‘విక్రమ్‌’ చాంద్రాయణం చిరంజీవం!

ABK Prasad Writes Guest Column On Chandrayaan 2 Mission - Sakshi

రెండో మాట

‘‘చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వేగాన్ని తట్టుకుని దాని ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్‌ ల్యాండర్‌ ఆ వేగాన్ని అధిగమించలేక అమిత బలంతో చంద్రతలాన్ని ఢీకొని ఉంటుంది. ఫలితంగా చంద్రయాన్‌–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్‌’తో సంబం ధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాం.’’
– ఇస్రో ఛైర్మన్‌ కైలాసవదివు శివన్‌

‘‘చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారిగా కాలూనడం కోసం భారత్‌ రోదసీ ప్రయోగ కేంద్రం చేసిన ప్రయోగం ప్రశంసనీయం. అంతరిక్ష ప్రయోగాలన్నవి చాలా సంక్లిష్టమైనవైనప్ప టికీ ‘ఇస్రో’ తాజా ప్రయోగం అద్భుతం. దీనితో భారత ఇంజనీరింగ్‌ వ్యవస్థ నైపుణ్యం, సామర్థ్యం ప్రపంచం మొత్తానికి వెల్లడయింది’’
– అమెరికా పత్రికలు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’, ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’

అనాదిగా చేతికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న జాబిల్లిని చేరడానికి, వీలైతే చేజిక్కించుకోవడానికి వేల సంవత్సరాలుగా మాన  వులు పడుతున్న తపనను, శాస్త్రవేత్తలు పడుతున్న తపనను, పోటా పోటీలను, అందుకు అంగలు పంగలుగా వేస్తున్న పరుగుల్ని చూస్తూ వచ్చాం. అందుకోసం తొక్కిన పుంతలు, ఆరాటపడిన పాలపుం తలూ ఎన్నెన్నో విన్నాం. ఆ చందమామ కోసం పాటలతో ఆరాటప డుతూ పాటలు అల్లుకున్నాం, దాన్ని దించి పిల్లల చేతిలో అల్లారు ముద్దుగా పెడదామని కలలు కన్నాం. దానిపేరిట పిల్లలకు ‘గోరు ముద్దలు’ తినిపించాం. గోగుపూలు తెచ్చిపెట్టమని ఆవాహనం చేశాం. 

చివరికి ఈ అన్వేషణ ఎందాకా వెళ్లిందంటే– పాలుపోక శశి చాటున ‘నిశి’లో ముసలమ్మ రాట్నం వడుకుతున్నట్టుగా ఓ పాలు పోని కథలల్లి భువిలోని పిల్లలకు.. మొన్న అర్ధ శతాబ్దం క్రితం నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్‌ తొలి మానవులుగా చంద్రునిపై చంద్రమం డలాధిపతులుగా కాలుమోపే వరకూ అశాస్త్రీయమైన కుంటి సాకులు కథలుగానే చెబుతూ వచ్చాం. ఈ సందర్భంగా, అతి సామాన్య పేద వ్యవసాయ కుటుంబం నుంచి భారత రోదసీ పరిశోధనా శాస్త్రవేత్తగా ‘ఇస్రో’ అధినేత స్థాయికి ఎదిగివచ్చిన ప్రొఫెసర్‌ శివన్‌ ఆధ్వర్యంలో మన శాస్త్రవేత్తలు చంద్రయాన్‌–2 రోదసీ యాత్ర ద్వారా దాని ఆర్బి టర్‌ జీవితాన్ని ఉద్దేశించిన కాల వ్యవధి కన్నా మించి 6–7 సంవ త్సరాలు మనగలిగేటట్టు రూపొందించడం భారత విజ్ఞాన శాస్త్రం, ఇంజనీరింగ్‌ వ్యవస్థ సాధించిన ఘన విజయం. 

