‘అభినవ’ పురాణాలు

Gollapudi Guest Column On BJP Leaders Controversial Issues - Sakshi

జీవన కాలమ్‌

బీజేపీతో ఏకీభవించని వారితో నేను ఏకీభవించను. కారణం– మన భారతీయ సంప్రదాయానికీ ఆధునిక జీవనానికీ నిచ్చెనలు వేస్తున్న ఒకే ఒక పార్టీ బీజేపీగా నేను భావిస్తాను. ‘మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్‌!’ అని గిరీశం తొందరపడి తీర్పునిచ్చాడు కానీ అతను కాని బీజేపీలో ఉంటే తన మనస్సు మార్చుకునేవా డని నా గట్టి నమ్మకం.

ఇందుకు గట్టి ఉదాహరణ నాకు ఇటీవలే ఉత్త రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ మాటల్లో దొరి కింది. ఆయన లాకాయి లూకాయి మంత్రి కాడు. ఉప ముఖ్యమంత్రి. ఆయన అన్నారు కదా మన జర్న లిజం పురాణ కాలం నుంచే ప్రారంభమైందని నొక్కి వక్కాణించారు. అంతేకాదు, ఇందుకు బలమైన ఉదా హరణలు ఇచ్చారు.

మొదటి ఉదాహరణ: మన భగవద్గీత. ధృతరా ష్ట్రుడితో ఎలా చెప్పాడయ్యా సంజయుడు? చూసింది చూసినట్టు ఒక్క అక్షరం పొల్లు పోకుండా 700 శ్లోకా లను వినిపించాడు. మహా భారత యుద్ధం పంచ రంగులతో ఆయన దివ్య దృష్టికీ కనిపించడానికీ ఈనాటి మన ఐపాడ్‌లకీ చాలా దగ్గర సంబంధం ఉన్నదని సంజయుని కథనిబట్టి మనం అర్థం చేసు కోవాలి. అలాగే పురాణాల్లో అనాదిగా వస్తున్న పాత్ర– నారదుడు. ఆయన ఎక్కడ పడితే అక్కడికి– ఆయా కారణాలకి చటుక్కున వెళ్లే టెక్నిక్‌కీ నేటి ‘గూగుల్‌’కీ పోలికలు లేవా? అని ఆయన బహిరంగ సభలో ప్రశ్నించారు. ‘మీ దిక్కుమాలిన గూగుల్‌ ఇవాళ ప్రారంభమైంది. కానీ భారతదేశంలో గూగు ల్‌– పురాణకాలంలో–మహాభారతం రోజుల నాటికే ప్రారంభమైందని’ ఆయన బల్ల గుద్దారు.

మనం రెండుసార్లు ‘క్లిక్‌’ నొక్కితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి ఆయా సమా చారాల్ని తెలుసుకోవచ్చు. అది ఇవాళ్టి మాట. కానీ నారదుడు ‘నారాయణ, నారాయణ’ అని రెండుసార్లు అనడం ద్వారా– ఇటు ‘పారిజాతాపహరణా’న్ని, అటు ‘కృష్ణార్జున యుద్ధాన్ని’ నిర్వహిం చిన గొప్పతనాన్ని మరచిపోతున్నాం– అని వాక్రుచ్చారు.

అలాగే రామాయణంలో మహాసాధ్వి సీత ‘టెస్ట్‌ ట్యూబ్‌’ నుంచి పుట్టిందని సోదాహరణంగా వివరిం చారు. ఆ లెక్కన ద్రోణుడు యజ్ఞాలు చేసే దోనెలో అతని వీర్యం పడగా పుట్టాడని పురాణం. యజ్ఞాల వేళల్లో వీర్యానికి ఏం అగత్యమున్నదో మనకు తెలీదు, ఏమైనా మన పురాణాల నిండా అడ్డమైన వాళ్లూ అడ్డమైన పద్ధతుల్లో పుట్టారు. ఈ విధానాలకీ, ఆధునిక జీవన విధానానికీ ఒక సాపత్యాన్ని వెదికిన సెకండరీ, హయ్యర్, సైన్స్‌ సాంకేతిక శాఖల మంత్రి గారి ‘ఆలోచనా సరళి’ని కొట్టి పారేయడానికి వీలు లేదు. ఇవన్నీ చాలా గొప్ప పరిశీలనలుగా నేను భావి స్తున్నాను. ఈ లెక్కన స్టీవ్‌ జాబ్స్‌ ఏ శూద్రక మహర్షో, బిల్‌ గేట్స్‌ కిందటి జన్మలో ఏ శుక మహర్షో అయి ఉంటారని నాకు గట్టి నమ్మకం. లేకపోతే– ఇంతగా ప్రపంచాన్నంతటినీ ఆకర్షించగల ప్రయోగా లను చెయ్యలేరు.

నాకు మొదటినుంచీ శ్రీనాథుడిమీద ఈ నమ్మకం ఉండేది. నిజానికి ‘ఆధునిక కవులలో అద్భుతమైన పాత్రికేయుడు శ్రీనాథుడు’ అనే విషయం మీద పరిశోధన జరగాలని నా గట్టి నమ్మకం. ఆయన ‘కాశీఖండము’, ‘భీమ ఖండము’ వంటి మహా రచనలు చేస్తూనే– ఆంధ్ర దేశ మంతా తిరిగి– ఆయా ప్రాంత ఆహార విశేషాల గురించి చెప్పుకుపోయాడు. ఏమైనా కొన్ని తరాలు, శతాబ్దాలు, మళ్లీ మాట్లాడితే యుగాల కిందటి వాస్తవాలను మనకి పంచిన ఘనత బీజేపీది కాక ఇంకెవరికి ఉంటుంది? అని నాకు గర్వపడాలనిపిస్తుంది.

మరి మన మహా భారతంలో విమానాలు న్నాయి. వాటిని మన ‘ఎయిర్‌ ఇండియా’ విమానా లతో పోల్చవచ్చునేమో. కాలదోషం పట్టి వాటిని ప్రస్తుతం ఎవరూ కొనుగోలు చెయ్యడం లేదు. అలాగే హఠాత్తుగా ఆడవారుగా మారిపోయిన మగ వారూ, మగవారిగా మారిపోయిన ఆడవారూ, నపుంసకులూ ఉన్నారు. మన కాలంలో వారు ఎవరో పోల్చవలసిన అవసరం బీజేపీ నాయకులకి ఉంది.

ఏమైనా డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని కాల దన్నేలాగ– మన సంస్కృతికీ, పౌరాణిక సంస్కృతికీ నిచ్చెనలు వేయగలిగిన ఆలోచనా పటిమ, స్వదేశీ అభిమానం ఉన్న పార్టీగా నేను బీజేపీని గుర్తిస్తు న్నాను. రాబోయే ఎన్నికలలో తప్పనిసరిగా నా ఓటు బీజేపీకి వెయ్యబోతున్నానని ఇప్పుడే హామీని ఇస్తు న్నాను.

వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top