మందులు దొరక్క ఎన్‌ఆర్‌ఐల ఇక్కట్లు

Chennuri Venkata Subbarao Article On NRI Problems - Sakshi

సందర్భం

అమెరికాలో ఎన్నారైలు ఎప్పుడూ ఎదురుచూడని సంక్లిష్ట స్థితిని నేడు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న ఎన్నారైలు ఎక్కువమంది 35–45 ఏళ్ల వయస్సులోని వారే. దాంతో వారు తమకు  తోడుగా తల్లిదండ్రులను, అత్తమామలను అమెరికాకు పిలిపించుకోవడం మామూలే. విజిటర్స్‌ వీసా మీద వారు వచ్చి ఆరునెలలు తమ పిల్లలకు సహాయంగా ఉంటూ ఇండియాకు వెళుతుంటారు. తాము ఉండే కాలానికి తగ్గట్టుగా  షుగర్, బీపీ, ఇతర మందులను వారు భారత్‌ నుంచి తమతో తెచ్చుకుంటారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్‌ అమెరికాను అష్టదిగ్బంధనం చేయడంతో వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. లాక్‌డౌన్‌తో వారు ఇండియాకు వెళ్ళలేని పరిస్థితి. అమెరికాలో ఉందామంటే తెచ్చుకున్న మందులు అయిపోయి మందులకోసం వారు పడుతున్న కష్టాలు చెప్పనలవి కావు. టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్‌ డీసీ తది తర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో తెలుగువాళ్ళు ఉన్నారు. తాము ఉండాల్సిన కాలానికి తెచ్చుకున్న బీపీ, షుగర్, ఇతర మందులు అయిపోవడంతో ఆ మందులకోసం వారు పడరాని కష్టాలు పడుతున్నారు. మామూలు సమయాల్లో ఇలాంటివారు ఇండియా నుంచి వచ్చేవారితో, లేదా తెలిసినవారి ద్వారా ఇండియానుంచి మందులను తెప్పించుకుంటారు.

కానీ, లాక్‌డౌన్‌ వేళలో ఇండియా నుంచి మందులు వచ్చే పరిస్థితి లేదు. అమెరికాలోనే మందులు కొందామంటే తమ వల్ల కావడం లేదని పలువురు తల్లిదండ్రులు, అత్తమామలు వాపోతున్నారు. ఎందుకంటే భారతదేశంలో లాగా వీధి చివర ఉన్న మందుల షాపుకు వెళ్ళి తీసుకుని వచ్చేంత ఈజీగా అమెరికాలో కుదరదు. దానికి చాలా ప్రొసీజర్‌ ఉంటుంది. పేషెంట్‌కు మందులు ఇవ్వాలని డాక్టర్‌ ఇచ్చే ప్రిస్కిప్షన్‌తోపాటు, వాళ్ళు ఎంౖMð్వరీలు చేసిన తరువాతనే మందులను ఇస్తారు. ఎవరైనా ఫార్మసీ షాప్‌కు వెళ్ళి తమ డాక్టర్‌ ఇచ్చిన చీటి చూపగానే వాళ్ళు డాక్టర్‌ ఎవరో నిర్దారిం చుకుని ఎన్పీఐ (నేషనల్‌ ప్రొవైడర్‌ ఐడెంటిఫికేషన్‌) నెంబర్‌ అడుగుతారు. అలాగే డీఈఏ (డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ) నెంబర్‌ అడుగుతారు. ఇప్పుడు తెలుగువారికి సహాయం చేయడంకోసం ముందుకు వచ్చిన డాక్టర్లు కూడా ఒక్కో ఫార్మసిస్ట్‌తో మాట్లాడి, ఒక్కో కేసు విశదీకరించేందుకు సమయం చాలడం లేదు. దానికితోడు ఆ ఫార్మసిస్ట్‌ను ఒక్కో కేసుకు సంబంధించి కన్విన్స్‌ చేయడం కుదరడం లేదు. 

ఈ విషయంపై శాండియాగోలో వున్న హైదరాబాద్‌ వాస్తవ్యులు పాలకోడేటి ప్రభాకర్, ఉష దంపతులు మాట్లాడుతూ తాముతమ కుమార్తె స్వాతి దగ్గరకు వచ్చామని, తిరుగు ప్రయాణం అనుకున్నట్టుగా ఏప్రిల్‌ నెలలో వెళ్ళలేమని, తమ మందులు అయిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డల్లాస్‌లో తెలుగు వారికి సుపరిచితులైన డాక్టర్‌ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ మాట్లాడుతూ వ్యక్తిగతంగా చాలా ఏళ్లుగా తనకు తెలిసిన తెలుగువారి తల్లిదండ్రుల మెడికల్‌ అవసరాలకు సహాయపడుతూ ఉంటానని, ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ సమస్య పెద్దది అయ్యిందని, ప్రతి పట్టణంలో తనలాంటి డాక్టర్లు కలిసి కొంతవరకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఫిలడెల్ఫియాలో నివసిస్తున్న నాగరాజు నలజుల మాట్లాడుతూ చాలామంది తెలుగు వారు తమ ఇంటిలో వున్న పెద్దవారి మెడికల్‌ అవసరాలకు  సహాయం కోసం వస్తున్నారని, మా పట్టణంలోనే వున్న డాక్టర్‌ ప్రమీల నాయుడుగారు వారికి సలహాలు ఇస్తున్నారని, ఆవసరం అయితే పేషెంట్‌గా గుర్తించి వైద్య సదుపాయాలు కూడా చేస్తున్నారని తెలిపారు.

బే ఏరియాలో వున్న తానా ఉపకోశాధికారి వెంకట్‌ కోగంటి మాట్లాడుతూ అమెరికాలో వచ్చిన విజిటర్స్‌ తగిన ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ లేకుండా మెడికల్‌ సౌలభ్యం పొందటం కష్టమే కాకుండా చట్టరీత్యా తప్పు కూడా కనుక తెలుగువారు ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించుకోవాలి అన్నారు. ఆటా అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి మాట్లాడుతూ, ఒకట్రెండురోజుల్లో ఒక డాక్టర్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసి వారిని  ఈ–మెయిల్‌ ద్వారా సంప్రదించే ఏర్పాటు చేస్తామని,  అప్పుడు ఆ డాక్టర్లు కూడా వారి ఫ్రీ టైమ్‌లో వారికి వచ్చిన ఈ–మెయిల్‌ చూసి  ప్రిస్క్రిప్షన్‌లో ఉన్న మందులను గుర్తించి వారికి ఈ– మెయిల్‌ ద్వారా జవాబు ఇస్తారని చెప్పారు. అప్పుడు ఎవరికి వారు తమ దగ్గరలో ఉన్న ఫార్మసిస్ట్‌ దగ్గరకు వెళ్లి ఆ మందులు కొనుక్కొని వారి తల్లిదండ్రులు, అత్తమామలను వీలున్నంతవరకు అటెండ్‌ కావచ్చని పరమేష్‌ భీంరెడ్డి తెలిపారు.

చెన్నూరి వేంకట సుబ్బారావు
వ్యాసకర్త సంపాదకులు, తెలుగుటైమ్స్‌ పత్రిక, అమెరికా

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top