శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?

Article On Saradha Chit Fund Scam - Sakshi

విశ్లేషణ

అవినీతికి వ్యతిరేకమని చెప్పుకునే అధికార పార్టీ బీజేపీ శారదా మోసాల్లో తన పాత్రకు జవాబు చెప్పుకోవలసిన స్థితి ఏర్పడింది.  శారదా గ్రూప్‌ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడ్డాయి. రెండు, మూడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు సేకరించి ఈ గ్రూప్‌ జనాన్ని ముంచింది. 1920 కాలంలో చార్లెస్‌ పొంజీ అనే అతి తెలివైన మోసగాడు పెట్టుబడులు ఆకర్షించడానికి పెద్ద వడ్డీ ఆశ చూపడం, వచ్చిన డబ్బుతో పాత డిపాజిటర్లకు లాభాలు చూపి, కొత్త డిపాజిటర్లలో ఆశలు రేపడం, లాభాలు వస్తాయని నమ్మించడం, ఇంకా డిపాజిట్లు వసూలుచేసి చేతులు ఎత్తేసే మోసాలకు పాల్పడ టంతో వీటిని పొంజీ స్కీం అని పిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ మోసం బయటపడగానే తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ కమిషన్‌ వేసింది. ఇదొక భీకర ఆర్థిక లావాదేవీల గందర గోళం. ఇందులో దర్యాప్తు చేయవలసింది కేవలం పోలీసు మాత్రమే కాదు, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సెబీ, ఆర్‌బీఐ వంటి కేంద్ర సంస్థలు కూడా.
 
ఆర్థిక సేవలను, మౌలిక వనరుల యాజమాన్యం, ఆటోమొబైల్‌ రంగం, ఉత్పత్తి రంగాలలో సేవలందిస్తామని చెప్పుకుంటూ శారదా గ్రూప్‌ డిపాజిట్ల వసూలు కార్యక్రమం మొదలుపెట్టింది. సుదీప్తోసేన్‌ ఈ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టరూ చైర్మన్‌ కూడా. సేన్‌తోపాటు మరో నిందితుడు దేబ్జానీ ముఖర్జీ పారిపోయారు. రాజీవ్‌ కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటయిన ప్రత్యేక పరిశోధక బృందం వీరిద్దరినీ పట్టివేసింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కునాల్‌ ఘోష్‌ను కూడా సిట్‌ అరెస్టు చేసింది. 2014లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖులు, మమతా బెనర్జీ సన్నిహితులైన మదన్‌ మిత్రా, రజత్‌ మజుందార్‌లను సిట్‌ అరెస్టు చేసింది. అధికార పార్టీఎమ్మెల్యేను అరెస్టు చేసి సిట్‌ నిష్పాక్షికతను చాటింది.  

ఈ మోసం అస్సాం, త్రిపుర ఒడిశా రాష్ట్రాల ప్రజలను కూడా ముంచేసిన విషయం 2014లో సుప్రీంకోర్టు పరిశీలించి శారదా ఆర్థిక కుంభకోణాన్ని సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. రాజీవ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగిస్తున్న సిట్‌ను మొత్తం పత్రాలు సీబీఐకి అప్పగించాలని ఆదేశించారు. వారు అప్పగించారు కూడా.
 
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని, ఆరోపిస్తూ శారదా గ్రూప్‌ సొంతదారులు టీ ఎంసీ ఎంపీ కునాల్‌ ఘోష్‌ తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తే 2013లో ఆయన్ను అరెస్టు చేశారు.  కొన్ని గంటల్లోనే కునాల్‌ ఘోష్‌ ఈ కుంభకోణంలో ముకుల్‌ రాయ్‌తోసహా 12మంది ఉన్నారంటూ తీవ్ర ప్రత్యారోపణలు చేశారు. ముకుల్‌ రాయ్‌ ఇంటిపైన, ఆయన భార్య నడిపే న్యూస్‌ చానెల్‌పైన అప్పుడు సీబీఐ దాడులు జరిపింది. నవంబర్‌ 26, 2014న ఆయన్ను ప్రశ్నించింది. అరెస్టు కూడా చేసింది. అస్సాంలో తన వ్యాపారం సాగడానికి నెలకు 20 లక్షల రూపాయలను శారదా చైర్మన్‌ సుదీప్తోసేన్‌కు ఇచ్చినట్టు ముకుల్‌సేన్‌ మీద ఉన్న ఆరోపణ. అస్సాంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, మీడియా బారన్లు తమ నుంచి డబ్బు వసూళ్లు చేసేవారని ముకుల్‌ రాయ్‌ ప్రత్యారోపణ చేశారు. వసూళ్లు చేసిన వారి పేర్లు కూడా ఆయన ఉత్తరంలో సీబీఐకి వెల్లడించారు.  ముకుల్‌ రాయ్‌ తృణమూల్‌ వదిలి తమ పార్టీలో చేరాలని 2015 నుంచి బీజేపీ ముకుల్‌రాయ్‌తో సంప్రదింపులు మొదలు పెట్టింది. మమతా బెనర్జీకి ఆయన చాలా సన్నిహితుడు. ఆమె తరువాత స్థాయి నాయకుడని పేరు.  నవంబర్‌ 3, 2017న చివరకు ఆయన బీజేపీలో చేరవలసి వచ్చిందో చేర్పించుకున్నారో మనం ఊహించవచ్చు. సుదీప్తో సేన్‌ డ్రైవర్‌ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ముకుల్‌ రాయ్‌ చేసిన మహత్కార్యాలు ఎన్నో వెల్లడయ్యాయి. సుదీప్తోసేన్‌ కోల్‌కతా నుంచి పారిపోవడానికి ముకుల్‌ ఎంతో సాయం చేశారట. 

అస్సాం కాంగ్రెస్‌కు చెందిన మరో నాయకుడు  హిమంత బిస్వాశర్మ కూడా ఫిరాయించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరు బీజేపీలో చేరిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసును విచారించడంలో అంత ఆసక్తి ఉన్నట్టు కనిపించలేదు. కేసు మూలన పడింది.

హిమంత బిస్వాశర్మ బీజేపీలో చేరి శుద్ధి పొందినందునే చార్జిషీటులో నిందితుడు కాలేదని విమర్శిస్తే తప్పా? ప్రధాన నిందితుడైన సుదీప్తో సేన్‌ పారిపోవడానికి సహకరించిన ముకుల్‌ రాయ్‌ను సీబీఐ దర్యాప్తు జరుపుతున్న దశలో ఎందుకు చేర్చు కున్నట్టు? శారదా కుంభకోణానికి సహకరించినట్టు ఆరోపితులైన వారు బీజేపీలోచేరిన తరువాత సీబీఐ దర్యాప్తు ఎందుకు ఆలస్యమయింది? శారదా దర్యాప్తును ఆటంకపరిచింది తృణమూల్‌ ప్రభువులా, బీజేపీ చక్రవర్తులా?


మాడభూషి శ్రీధర్‌

వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top