పరిణామమే ప్రథమ శత్రువు

first enemy - Sakshi

ఆయన ప్రపంచ విజ్ఞానశాస్త్రాన్ని ప్రభావితం చేసి, మానవ వికాస చరిత్ర పుట్టుపూర్వోత్తరాలను వెల్లడించిన డార్విన్‌ రచనను స్వయంగా అధ్యయనం చేయలేదనీ, వినికిడి మీదనే పరిణామవాదాన్ని ద్వేషించిన ఫలితంగానే డార్విన్‌ సిద్ధాంతాన్ని ఆడిపోసుకుంటున్నారనీ భావించక తప్పదు. మానవ ఆవిర్భావం, వికాసం, ప్రకృతికీ ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు శాస్త్రీయ, అశాస్త్రీయ ధోరణులకూ, దృక్పథాలకూ కారణాలను తవ్వితే పరివార్‌ ప్రగతి నిరోధక మూఢ విశ్వాసాల వ్యాప్తికి గండి పడుతుందని భయం.

చదవేస్తే ఉన్న మతి పోయిందట. సాటి కవి ఒకరు కుకవితను కవితగా చలామణీ చేయబోతే తెనాలి రామలింగడు అది వినలేకపోయాడని జన బాహుళ్యంలో ఓ కథ ఉంది. ఆ కుకవితని తట్టుకోలేక, ‘ఉమ్మెత్త కాయలు తిని చెప్పావా?’ అంటూ ఎత్తిపొడిచాడట. చార్లెస్‌ డార్విన్‌ పరిణామ సిద్ధాంతం గురించి కేంద్రంలోని బీజేపీ– పరివార్‌ సర్కార్‌లో మానవ వికాస మంత్రిత్వ శాఖ అమాత్యులు సత్యపాల్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యానాలు ప్రజలకు కర్ణకఠోరంగానే భాసించాయి. మన పాఠశాలలు, కళాశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాల నుంచి డార్విన్‌ సిద్ధాంతాన్ని తొలగించివేయాలని ఆయన (20–1–2018)ఒక సరికొత్త ప్రతిపాదనను ముందుకు నెట్టారు. 

ఆధారం ఎక్కడిది అమాత్యా?
శాస్త్ర పరీక్షకీ, కాల పరీక్షకీ నిలిచిన ఆ సిద్ధాంతాన్ని పాఠ్యాంశంగా ఎందుకు తొలగించాలి? అది నిరూపితం కాకుండానే ‘అది శాస్త్రీయంగా తప్పుడు సిద్ధాంతం’ అని ప్రకటించారు. విద్యాధికుడు కూడా అయిన ఆ అమాత్యుడు ‘వానరం (కోతి) మనిషిగా పరిణమించినట్టు మన పూర్వీకులు చెప్పలేదు’, కాబట్టి డార్విన్‌ పరిణామవాదం చెల్లదని డబాయించేందుకు యత్నించారు. అయితే ఏ ‘శాస్త్రీయ’ నిరూపణ ద్వారా (పూర్వీకులు అన్న పదం మినహా యించి) డార్విన్‌ సిద్ధాంతాన్ని తాను తోసిపుచ్చడానికి సాహసించారో కూడా ఆ అమాత్యుడు వెల్లడించలేదు. ‘భూమ్మీద కనిపించిన మనిషి యథాతథంగానే ఉండిపోయాడు గానీ వేరే పరిణామం ఎక్కడిది?’ అంటూ తన పేరులోని ‘సత్య’రూపాన్ని సైతం విస్మరించి ఆ అమాత్యుడు వైదిక పురాణ ప్రేలాపనలో మునిగిపోయారు. 

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, భౌతిక, రసాయన శాస్త్రవేత్తలు, ఉద్దండ పరిశోధకులు గుర్తించిన డార్విన్‌ పరిణామవాదాన్ని నిరాకరించడం ఓ వికృత సాహసం. విద్యాధికులంతా భౌతికవాదులు కానక్కరలేదు. నైతిక వాదులుగా ఉంటూ కనీసం వివేకానందస్వామి వంటి ఆచరణాత్మక వేదాంత ప్రవచకులుగా ఉన్నా కొంత నయమే. కార్యకారణ సంబంధి అయిన హేతువుకు నిలబడలేని వాదనలకు అలవాటు పడినవారంతా నాస్తికులుగా మారడం శ్రేయస్కరమన్న మహనీయుడు వివేకానందుడు. ఇప్పటి విద్యాధికులైన కొందరు ఐపీఎస్‌/ఐఏఎస్‌ అధికారులు కూడా పేరుకు ఆధ్యాత్మిక విలువల చాటున అన్ని రకాల భౌతిక సుఖాలను దండిగా అనుభవిస్తున్నవారే. మన కథానాయకుడు సత్యపాల్‌ కూడా ఈ కోవకు చెందినవారే అయి ఉండాలి. బహుశా అందుకే ఔరంగాబాద్‌ (మహారాష్ట్ర)లో ప్రారంభమైన వైదిక సమ్మేళనానికి హాజరై ఉంటారు.

