శూన్యం నుంచి శిఖరం దాకా

BJP Foundation Day Article By Ravula Sridhar Reddy - Sakshi

రెండు పార్లమెంట్‌ సీట్లతో 1984లో ప్రారంభమైన బీజేపీ ప్రయాణం నేడు 32 ఏళ్ల తరువాత, 282 సీట్ల అత్యధిక మెజారిటీతో అధికారాన్ని పొందిన తీరు, నిజం నెమ్మదిగానైనా గెలిచి తీరుతుందని చాటింది.

ఇంతింతై వటుడింతై అన్న రీతిలో జనసంఘ్‌గా స్థాపితమై, భారతీయ విలువలతో కూడిన ప్రజాస్వామ్య పరిరక్షణకు, భారత సమగ్రతకు అనునిత్యం శ్రమించి, నాటి పాలకులు విధించిన ఉక్కు సంకెళ్ళ నిర్బంధాన్ని ఛేదించేందుకు జనతా పార్టీతో మమేకమై, నమ్మిన సిద్ధాంత ఆచరణకు అధికార అందలాన్నికూడా అంచుకు నెట్టి భారత దేశ సమున్నత అభివృద్ధే లక్ష్యంగా, జాతీయవాద భావననే స్ఫూర్తిగా జనించిన ‘భారతీయ జనతా పార్టీ‘కి నేటికి 38 ఏళ్ళు. 

శ్యామాప్రసాదు ముఖర్జీ మనః ఫలకం  నుంచి మొలకెత్తిన ‘జనసంఘ్‌’ దీనదయాళుని మానస పుత్రికై పరిఢవిల్లి, వాజపేయి నాయకత్వాన ‘భారతీయ జనతా పార్టీ‘గా కమల వికాసమై వెలిగింది. అడ్వాణీ ర«థ చక్రాల సాక్షిగా, ఎందరో నాయకమ్మన్యుల శ్రమతో ఎదిగి, రాజ్‌నాథ్‌ సింగ్‌ సారథ్యాన కనీవినీ ఎరుగని రీతిలో అధికారాన్ని సాధించింది. నేడు అమిత్‌ షా ఆధ్వర్యాన పదికోట్ల మంది ప్రాథమిక సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది.

ఈ 38 వసంతాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో, సైద్ధాంతిక నిబద్ధతతో, దేశాభివృద్ధే లక్ష్యంగా, అధికారంలో ఉన్నా, లేకున్నా ఒక దృఢమైన ఒరవడితో కొనసాగుతున్న భిన్నమైన రాజకీయ పార్టీగా నేడు విశ్లేషకుల ప్రశంసలందుకుంటూ, 21 రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టి, దేశ ప్రగతికి నిరంతరం బీజేపీ కృషి చేస్తోంది. దేశంలోని మెజారిటీ పార్టీలు కుటుంబాల ఆధారంగానో, వ్యక్తులపేరు పైననో, ప్రాంతీయ భావోద్వేగాల పునాదులపైనో నడిస్తే, బీజేపీ మాత్రం భారతదేశమంతా ఒక్కటే, భిన్న జాతులు, వర్గాలు ఉన్నా భారత జాతి ఒక్కటే అని విశ్వసించి, సర్వ ధర్మ సమభావంతో కూడిన, శోషణ ముక్త సమరస భారతాన్ని నిర్మించడంకోసం అహరహం శ్రమిస్తోంది.

దీనదయాళ్‌ ప్రవచించిన ఏకాత్మత మానవ వాదం ప్రధాన సైద్ధాంతిక వనరుగా పయనించే బీజేపీ, సమాజంలో వ్యక్తి పాత్రను, తద్వారా భారతీయతతో కూడిన సమాజ అభివృద్ధి భావనను పెంపొందించింది. 1984లో రెండు పార్లమెంట్‌ సీట్లతో ప్రారంభమైన పార్టీ ప్రయాణం అంచెలంచెలుగా ప్రజామోదం చూరగొంటూ నేడు 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత, ఒకే పార్టీకి 282 సీట్ల అత్యధిక మెజారిటీతో అధికారాన్ని పొందిన తీరు, నిజం నెమ్మదిగానైనా గెలిచి తీరుతుందనే నానుడిని నిజం చేసింది. కుటుంబ పాలనా ప్రచార హోరులో, వ్యక్తి పూజ హద్దు మీరి, ‘వ్యక్తులే దేశం, దేశమే ఫలానా వ్యక్తి’ అన్నంత స్థాయిలో జరిగిన వికృత ప్రచార పోకడతో దేశం వెనుకబడినా, నిరంతర కృషితో ప్రజా సంక్షేమం, ప్రజా మనోభావనలకు అనుగుణంగా పోరాడిన బీజేపీని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. తన సైద్ధాంతిక, రాజకీయ పరి ణితితో, భారతీయీకరణతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అనుభవ నైవేద్యంగా సమర్పిస్తున్నది.

ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వ పగ్గాలు దూరమవుతున్నా, విపరీత ధోరణులకు పోని వాజ పేయి రాజనీతిజ్ఞత, ప్రజల మనోభావాల సాధనకు జీవితాన్నర్పించిన అడ్వాణీ లక్ష్య సాధన సమర్ధత, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసి, సర్వ భారతావని ఆమోదంతో ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్రుని పరిపాలన దక్షత, రాష్ట్రాల వారీగా అన్ని వర్గాల ఆశీర్వాదం అందుకుంటూ బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ కీయ పార్టీగా నిలబెట్టిన అమిత్‌ షా నాయకత్వ పటిమ, వీరిని అనుసరిస్తూ దేశ సంక్షేమం కోసం అనునిత్యం పరితపించే కార్యకర్తల బలంతో బీజేపీ భవిష్యత్తు మరింత బ్రహ్మాం డంగా  ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

2014లో బీజేపీపై ప్రజా విశ్వసనీయతే బలంగా, అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన పగ్గాలు చేపట్టిన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, సుస్థిరమైన, సమర్థమైన, అవినీతిరహిత, క్రియాశీల ప్రభుత్వాన్ని నడపడంలో విజయవంతమైంది. అంతర్జాతీయంగా  ప్రశంసలందుకుంటోంది. ఎన్నో ప్రభుత్వ ప«థకాలు, జనధన్, ముద్ర, స్టాండ్‌ అప్, ఉజ్వల యోజన తదితరాలన్నీ పార్టీ  సైద్ధాంతిక పునాదుల ఆధారంగా నిర్మితమైనవే.
అఖండ భారతావని సర్వతోముఖాభివృద్ధికి ఈ వ్యవస్థాపక దినోత్సవం నాడు యావత్‌ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పునరంకితమవుతారని ఉద్ఘాటిస్తూ.. భారత్‌ మాతాకీ జై.
(నేడు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం)


రావుల శ్రీధర్‌ రెడ్డి, వ్యాసకర్త రాష్ట్ర అధికార ప్రతినిధి

బీజేపీ, తెలంగాణ ‘ మొబైల్‌ : 99855 75757

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top