
1984–85 ఎన్నికలలో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు .
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం ముగి సింది. ఈ దఫా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఓటింగ్ బాగా పెరిగిందని వాదన వినవస్తోంది. పెరి గిన మహిళల ఓట్లు తమకే పడ్డాయంటూ రాజకీయ పార్టీలు ప్రత్యేకించి అధికార టీడీపీ చేస్తున్న వాదనలను పక్కనపెట్టి చూస్తే.. రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద మహిళా ఓటర్లలో చైతన్యం క్రమేణా పెరుగుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల ఓటువేసే స్త్రీ, పురుష ఓటర్ల శాతం మధ్య వ్యత్యాసం క్రమేణా తగ్గుతూ వస్తూవుందని తెలుస్తోంది. పైగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం క్రమానుగతంగా పెరుగుతూ వస్తోందని కింది పట్టిక ఆధారంగా బోధపడుతుంది.
1984–85 ఎన్నికలలో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు . అందుకే ఆ ఎన్నికలలో మహిళా, పురుషుల ఓటింగ్ శాతం మధ్య వ్యత్యాసం 2.6 శాతానికి తగ్గింది. ఈశాన్య రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో మహిళా ఓటర్ల చైతన్యం చాలా ఎక్కువ. ఎన్‌ఈఎస్ (జాతీయ ఎన్నికల అధ్యయనం) ప్రకారం 2014 సాధారణ ఎన్నికలలో ఓటువేసిన మహిళా ఓటర్ల శాతం లక్షద్వీప్‌లో 88.42శాతం, నాగాలాం డ్‌లో 87.49 శాతం, దాద్రానగర్ హవేలీలో 85.71 శాతం, త్రిపురలో 84.37 శాతం, సిక్కిం 83.88 శాతంగా నమోదు అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల చైతన్యం కోసం చేపట్టిన.. క్రమానుగతంగా ఓటర్లకు అవగాహన కలిగించడం, ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడం (ఎస్‌వీఈఈపీ) కూడా మహిళా ఓటర్లలో చైతన్యం కలిగించగలిగింది. విద్య, మహిళా స్వేచ్ఛ, సామాజిక చైతన్యం, డ్వాక్రా సంఘాల మూలంగా మహిళల్లో చైతన్యం పెరుగుతూ వస్తూ ఉంది.
మనరాష్ట్రం విషయానికొస్తే 2014 సాధారణ ఎన్నికలలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,67,63,009 కాగా అందులో మహిళా ఓటర్లు 1,84,63,770, పురుష ఓటర్లు 1,82,99,239. పురుష ఓటర్ల కంటె మహిళా ఓటర్ల సంఖ్య 1,64,531 అధికం. 2019 సాధారణ ఎన్నికలలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4,17,082 అధికం. మహిళా ఓటర్ల సంఖ్య 1,98,79,421 కాగా పురుష ఓటర్లు 1,94,62,339. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ 79.64 శాతం కాగా పురుషుల ఓటింగ్ శాతం 79.87, మహిళల ఓటింగ్ శాతం 79.41, అంటే పురుషుల ఓటింగ్ శాత మే అధికం. 2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల ఓటింగ్ 1.23 శాతం పెరిగితే అందులో పెరిగిన పురుషుల ఓటింగ్ శాతం 1.11 కాగా మహిళల ఓటింగ్ శాతం 1.36 అధికం. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో 4,17,082 మంది అధికంగా వుండటం వల్ల మహిళలు అధికంగా ఓటు వేయడం సహజం. పురుషుల కంటే 2,42,548 మహిళలు అధికంగా ఓటు వేశారు.
2014 ఎన్నికలతోపోలిస్తే ఓటు హక్కు వినియోగించిన మహిళల శాతం మరీ ఎక్కువేమి లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా ఓటర్ల శాతం గత ఎన్నికలతో పోలిస్తే 0.26 శాతం తగ్గింది. అదే పశ్చిమ విశాఖ నియోజకవర్గం విషయానికొస్తే పోలింగ్ శాతం 58 కాగా మహిళల 61 శాతం, పురుషులు 55 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి రాష్ట్రమంతా మహిళలు ఉప్పెనలా ఓటింగులో పాల్గొన్నారని భావించడంలో అర్థంలేదు. గత ఎన్నికలతో పోలిస్తే పురుషులకంటే మహిళల ఓటింగ్ శాతం 0.25 శాతం మాత్రమే ఎక్కువగా వుంది. మహిళా ఓటర్లు ఎక్కువగా పాల్గొనడం తమకే అనుకూలమని భావించే పార్టీల వాదన ముఖ్యంగా అధికార పార్టీ వాదన హేతుబద్ధం కాదని నా భావన.
వ్యాసకర్త : జి.వి. సుధాకర్‌రెడ్డి , రాజకీయ విశ్లేషకులు
మొబైల్: 94402 92989