‘మన పూర్వీకులు సహా ఎవరూ లిఖిత పూర్వకంగా గానీ వాచా గానీ వానరం మానవుడిగా పరిణమించినట్టు చెప్పలేదు’ అని ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంత్రి అన్నారు. ఈ పరిణామం గురించి మన తాతముత్తాతలు ఏ గ్రంథంలోనూ వివరించలేదని సత్యపాల్‌ వాదన. దీనిని బట్టి అర్థం చేసుకోవలసినది ఒకటి ఉంది. సత్యపాల్‌ విద్యాధికుడు, రసాయనిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా సాధించుకున్నారు. ఉద్యోగావకాశాలు దండిగా వినియోగించుకున్నారు.

అయినా కూడా ఆయన ప్రపంచ విజ్ఞానశాస్త్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి, మానవ వికాస చరిత్ర పుట్టుపూర్వోత్తరాలను వెల్లడించిన డార్విన్‌ రచనను స్వయంగా అధ్యయనం చేయలేదనీ, వినికిడి మీదనే పరిణామవాదాన్ని ద్వేషించిన ఫలితంగానే డార్విన్‌ సిద్ధాం తాన్ని ఆడిపోసుకుంటున్నారనీ భావించక తప్పదు. కారణం–మానవ ఆవి ర్భావం, వికాసం, ప్రకృతికీ ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు శాస్త్రీయ, అశాస్త్రీయ ధోరణులకూ, దృక్పథాలకూ కారణాలను తవ్వి తీస్తే పరివార్‌ వర్గీయుల ప్రగతి నిరోధక మూఢ విశ్వాసాల వ్యాప్తికి గండి పడుతుందని భయం.

మేధో వికాసమంటే భయం
నేడు మన అనుభవంలోకి వస్తున్న ప్రతి నూతన భౌతిక ఆవిష్కరణలు రోజు కొక తీరున కనువిందు చేస్తున్నాయి. నిజానికి అవన్నీ మానవ పరిణామ వాద ఫలితాలే. కానీ ఈ సత్యాన్ని గ్రహించలేకపోవడం ఎందుకంటే అంధ విశ్వాసాల ఫలితమే. మానవుడు సాధిస్తున్న విజ్ఞాన శాస్త్ర విజృంభణను అనుభవిస్తూ కూడా గుర్తించడానికి ‘సిగ్గు’పడిపోవడం కూడా. జీవశాస్త్ర సంబంధమైన ఒక పరిణామవాదాన్ని కనుగొని నిరూపించిన డార్విన్‌ మహాశయుడిని కీర్తిస్తూ కారల్‌మార్క్స్‌ ఇలా అన్నారు: ‘అంతవరకూ ప్రకృతి గురించిన అశాస్త్రీయ అవగాహననే డార్విన్‌ మార్చి జీవశాస్త్ర రహస్యాలెన్నింటినో ఆవిష్కరించాడు.

పరిణామవాదానికి ఆయన శాస్త్రీయ పునాదులు వేసి బలవర్ధకం చేసిన తరువాతనే ప్రపంచం నలుమూలలా విజ్ఞాన శాస్త్ర అవగాహన రెక్కలు విప్పుకుంది, మానవాళి మనోనేత్రాలు వికసించాయి. మానవ సేంద్రియ, నిస్సేంద్రియ ప్రకృతి మధ్య అంతరాన్ని ప్రయోగాలతో నిరూపించడం జరి గింది’ అని చెప్పారు. జీవశాస్త్ర పరిణామవాదంలో అసలు రహస్యాన్ని మార్క్స్‌ ఇంకా ఇలా వివరించాడు: ‘మొత్తం మానవాళి సంపదకంతకూ మూలం శ్రమశక్తి. మానవుడిని సృష్టించి తీర్చిదిద్దిన శక్తి. డార్విన్‌ సరిగ్గా ఈ మన పూర్వీకుల గురించిన పరిణామాన్ని వర్ణించాడు. మానవుడి వికాసానికి సంబంధించిన ఈ అన్యోన్య సూత్రం (‘కొరిలేషన్‌ ఆఫ్‌ గ్రోత్‌’) ద్వారానే మానవ శరీరం ప్రయోజనం పొంది పరంపరాభివృద్ధి చెందింది’ అన్నాడు.