ఇదే సమయంలో, దేశంలో ఎలాంటి పాలనా వ్యవస్థ మనుగడ సాగించుకుంటున్న సమయంలో ఈ విజయం సాధ్యమయింది? దేశ నవీన విశ్వ విద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో, విద్యా వ్యవస్థలో, శాస్త్ర సాంకేతిక కేంద్రాలలో పురాణ కవిత్వాలు విన్పించడానికి ప్రయ త్నాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో, శరవేగాన విస్తరి స్తున్న ప్రకృతి పరిణామవాద సిద్ధాంతాల్ని, అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం, ఖగోళ విజ్ఞాన శాస్త్రాన్ని రోదసీ పరిశోధనలో మానవుడు సాధిస్తున్న విజయ పరంపరను గేలి చేస్తున్న కొందరు మూఢులు పాలనా వ్యవస్థలో తిష్ట వేసి ఉన్నప్పుడు, పాలనా వ్యవస్థలో చరిత్ర గతిని, దేశ ప్రగతిని పక్కదారులు తొక్కించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నప్పుడు.. మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అమోఘ ప్రయోగ వైచిత్రిలో ముందుకు దూసుకుపోతున్నారు. 

ఈ పాలకుల్లో ఒకరు వేదాల పేరిట చార్లెస్‌ డార్విన్‌ పరిణామవాదాన్ని తిరస్కరిస్తాడు, మరొక పాలక మండలి సభ్యుడు స్టీఫెన్‌ హాకింగ్‌ ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని రూఢమైన ‘బ్లాక్‌హోల్స్‌ (నల్ల బిలాలు)’ సిద్ధాంత తారళ్యతనూ ప్రశ్నిస్తాడు. మరొక ముక్కలో చెప్పాలంటే చరిత్రను, చరిత్ర పాఠాల్ని న్యూనపరుస్తూ దేశ చరిత్రకు ‘సున్న’ చుట్టి మూఢ విశ్వాసాల వ్యాప్తికి పాఠ్య గ్రంథాల్లో పెద్దపీట వేయమంటాడు మరొక పాలకమండలి ‘విజ్ఞాని’! మరో పురాణ ‘విజ్ఞాని’ వినాయకుడికి ఏనాడో ‘ప్లాస్టిక్‌ సర్జరీ’ చేసినందున ఆ స్వరూపం వచ్చిందంటాడు. 
    
నిజానికి ఆరెస్సెస్‌–బీజేపీ ‘హిందూత్వ’ పాక్షిక మత రాజకీయాల ఫలితంగా పూర్వ వైదికంలోని మీమాంస పరిజ్ఞానం, ఉపనిషత్తులలోని ప్రశ్నోత్తర సంవాద సంప్రదాయాల ద్వారా అను  మాన నివృత్తి అవకాశాలు కూడా నేటి భారతంలో అడుగంటిపోయి, మూఢత్వం చాటలతో చెలుగుతూ స్వైర విహారం చేస్తోంది. మాన వుణ్ణి తొలిసారిగా చరిత్రలో చంద్రాధినేతగా నిలిపినవారు తొలి అమె రికన్‌ ఆస్ట్రోనాట్‌ నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ (1969 జూలై 20) కాగా, రోదసీలో కాలుమోపి, భూమిని చుట్టి జయించిన తొలి మానవుడు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ పౌరుడైన యూరీ గగారిన్‌ (1961 ఏప్రిల్‌), ఆ పిమ్మట మేడం వలెంటీనా, అంతకుముందు రోదసీలో వాతావ రణ పరిస్థితులు జీవరాశిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో పరీక్షిం చడానికి సోవియట్‌ ‘లైకా’ (కుక్క)తో జరిపిన సఫల ప్రయోగమూ! ఆ వరసనే రోదసీ గుహ్వరంలోని పలు రకాల పాలపుంతలకు (గెలా క్సీలు), గ్రహరాశులకు మానవులు యాత్రలు జరపడానికి రకరకాల ప్రయత్నాలలో ఉన్నారు.

