బడుగు విద్యార్థుల సంక్షేమం పట్టదా?

Governments Neglect Govt Hostels - Sakshi

అభిప్రాయం

రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకులు సంక్షేమ హాస్టళ్ళను గాలికి వదిలేశారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 5,765 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 8,70,000 మంది పిల్లలు చేరి చదువుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు లక్షలకు పైగా వార్షిక బడ్జెట్‌ వుంది. కానీ సంక్షేమ హాస్టళ్ళు మాత్రం నలభై రెండు శాతం అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఒక్కొక్క గదిలో పది మంది పిల్లల్ని కుక్కారు. ఒక్కొక్క బాత్‌రూమ్‌ను ముప్పై మందిదాకా ఉపయోగిస్తున్నారు. బాత్‌రూమ్‌లు ఎప్పటివో. హాస్టళ్ళ క్యాంపస్‌లోకి వెళితే దుర్వాసన. వంటగది అంతా ఈగల మయం. పిల్లల శరీరం నిండా గజ్జి, తామర వంటి చర్మవ్యాధులతో గోళ్ళు పెంచుకొని గీకటం వల్ల రక్తపు మరకలు వారి శరీరం మీద కనపడుతున్నాయి. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే  52 మంది ఒక బాత్‌రూమ్‌ లోనే స్నానం చేయాలి. ఈ సంవత్సరం 10 వేలమంది ఆడపిల్లలు ఈ దుర్భర పరిస్ధితులు భరించలేక చదువు కూడా మానుకున్నారు. యాభైశాతం హాస్టళ్ళకు మంచి నీళ్ళు లేవు. హాస్టల్లో చదివే ఆడపిల్లలకు అయితే నూటికి తొంభైతొమ్మిది మందికి తగిన పాళ్లలో రక్తం లేదు. ఉడికీ ఉడకని అన్నంతో కడుపులో నొప్పి. చింతపండు బాగా పిసికిన చారు పోయడంతో విపరీతమైన కడుపు మంటలు, అల్సర్లు. పిల్లలకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. 

చంద్రబాబు తన మనవడికి పట్టువస్త్రాలు కట్టి, టోపీలు పెట్టి, రత్నాలతో కూడిన దండలు వేసి తిరుపతి వేంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదర్శనలు చేయిస్తున్నారు. కానీ తన పరిపాలనలో ఉన్న పిల్లలకు దుప్పట్లు లేక చలికి గజగజవణుకుతూ ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాణ్ని కరుచుకొని పడుకుంటున్నారని తెలియదా! ఈ హాస్టళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ పిల్లలు వుంటారని వాళ్ళకు తెలుసు. ఈ పిల్లలు చదువుకోవడం, ఆరోగ్యంగా ఉండటం పాలకులకు ఇష్టం లేదనిపిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల వసతి గృహాలకు వినియోగించాల్సిన డబ్బు 33% ఖర్చుకాకుండా మిగిలిపోయింది. అంటే  ఎస్సీ, ఎస్టీ పిల్లల సంక్షేమంపై ఖర్చు పెట్టకూడదు, వీళ్ళకు విద్య రాకూడదు, వీళ్ళు మెరుగ్గా ఉండకూడదు, వీళ్ళు కళగా ఉండకూడదు, వీళ్ళు ఆరోగ్యంగా ఉండకూడదనే ఫ్యూడల్‌ భావజాలం సీఎంలిద్దరికీ ఉంది. 2017–18లో విషజ్వరాలతో హాస్టళ్ళ నుంచి పదివేల మంది విద్యార్థుల వరకు ఇళ్ళకు వెళ్ళిపోయారు. నలభై శాతం మంది విరోచనాల బారిన పడ్డారు.

సాంఘిక సంక్షేమ హాస్టళ్ళంటే బందెల దొడ్లనీ, కిటికీల తలుపులు సరిగా లేక కుక్కలు వచ్చి అక్కడ పడుకుంటాయని, మంచాలు దుప్పట్లు లేక గచ్చు బండల మీద ఒట్టి ఒంటితో విద్యార్ధులు పడుకుంటారని కాగ్, లోకాయుక్త సంస్ధలు తమ రిపోర్టులో పేర్కొన్నాయి. హైకోర్టు ఆరేళ్ళ క్రితమే హాస్టళ్ళ మీద దాఖలైన పిటిషన్‌ మీద విచారిస్తూ ‘ఈ పిల్లలు మనుషులు కాదా, పాలకులకు మానవత్వం లేదా?’ అని వాఖ్యానించింది. జ్ఞానం విషయం అలా ఉంచి, బడుగు పిల్లల పట్ల కనీసం కరుణ, మానవత్వం కూడా లేవని బాబు నిత్యం నిరూపించుకుంటున్నారు. ఏపీ రాష్ట్రంలో శిశువులను కనలేక తల్లులు, తల్లి ప్రసవంలోనే పిల్లలు వేలాది మంది చనిపోతున్నారు. వీరందరూ బడుగు జీవుల పిల్లలే కదా! కొందరు మరింత కోటీశ్వరులు కొందరు మరింత పేదలు అవ్వడానికి బాబు కారణం కాదా? పసుపు కుంకుమల పేరుతో డ్వాక్రా మహిళలకు 10 వేల ఫండ్‌ ఇస్తానంటున్నారు కానీ దాని కంటే మద్యపాన నిషేధం చేస్తే కుటుంబం, ఊళ్ళు బాగుపడతాయి కదా! తాను ఎన్నికల్లో గెలవడం కోసమే బెల్టు షాపులను ఉధృతంగా పెంచుతున్నారు. ఈ ఒక్క సంవత్సరంలో ఆరు లక్షల మంది అమ్మాయిలు లేత వయస్సులో భర్తలేని వారు కావడానికి బాబు మద్యవిధానం కారణం కాదా!  

అంబేడ్కర్‌ పాలకునికి సామాజిక న్యాయ దృష్టి ఉండాలని చెప్పాడు. రాజ్యాంగం బడుగుల విద్యా వ్యవస్ధకు పటిష్టమైన పునాదులు ఏర్పరచింది. సంక్షేమ రాజ్యం అంటే విద్యా, వైద్య రంగాల్ని నిరంతరం ప్రజ్వలింప జేయడం. కానీ లక్షల మంది బడుగు పిల్లల శరీర శక్తిని, మానసిక శక్తిని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు రాజ్యాంగ లక్ష్యాలనే నిరాకరిస్తున్నారు. పైకి ఎన్ని మాటలు చెప్పినా బడుగు జీవుల సంక్షేమాన్ని తెలుగు నేలను పాలిస్తున్న పాలకులు తూట్లు పొడుస్తున్నారు. ఓటు పునాదిగా ఉన్న రాజకీయాలు, ఓట్లు లేనివారి జీవన విధ్వంసానికి పూనుకుంటున్నాయనే చారిత్రక సత్యాన్ని గమనించి నూతన సామాజిక విప్లవానికి అందరు సన్నద్ధం కావాల్సిన సమయం ఇది. చరిత్ర నియంతలను కూలుస్తుంది. ప్రజాస్వామ్య వాదులకు పట్టం గడుతుంది. అసలైన వ్యక్తిత్వ నిర్మాణానికి రాజ్యాంగమే గీటురాయి.


వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు‘ 98497 41695
డా‘‘ కత్తి పద్మారావు
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top