మన గతితార్కిక పునాదులన్నీ ఈ ప్రకృతిలోనే పొదిగి ఉన్నాయనీ, తాను బతికి బట్టకట్టడానికి మానవుడు ఎంత ఘర్షణపడతాడో ఆ ఘర్షణాత్మక పోరాటమే డార్విన్‌ పోరాటమనీ, ఇది ప్రకృతి నుంచి మానవ సమాజానికి సహజంగానే బదిలీ అయిన పోరాటమనీ మార్క్స్‌ అభివర్ణించాడు. డార్విన్‌ పరిణామవాద సిద్ధాంతంలో అంతర్లీనంగా ఉన్న ఈ ఘర్షణ స్వభావంతోనే, కొన్ని మత శక్తులూ, కులీన వర్గాలూ, సంపన్నులూ; వీరికి వత్తాసుగా మెట్ట సిద్ధాం తాలు వల్లించే రాజకీయ శక్తులూ ప్రపంచవ్యాపితంగా చాలాకాలంగా డార్విన్‌ ‘పరిణామవాదాన్ని’(థియరీ ఆఫ్‌ ఇవల్యూషన్‌) వ్యతిరేకిస్తూ వక్రభాష్యాలు వల్లిస్తున్నారు. 
ఆ క్రమంలోనే మన ‘పరివార్‌’ సిద్ధాంతి సత్యపాల్‌ కూడా కొత్త సీసాలో పాత సారా నింపి ప్రచారంలోకి దిగారు. అందుకే శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, విద్వత్‌ సంస్థలూ మంత్రి ప్రకటనను ఖండించాల్సి వచ్చింది.

మానవుడు ప్రకృతి అంగ సౌష్ఠవంలో ఒక భాగమేనన్నాడు డార్విన్‌. అందుకే, ఈ పరిణామక్రమంలోనే ముందు తొలి మానవుడు (హోమో ఎరిక్టస్‌) అనీ, ఆధునిక మానవుడిని ‘హోమో సెపైన్‌’ అనీ, తిరిగి సృష్టికర్తగా మారిన ఆ మానవుడిని ఆలోచనాపరుడిగానూ (హోమో షేబర్‌) శాస్త్రవేత్తలు నామకరణం చేయవలసి వచ్చింది. పరిణామక్రమం స్వాభావికమైన (నేచురల్‌ సెలెక్షన్‌) అన్నాడు డార్విన్‌. ఈ మాట విన్నప్పుడు ‘ఋగ్వేదం’లో ‘నాసదీయ సూక్తం’లో ఆణిముత్యం లాంటి వాదన వినిపించింది: ‘మనిషిని సృష్టించింది దేవుడ’ని ఒకరంటే, సూక్తికారుడు ‘మరి ఆ దేవుడిని సృష్టించిందెవర’ని ఎదురు ప్రశ్నిస్తే సమాధానం కరువై వాదకుడి నోరు మూసుకుపోయింది. ప్రాచీనమైనదంతా మేలైన సరుకని మోసపోరాదని కాళిదాసు మహాకవి (‘పురాణమిత్యేవ న సాధు సర్వమే’) చెప్పాడు.

వికటకవి ప్రశ్నలు అనంతం
అలాంటి మేలిమి సరుకును మైథిలీ సాహిత్యంలో ఉద్దండ పిండమూ, సర్వోన్నతమూర్తిగా పేరుపొందిన ఆచార్య హరిమోహన్‌ ఝా ‘పురాణ ప్రలాపం’ పేరిట ఒక ‘వికటకవి’ పాత్రతో ఛాందస సంప్రదాయాలను, విశ్వాసాలను వ్యంగ్య వినోద ప్రసంగంతో ప్రశ్నింపచేశారు. రామాయణం, భారతం, భగవద్గీత, జ్యోతిషం, ప్రాచీన, వైదిక సాహిత్య ఆధారాల ద్వారానే తూర్పారబడుతూ ‘వికటకవి’ చెప్పిన మాటలు వినండి: ‘మన ప్రాచీన శాస్త్ర వచనాలు ఎక్కడినుంచి ఊడిపడ్డాయ’న్న ప్రశ్నకు సమాధానం: ‘ఈ శ్రుతులు, స్మృతులు ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఏది వినడం జరిగిందో అది ‘శ్రుతి’, ఏది జ్ఞాపకం ఉండిపోయిందో అది ‘స్మృతి’ అయింది. ఏ మాట ఎప్పుడు ఏ ఉద్దేశంతో ఎవడు చెప్పడం జరిగిందో, దాని సందర్భం ఏమిటో ప్రజలు మర్చిపోయారు.