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఎదురైన విచిత్ర అనుభవం!
తొలిసారి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై కాలూనడానికి బయలుదేరే ముందు భూమ్మీద జరిపిన శాస్త్ర ప్రయోగ, తర్ఫీదు విన్యాసాల సంద ర్భంగా ఒక విచిత్రానుభవం కల్గింది. అమెరికా పశ్చిమ ప్రాంతాల్లోని ఓ మారుమూల ఎడారి ప్రాంతంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌ అభ్యాస శిక్షణలో ఉన్నాడు. అతను శిక్షణ పొందుతున్న ప్రాంతం అనేకమంది అమెరి కన్‌ ఆదివాసీ (స్థానిక) తెగల నివాస కేంద్రం. ఆర్మ్‌స్ట్రాంగ్‌ బృందానికి వారికి మధ్య సాగిన సంభాషణ ఒక ఐతిహ్యంగానే చెప్పుకోవచ్చు. శిక్షణలో ఉన్న రోదసీ యాత్రికులైన ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్‌లను ఆ స్థానిక ఆదివాసీ అడిగాడు: 

‘ఇంతకూ మీరిక్కడ ఏం చేస్తున్నారు’ అని. అందుకు ఆర్మ్‌స్ట్రాంగ్‌ సమాధానమిస్తూ ‘త్వరలో చంద్రుడి ఉనికి తబిశీళ్లను కనుక్కోడానికి చేసే ప్రయత్నంలో శిక్షణ పొందు తున్నాం’ అన్నాడు. అందుకు నిర్ఘాంతపోయిన ఆదివాసీ ‘నాకో పని చేసి పెడతావా’ అని అడిగాడు. ‘మీకేం కావాలి?’ అని అడిగాడు ఆర్మ్‌ స్ట్రాంగ్‌. అందుకు ఆదివాసీ పెద్ద ‘ఆ చంద్రునిపైన కొన్ని పవిత్ర ఆత్మలు, శక్తులూ నివసిస్తుంటాయి. వాటికి మా ప్రజలిచ్చే ఓ ముఖ్య సందేశాన్ని మీరు అందజేస్తారా’ అని ప్రశ్నించాడు.

ఆస్ట్రోనాట్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌: చెప్పండి, ఆ సందేశం ఏమిటో అన్నాడు కానీ ఆదివాసీ పెద్ద మనిషి ఆదివాసీ తెగల భాషలో మాట్లాడుతూ ‘మీరు విన్నదేమిటో ఒకటికి రెండుసార్లు చెప్పండి’ అన్నాడు. ‘మాకర్థం కావడం లేదు. ఇంతకూ మీరు ఏం చెబుతున్నారు?’ అనడి గాడు ఆస్ట్రోనాట్‌. ఆదివాసీ పెద్ద ‘అదో రహస్యం, ఆ చంద్రుడిలో దాగిన ఆ శక్తులు, ఆత్మలకు మాత్రమే మా భాష అర్థమవుతుంది’ అన్నాడు. దాంతో తికమకైపోయిన ఆస్ట్రోనాట్స్‌ తిరిగి తమ స్థానిక క్యాంపుకు వెళ్లిపోయి, ఆదివాసీ తెగల భాషలో మాట్లాడగల వ్యక్తి కోసం గాలించి కనిపెట్టారు. ఇంతకూ ఆ చంద్రునిలో దాగిన ఆ అజ్ఞాత శక్తులు అందించే సందేశం ఏమిటో అనువదించి చెప్పమ  న్నారు ఆస్ట్రోనాట్స్‌. అలా వాళ్ల భాషని ఆస్ట్రోనాట్స్‌ పదే పదే వల్లి స్తుంటే ఆ ఆదివాసీ దుబాసీ విరగబడి నవ్వేశాడు. ఎందుకని? ఆ ఆదివాసీ పెద్ద అన్న మాటకు అసలు అర్థం– ‘ఆస్ట్రోనాట్స్‌ చెప్పే ఏ మాటా నమ్మొద్దు. రోదసీ యాత్రికుల పేరుతో వచ్చిన వీళ్లు మన ఆది వాసీల భూముల్ని కాజేయడానికి వచ్చినవాళ్లు’ అని ఆ ఆదివాసీ మాటల అర్థమట! వలస వాదంపై ఇదో వ్యంగ్యాస్త్రం. 

