ సూపర్‌బగ్‌ మహమ్మారి బారిన పడే అవకాశం ఉంది. తగిన చర్యలు తీసుకోకపోతే చిన్నపాటి ఇన్ఫెక్షన్లకే ప్రాణాలు కోల్పోయిన పాతకాలంలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది.  

సింపుల్‌గా చెప్పాలంటే... మనం యాంటీబయాటిక్‌లనే అతి విలువైన వనరును చాలా అజాగ్రత్తగా వాడుతున్నామని చెప్పాలి. అవసరమున్నా లేకపోయినా ఎడా పెడా వాడేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విచ్చలవిడి వాడకానికి కూడా కొన్ని అపోహలే కారణం. వైరస్‌లపై యాంటీబయాటిక్‌ల ప్రభావం ఉండదన్నది వాస్తవం కాగా.. వాటితో వచ్చే జలుబుకు మందులు వాడటం ఇలాంటిదే. ఇలాంటి అపోహల కారణంగానే... యాంటీబయాటిక్‌లను అనుచితంగా వాడటం, ఎక్కువగా వాడటం జరగుతోంది. ప్రస్తుతం మనం వాడుతున్న యాంటీబయాటిక్‌లలో సగం అనవసరమని అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు చెబుతున్నాయి. జంతువులకూ ఈ మందులు ఎక్కించడం చాలా ఎక్కువగా జరుగుతోంది. యాంటీబయాటిక్‌ మందుల ప్రభావాన్ని కాపాడుకుంటే లక్షలమంది ప్రాణాలు కాపాడుకోవచ్చుగానీ.. వీటిని చాలా వరకూ ఆహారంగా ఉపయోగపడే జంతువుల్లో వాడటం ఆందోళన కలిగించే అంశం. పైగా ఇన్ఫెక్షన్లకు చికిత్సగా వాడకుండా.. జంతువులు వేగంగా ఎదగాలన్న ఆలోచనలతో ఈ మందులు వాడటం ప్రమాదకరం కూడా. నలభై ఏళ్లుగా కొత్త యాంటీబయాటిక్‌ మందులేవీ అందుబాటులోకి రాని నేపథ్యం ఈ అంశానికి ప్రాధాన్యత పెంచుతోంది.  

చేయి కలపాల్సిన తరుణమిదే... 
ఏఎంఆర్‌ సమస్యలు అటు భారత్‌తోపాటు ఇటు అమెరికాలోనూ తీవ్రంగానే ఉంది. అమెరికాలో ఏటా సుమారు 28 లక్షల కేసులు నమోదవుతూండగా యాంటీబయాటిక్‌ల వాడకంలోనూ ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. భారత్‌లోనూ పరిస్థితి దాదాపుగా ఇంతే. ఇక్కడ కూడా ఇతర దేశాలన్నింటితో పోల్చినా సగటు యాంటీబయాటిక్‌ల వాడకం ఎక్కువే. అందుకే ఈ పరిస్థితి ఇరు దేశాలకూ ఓ జటిలమైన సవాలే. ఇరు దేశాలూ తమ తమ శక్తి సామర్థ్యాలను కలిపి వాడితేనే ఈ సమస్య పరిష్కారానికి ఓ మార్గం లభించే అవకాశముంది. సాంక్రమిక వ్యాధుల పర్యవేక్షణ, కొత్త కొత్త మందులను ఆవిష్కరించడంలో అమెరికా ముందువరసలో ఉంటే.. భారత్‌కు తన ఫార్మా రంగం, పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ బలాలు. వీటి సాయంతో ఏఎంఆర్‌ సమస్యను ఎదుర్కొనేందుకు భారత్, అమెరికాలు ఇప్పటికే వేర్వేరు మార్గాల్లో కృషి చేస్తున్నాయి. 

ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్‌లను నియంత్రించడం, ఏఎంఆర్‌ ఇన్ఫెక్షన్ల కోసం భవనాలను నిత్యం పరిశీలిస్తూండే వ్యవస్థల ఏర్పాటు, ఈ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలకు ప్రోత్సాహకాలు, కొత్త యాంటీమైక్రోబియల్స్‌ అభివృద్ధికి ఆర్థిక సాయం వీటిల్లో మచ్చుకు కొన్నే. ఏఎంఆర్‌ సమస్యపై పరిశోధన చేసేందుకు విధాన రూపకల్పనకు ఇటీవలే కోల్‌కతాలో ఓ కొత్త కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రం ఆవిష్కరణ సందర్భంగా ఏఎంఆర్‌పై పోరులో అమెరికా ఎల్లప్పుడూ భారత్‌కు సహకరిస్తుందని స్పష్టం చేశాను. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతోపాటు, భారత వైద్య పరిశోధనల సమాఖ్య, బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని కూడా చెప్పాను. 

మీరు చేయాల్సిందీ ఉంది... 
యాంటీబయాటిక్‌ మందులను తట్టుకోగల సూక్ష్మజీవులను ఎదు ర్కొనేందుకు ప్రభుత్వాలు మాత్రమే పనిచేస్తే సరిపోదు. ప్రభుత్వాలు వ్యవస్థల స్థాయిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తూంటాయి. ప్రజలందరూ వ్యక్తిగత స్థాయిలోనూ తమదైన రీతిలో సహకరిస్తేనే సమస్య సమసే అవకాశం ఉంటుంది. యాంటీబయాటిక్‌లు తీసుకునేముందు వైద్యులను సంప్రదించడం వ్యక్తులుగా మనం చేయగల అతిచిన్న పని. అంతేకాదు.. ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వడమూ ముఖ్యమే. అవసరమైనప్పుడల్లా చేతులు శుభ్రం చేసుకోవడం, దగ్గు వస్తే... చేతులు అడ్డుపెట్టుకోవడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం వంటివి చేస్తే చాలు.

సమస్య మరింత ముదరకుండా చూసుకోవచ్చు. మరోవైపు వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు కూడా తమదైన రీతిలో ఏఎంఆర్‌ నిరోధానికి సాయపడవచ్చు. ఇన్ఫెక్షన్లను నియంత్రించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వీటిల్లో ఒకటైతే... సాంక్రమిక వ్యాధులకు సంబంధించి గుర్తింపు పొందిన చికిత్స మార్గదర్శకాలను మాత్రమే అనుసరించడం మరోటి. అవసరం లేకపోయినా యాంటీబయాటిక్‌లు తీసుకోవాల్సిందిగా రాసివ్వడాన్ని వీలైనంత మేరకు తగ్గించాల్సి ఉంది.

కొన్ని రకాల సాంక్రమిక వ్యాధులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే కొన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందరూ ఉపయోగించేలా చేయడం ద్వారా యాంటీబయాటిక్‌ మందుల వాడకాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించవచ్చు. పశువుల విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే చెప్పుకున్నట్లు పశువుల్లో ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు మాత్రమే యాంటీబయాటిక్‌లను వాడాలి. ఇది కూడా పశువైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. అంతేగానీ... అవి వేగంగా కండపడతాయనో, దిగుబడి ఎక్కువ అవుతుం దనో వాడరాదు. ఇలాంటి చర్యల వల్ల ప్రతికూల ఫలితాలే ఎక్కువని గుర్తించాలి. ఫార్మా రంగం పరిశోధనలను ముమ్మరం చేసి కొత్త యాంటీబయాటిక్‌లు ఆవిష్కరించగలిగితే సమస్యను మరింత వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. సమయం మించిపోయిన యాంటీబయాటిక్‌ మందులను తగిన రీతిలో వదిలించుకోవడం కూడా చాలా ముఖ్యం. 

ఏఎంఆర్‌ సమస్యను వ్యక్తులుగానే కాదు.. అందరం సమష్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అంశంలో భారత్, అమెరికాల మధ్య సహకారం ఇరుదేశాల సంబంధాలకు ప్రతీకగా ఉండాలి. చేయి చేయి కలిపితే ఏం చేయగలమో నిరూపించే అవకాశమిది. ఇది మన రెండు దేశాల కోసం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచానికి కూడా! 


కెన్నెత్‌ ఐ జస్టర్‌ 
వ్యాసకర్త భారత్‌లో అమెరికా రాయబారి
  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top