మన చెలిమికి ఆకాశమే హద్దు

Kenneth Juster Guest Column On USA And Indian Relationship - Sakshi

విశ్లేషణ

భారతదేశంతో అమెరికా ఏర్పర్చుకున్న బలమైన రక్షణ బాంధవ్యం ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్యా లేదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. గత రెండు దశాబ్దాలుగా మన వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది. భారతీయులకు ఉద్యోగాల కల్పన, వినియోగదారీ వస్తువులు, సాంకేతిక నైపుణ్యం, ఆర్థికపరమైన మెరుగుదల వంటివాటిని కల్పించడంలో అమెరికా లాగా ప్రపంచంలో మరే దేశమూ ముందుకు రాలేదు. సరిహద్దుల్లో చైనా దూకుడు కార్యకలాపాలను భారత్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా, భారత్‌ మధ్య సన్నిహిత సమన్వయం చాలా ముఖ్యమైనది. నాలుగేళ్లుగా మన రెండు దేశాలూ సాధించిన విజయాలు గర్వకారణం. అమెరికా నూతన ప్రభుత్వం కూడా ఈ సంబంధాలను కొనసాగించగలదు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం మధ్య  నెలకొన్న విశాలమైన, కీలకమైన, సుసంపన్నమైన ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్య తరచి చూసినా లేవు. రక్షణ రంగం, ఉగ్రవాద నిరోధం, సైబర్‌ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనరంగం, పర్యావ రణం, ఆరోగ్యం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, వ్యవసాయం, అంతరిక్షం ఇలా ఎన్నో రంగాల్లో మన రెండు దేశాలూ ప్రస్తుతం సహ కరించుకుంటున్నాయి. గత రెండు దశాబ్దాలుగా మన వ్యూహాత్మక భాగస్వామ్యం వాస్తవానికి కొత్త పుంతలు తొక్కింది. ప్రత్యేకించి గత నాలుగేళ్ల సమయం మన రెండు దేశాలు తమ ఆకాంక్షలు, విజ యాలను నెరవేర్చుకున్న కాలంగా నిలిచిపోయింది.

భారత్‌ వికాసం పట్ల అమెరికా నిబద్ధత, స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో పసిఫిక్‌ ప్రాంతంపై పరస్పర దార్శనికతల నుంచి మన రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సమన్వయం సాధ్యపడింది. ఇండో–పసిఫిక్‌ సహకార భావన రూపొందుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టినప్పటికీ గత నాలుగేళ్లుగా ఆ భావన వాస్తవ రూపం దాల్చడానికి మన రెండు దేశాలూ గొప్ప ఆకాంక్షనూ, పరిణ తినీ ప్రదర్శించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించి నంత వరకు ఇండో–పసిఫిక్‌ అంటే అర్థం ఏమిటంటే.. ప్రపంచం ముందు గొప్ప మార్పు, సవాళ్లు ఎదురవుతున్న సమయంలో, ఈ గతిశీలమైన ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలను పరిరక్షించడంలో, విస్తరింపజేయడంలో భారత్‌ ఒక కీలక భాగస్వామి అని మేము పరిగణిస్తుండటమే.

ఆసియన్‌ దేశాల కీలకస్థానాన్ని మేం బలపరుస్తూనే ఈ ప్రాంతం రూపురేఖలను స్పష్టంగా నిర్మించడానికి భావ సారూప్యత కలిగిన దేశాలతో సమన్వయాన్ని ప్రారంభించాము. మనం ఇటీవలికాలంలో నిర్వహించుకున్న త్రైపాక్షిక సదస్సులు (2018, 2019 సంవత్సరాల్లో జపాన్‌తో), మన నాలుగు దేశాల మంత్రులతో సదస్సులు (2019, 2020 సంవత్సరాల్లో జపాన్, ఆస్ట్రేలియాతో) అనేవి సముద్ర భద్రత, మహమ్మారి నిర్వహణ, ప్రాంతీయ అనుసంధానం, మానవతా సహాయం, విపత్తు ఉపశమనం, సైబర్‌ భద్రత వంటి వాటితోపాటు మన దేశాల మధ్య గొప్ప సహకారానికి దారితీశాయి. సార్వభౌమా ధికారం, చట్టప్రాతిపదికన పనిచేసే వ్యవస్థను ఎంతగానో గౌరవించే ప్రాంతం నుండి అన్ని దేశాలు సౌభాగ్యం పొందేలా తదుపరి నాలుగు సంవత్సరాలు, ఆ పై సంవత్సరాల్లో కూడా తగిన అవకాశాన్ని కల్పిం చడమే మన లక్ష్యంగా ఉంటుంది.

బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం శాంతి, దౌత్యపరమైన పరిష్కారాలకు కట్టుబడి ఉంటు న్నాయి. గత నాలుగేళ్లుగా మన దేశాలు సురక్షితంగా ఉండేలా జాగ్ర త్తలు తీసుకోవడమే  కాకుండా మన సరిహద్దుల అవతల కూడా భద్ర తను కల్పించడానికి మన రక్షణ, భద్రతా సహకారాన్ని మరింతగా పెంచుకున్నాము. ఇకపోతే 2018 సెప్టెంబర్‌ నాటికి మన ద్వైపాక్షిక రక్షణ, భద్రతాపరమైన భాగస్వామ్యం కొత్త దశకు చేరుకుంది. ఆ సంవత్సరం అమెరికా, భారత రక్షణ, విదేశీ విధాన నిర్ణేతల మధ్య 2+2 మంత్రిత్వ శాఖల సంభాషణను ప్రారంభించాం. అలాంటి మూడు మంత్రిత్వ శాఖల చర్చలను మనం నిర్వహించుకున్నాం. ఆ క్రమంలో మన బలగాలు, రక్షణ రంగ పరిశ్రమలు కలిసి పనిచేసేలా కీలకమైన రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నాం.

2019లో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాతో కలిసి మన మూడు దేశాల సైనిక విన్యాసాలను నిర్వహించడం, అలాగే మలబార్‌ తీరంలో జపాన్‌తో సైనిక విన్యాసాలు నిర్వహించడం ద్వారా మన మధ్య అనేక సైనిక విన్యాసాలను విస్తరింపజేసుకున్నాం. ఇలాంటి ఎన్నో ఇతర విజయా లను గుర్తు చేసుకుంటూ, భారతదేశంతో అమెరికా ఏర్పర్చుకున్న బలమైన రక్షణ బాంధవ్యం ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్య కూడా లేదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే భారతీయుల భద్రతకు కూడా ఇతోధికంగా తోడ్పడగలిగాం. సరిహద్దుల్లో చైనా దూకుడు కార్యకలాపాలను భారత్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నేప థ్యంలో మన సన్నిహిత సమన్వయం చాలా ముఖ్యమైనదని నేను దృఢంగా భావిస్తున్నాను. 

ఆర్థిక రంగంలోనూ ఈ స్థాయితో కూడిన ఆకాంక్షలను కలిగి ఉండాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మన రెండుదేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించిన పొత్తు పెరుగుతూనే వస్తోంది కానీ అవి తమ పూర్తి సామర్థ్యానికి ఇంకా చేరుకోలేదు. 2019లో అమెరికా, భారతదేశం మధ్య ద్వైపాక్షిక వ్యాపారం వస్తు సేవల రంగంలో 146.1 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2001 సంవత్సరంలో ఇది కేవలం 20.7 బిలియన్‌ డాలర్ల వద్దే పరిమితమై ఉన్నదని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 16 శాతం వరకు అమెరికాకు చేరుకుంటున్నాయి. అమెరికా ఇప్పుడు భారతదేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మొత్తం మీద అమెరికా వాణిజ్యరంగంలో భారత్‌ 12వ అతిపెద్ద భాగస్వామిగా ఉంటోంది. అన్నిటికీ మించి భారతీయులకు ఉద్యోగాల కల్పన, విని యోగదారీ వస్తువులు, సాంకేతిక నైపుణ్యం, ఆర్థికపరమైన మెరుగు దల వంటివాటిని కల్పించడంలో అమెరికా లాగా ప్రపంచంలో మరే దేశమూ ముందుకు రాలేదని గర్వంగా చెబుతాను.

మన రెండు దేశాల మధ్య మరో కీలక భాగస్వామ్యం ఇంధన రంగంలో ఉంది. గత నాలుగేళ్లలో మనం ఈ విషయంలోనూ గణ నీయ ఫలితాలను సాధించామని చెప్పాలి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యాన్ని మనం 2018లో ప్రారంభించాం. రెండుదేశాల ప్రభుత్వాల మద్దతు కారణంగా ఇప్పుడు భారత ఇంధన రంగానికి అమెరికా అతి ముఖ్యమైన వనరుగా ఉంటోంది. 2019 నాటికి బొగ్గు రంగంలో అమెరికాకు అతిపెద్ద దిగుమతిదారుగా భారత్‌ ఆవిర్భవించింది.