క్రీ.శ. 1500 సంవత్సరందాకా మానవులు ఈ భూమి ఉపరిత లాన్ని అధిగమించి పోనివాళ్లే. మççహా అయితే పెద్ద పెద్ద కోటలు, దుర్గాల నిర్మాణానికి, పర్వతారోహణకు పరిమితమైనవాళ్లు. ఆకాశ తలాన్ని మాత్రం పక్షులకు, పరమాత్మలకు ఏ దేవదూతలకో వదిలేసే వాళ్లు. ఇప్పుడలా కాదుగదా, రోదసీలో నక్షత్రాల దీవి ‘ఆండ్రోమీడా’ దీవికేసి, పాలపుంత (మిల్కీవే) కేసి శాస్త్ర పరిశోధకులు మెడలు రిక్కించి చూడగల్గుతున్నారు. లక్షల కాంతి సంవత్సరాల వ్యాసార్థం గల నక్షత్ర రాశిని లెక్కగట్టి గుర్తించగలుగుతున్నారు. శాస్త్ర పరిశోధనల్లో, ప్రయోగాల్లో జయాపజయాలు కావడి కుండ ల్లాంటివి. అందుకే ప్రస్తుత చంద్రయాన్‌–2 ప్రయోగంలో చంద్రుని పార్శా్వలకి చేరువదాకా వెళ్లినట్టు వెళ్లి, తొట్రుపాటుకు గురైన తాత్కా  లిక అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్ర విశ్లేషకుడు, వ్యాఖ్యాత వాసుదేవన్‌ ముకుంత ఇలా అలంకారప్రాయంగా అని ఉంటాడు.

‘‘తాత్కాలిక ఉప్పెనలకు ఎంత దూరంగా ఉంటే వీచే ఈదురుగాలు లకూ అంత దూరంగా ఉండగల్గుతాం’’! అంతేగాదు, చంద్రుని దక్షిణ దిక్కులో పరిశోధనలకు ప్రయత్నించిన చంద్రయాన్‌–2 ‘విక్రమ్‌’ ల్యాండ్‌ రోవర్‌ ప్రయాణం దాదాపు 95 శాతం వరకూ సజా వుగా జరిగి చివరి క్షణంలో అనూహ్యంగా సశేషంగా ముగింపునకు వచ్చిన యాత్ర సందర్భంగా డాక్టర్‌ శివన్‌ హుందాగా, ఒద్దికగా చేసిన ప్రకటన ప్రశంసార్హం. ఆయన మాటల్లోనే ‘‘ఇదే ఆఖరి యత్నం కాదు, చంద్రుని దగ్గరకు మరో యాత్రను ఇస్రో నిర్వహించనున్నది. మానవుణ్ణి ఇస్రో రోదసీయాత్రకు సిద్ధం చేసే కార్యక్రమం ప్రాథమిక దశలో ఉంది, అలాగే రోదసీపై రోబోటిక్‌ ప్రయోగం కూడా పరిశో ధనలో ఉంది. చంద్ర, అంగారక గ్రహరాశికి ఇండియా 21వ శతాబ్ది లోనే దూసుకుపోయే దశలో ఉంది’’ 

అందుకే మహాకవి వాక్కు (1954) దార్శనిక దృక్కు. ‘‘చంద్ర మండలానికి ప్రయాణం/ సాధించరాని స్వప్నం కాదు/ గాలికన్నా బరువైన వస్తువుని/ నేలమీద పడకుండా నిలబెట్టడం లేదూ!/ అయితే ఇక్కడ మా భూలోకంలో అంతా బాగానే ఉందని/ అంతా సుఖంగానే ఉన్నారని/ అన్నానంటే మాత్రం అది/ అబద్ధమే అవుతుంది/ దరి ద్రాల శాతం ఇంకా/ చిరాకు కలిగిస్తూనే ఉంది’’!


వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్‌,
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top