ఆ మాటల్ని మాత్రం కళ్లు మూసేసుకుని తలపైన పెట్టుకుని మోసుకొస్తున్నాం’. అలాగే ‘ప్రాచీనులు చెప్పారని మోసుకొచ్చే ‘శాస్త్ర వచనాల’కు ఏమైనా వైజ్ఞానికమైన ఆధారం, పాడూ ఉండేదా’ అన్న ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పించాల్సి వచ్చింది: ‘వైజ్ఞానిక ఆధారం లేకపోయినా వాటికి మనో వైజ్ఞానిక ఆధారం మాత్రం ఉంది. ఎవరో బ్రాహ్మడు నదిలో స్నానం చేసేట ప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటాడు. అప్పుడాయన బొడ్డు (నాభి)కి మించి లోతు ఉన్న నీళ్లలో నిలబడి స్నానం చేయకూడదని నిశ్చయించుకున్నాడు. ఇంకేముంది నియమం పెట్టేశాడు: సరిగ్గా నాభివరకు ఉన్న నీళ్లలోనే స్నానం చేయాలి. నీళ్లు అంతకు ఎక్కువ ఉంటే నీ ఆయువు నశిస్తుంది, తక్కువ ఉంటే నీ తపస్సు నశించిపోతుంది’అని. మరొకాయన మీకు ‘జ్యోతి షంమీద నమ్మకం ఉందా’ అని ప్రశ్నిస్తే ‘వికటకవి’ పండితుడు ఇచ్చిన సమాధానం: ‘ఈ జ్యోతిషమే గనక నిజమైతే, నేను ఇప్పటికి 2,500 సార్లు చచ్చిపోయి ఉందును’ అని.

అంతేగాదు, ‘మన ప్రాచీన పండితమ్మన్యులు రాజభోగాలకు అలవాటుపడి ప్రజలను తమ అధీనంలో ఉంచుకునేందుకు కొన్ని బంధనాలు సృష్టిం చారు. పశువుల కాళ్లు కట్టేస్తారు చూశావా! అలాగ. ప్రతి విషయంలో ప్రభుత్వాలు విధించలేని నిబంధనలు విధించారు. ప్రభుత్వమైనా ఆదివారం సెలవిస్తుందేమో కానీ, మన శాస్త్రకారులు ఆ రోజు విషయంలో ముగుతాడు మరిం తగా బిగించేశారు. ధర్మశాస్త్రంలో వారికి ఏదైనా కొరత కనిపించిందా, దాన్ని కాస్తా జ్యోతిషంతో పూర్తి చేశారు. మనువు, యాజ్ఞవల్క్యుడు ధర్మమనే బేడీలు ప్రజల చేతులకు బిగించారు.

భృగువు, పరాశర మునులు, మహర్షులు కాళ్లకు కాలపు సంకెళ్లు తగిలించారు. ఈ దేశంలో బంధనాలకు ముఖ్య కారణం– ‘శ్రుతులు, స్మృతులు, జ్యోతిషం, పురాణాలు’ అని ‘వికటకవి’ ద్వారా హరి మోహన్‌ తేల్చిపారేశాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి కనిపించని దేవుడికి మొక్కుకునేకన్నా కార్యకారణ సంబంధాన్ని వడపోసి వెన్నముద్దను చేతిలో పెట్టే హేతువాదాన్ని ఆశ్రయించమన్నాడు గణిత శాస్త్రవేత్త యూక్లిడ్‌ (క్రీ.పూ. 300). మన ఆర్యభట్టను, భాస్కరాచార్యను వెనక్కి నెట్టేసి, మన గణిత శాస్త్రాన్ని గ్రీకులకు అప్పగించి, పనికిమాలిన గ్రీకుల జ్యోతిష శాస్త్రాన్ని మాత్రం మనం దిగుమతి చేసుకున్నామని వివేకానందుడన్నమాట అక్షర సత్యం.

ఏబీకే ప్రసాద్‌ 

సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top