ముడి చమురును అమెరికా నుంచి దిగుమతి చేసు కుంటున్న నాలుగో అతిపెద్ద దేశంగా భారత్‌ స్థానం సంపాదించింది. కాగా అమెరికా సహజవాయువుకు ఏడవ అతిపెద్ద దిగుమతిదారుగా భారత్‌ నిలిచింది. ఇవన్నీ కలిసి భారతదేశ వైవిధ్యపూరిత ఇంధన వనరులకు ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పాలి. ఈరోజు భారత దేశంలో ఇంధన రంగంలో దాదాపు 100 అమెరికా కంపెనీలు పనిచేస్తు న్నాయి. ఈ రంగంలోని అన్ని విభాగాల్లోనూ అమెరికన్‌ కంపెనీలు ప్రవేశించాయని గర్వంగా చెబుతున్నాను.

ఇకపోతే ఆరోగ్య, బయో మెడికల్‌ ఆవిష్కరణల రంగం కూడా మన రెండు దేశాలకు కీలక ప్రాధాన్య రంగంగా ఉంటోంది. విజయ వంతమైన మన సహకార చరిత్ర కోవిడ్‌–19 మహమ్మారిపై కలిసి సహకరించుకునేందుకు వీలు కల్పించింది. అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, ప్రివెన్షన్‌ (సీడీసీ) నిపుణులు కరోనా వైరస్‌ జాడ పసిగట్టడంలో, పరీక్షించడంలో, ఇన్‌ఫెక్షన్‌ నిరోధించడంలో, ఆరోగ్య సంస్థల నియంత్రణలో భారత్‌ ప్రయత్నాలకు సాంకేతిక మార్గదర్శ కత్వం, శిక్షణను అందించారు. అమెరికాకు చెందిన సీడీసీలో వంద లాది పట్టభద్రులు శిక్షణ పొంది ఉండటంతో వైరస్‌ను దీటుగా ఎదుర్కొవడంలో భారత్‌ ముందంజ వేసింది.

పైగా, అమెరికా, భారత శాస్త్రవేత్తలు కోవిడ్‌–19 వ్యాక్సిన్, చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయడంలో పరస్పరం సహకరించుకున్నారు. ఇది మరింత సురక్షిత వైద్య సప్లయ్‌ చైన్లను వృద్ధి చేయడంతోపాటు మన రెండు దేశాల ఆరోగ్యరంగాల మధ్య మరింత బలమైన కృషి జరగడానికి వీలు కల్పించనుంది. ఆరోగ్య రంగంలో మన సహకారం రెండు దేశాలను మరింతగా మెరుగుపర్చడమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ ప్రయో జనం కలిగించింది.

ఘనమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను కలిగి ఉన్న మన రెండు దేశాలూ, ప్రభుత్వాలూ ప్రజాభిప్రాయాన్ని తప్పనిసరిగా ఆలకిస్తాయి. మన ప్రజల మధ్య సంబంధాలు బలమైన పునాదిని ఏర్పర్చడమే కాకుండా మన సంబంధాల విషయంలో చోదకశక్తిగా కూడా పని చేస్తున్నాయి. ఈ సంబంధాలను సరైన మార్గంలోకి తీసుకుపోవడం, స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో–పసిఫిక్‌ ప్రాంతాన్ని రూపొందించడం రెండు దేశాలకు ఎంతో ముఖ్యమని, అమెరికా– భారత్‌ నాయకులు గుర్తించారు. చివరగా, గత నాలుగేళ్లుగా మనం సాధించిన విజయాల పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాను. రాబోయే అమెరికా నూతన ప్రభుత్వ యంత్రాంగం కూడా భారతీయ భాగస్వా ములతో ఈ సంబంధాలను కొనసాగించగలదని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రతి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం కూడా తనకు మునుపటి ప్రభుత్వం భారత్‌తో విస్తరించిన సంబంధాలను విజయవంతంగా ముందుకు తీసుకు పోతూ వచ్చింది మరి.

-కెన్నెత్‌ ఐ. జస్టర్‌
వ్యాసకర్త భారత్‌లో అమెరికా రాయబారి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top