
అపరిచితుడు
కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. ‘‘విభజనకు లేదు భజన, ఎవరన్నా లేదు లెక్క, నాజోలికొస్తే రేగుతుంది తిక్క, సంక్షేమమే నా క్షేమం, ప్రజల కోసం పెదవి విప్పుతా.జనంకోసం పదవిని వదులుతా’’ అన్నాడు.
హ్యూమరం
కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు.
‘‘విభజనకు లేదు భజన, ఎవరన్నా లేదు లెక్క, నాజోలికొస్తే రేగుతుంది తిక్క, సంక్షేమమే నా క్షేమం, ప్రజల కోసం పెదవి విప్పుతా.జనంకోసం పదవిని వదులుతా’’ అన్నాడు.
‘‘అర్థం లేకుండా మాట్లాడడం చంద్రబాబు జన్మహక్కు, ఇప్పుడు మీతో కూడా వచ్చింది చిక్కు’’ అన్నారు విలేకరులు.
‘‘బాబుతో నాకు పోలికా? తలా తోక లేకుండా మాట్లాడితే బాబు, తోకా తలా లేకుండా మాట్లాడితే నేను. వాటాల్లో వుండకూడదు ఝూఠా, అందరికీ కావాలి మీఠా. సిఎంగా నాకూ వుండాలి కోటా?’’
‘‘మాకు కావాలి మంచినీళ్లు ఒక లోటా’’ అని విలేకరులు నీళ్లు తాగారు.
‘‘ఢిల్లీని సవాల్ చేస్తా, సిఎం సీటుపై రుమాల్ వేస్తా. యే తో కమాల్ నహీ. డింగ్‌డాంగ్ బెల్,ఆల్ ఈజ్ వెల్. ఢిల్లీ అంటే డోంట్ కేర్,అధిష్టానంతో ఆల్ క్లియర్, హెడ్ అండ్ షోల్డర్ నేను జనం మనిషిని.’’ అన్నాడు కిరణ్.
‘‘అంటే మీరు ఢిల్లీకి వ్యతిరేకా?’’
‘‘అనుకూలంలోనే వుంది ప్రతికూలం. కాదంటే తాటతీస్తా, నాలుక కోస్తా, ఢిల్లీ నాదైవం, కాంగ్రెస్ నా ప్రాణం. అధిష్టానానికి పొర్లుదండాలు పెడతా, సోనియాకు హారతిపడతా. పార్టీకి మొక్కుతా’’ అంటూ వూగిపోయాడు. విలేకరులు జడుసుకుని పారిపోడానికి ప్రయత్నిస్తే సెక్యూరిటీ వాళ్ళు కంట్రోల్ చేసారు.
‘‘ఢిల్లీ ఏం చెబితే అదే చేస్తారు అంతేకదా !’’ అని ఒక విలేకరి ధైర్యం చేసి అడిగాడు
‘‘ఢిల్లీ, గల్లీ, మ్యాంగోజెల్లీ ఇవేం చేయలేవు నన్ను. ప్రజలే నా బలం, తుపాకీ పడతా, తుపాన్‌ని ఎదుర్కొంటా, ప్రత్యర్థులతో పాన్ తినిపిస్తా. అన్యాయం చేస్తే తరుముకుంటా, నోరు విప్పకపోతే చరిత్రలో మిగలను, నా మాటే హిస్టరీ, నా కదలికలు మిస్టరీ. సమాజం కెమిస్ట్రీ మారుస్తా.’’
‘‘అసలు మీరెవరు సార్ ?’’
‘‘నేను కిరణ్‌కుమార్‌రెడ్డిని, ఢిల్లీకి విధేయుణ్ని, నేను సిఎంని, ప్రజల కోసం పదవిని వదులుకునేవాడిని. నేను నల్లారిని. విధేయత నా ఊపిరి. తిరుగుబాటు నా సిద్ధాంతం. రాద్దాంతం చేస్తే వేదాంతం చెబుతా.’’
‘‘ఏంటి తికమక’’ అని విలేకరులు బుర్రగోక్కున్నారు
కిరణ్ దిగ్విజయ్‌సింగ్‌కి ఫోన్ చేసి ‘‘నేను నేనుగాకుండా ఇంకెవరిలాగో మాట్లాడుతున్నా, ఇంకెవరో నేను లాగా మాట్లాడితే సహించను. నలుగురిలా నేను లేకపోయినా, నా ఒక్కడిలో నలుగురున్నారు.’’ అన్నాడు
‘‘అన్ని పనులు పూర్తయ్యేవరకూ ఇలాగే నరమానవుడికి అర్థంకాకుండా మాట్లాడుతూ వుండు’’ అని దిగ్విజయ్‌సింగ్ ఆర్డరేశాడు.
జి.ఆర్.మహర్షి
మహర్షిజం
అడవిలో వెళుతున్నపుడు పులి ఎదురైతే ఏం చేస్తారు
చంద్రబాబు-
నా తొమ్మిదేళ్ల పాలన గురించి చెబితే పులి జడుసుకుని పారిపోతుంది
కిరణ్‌కుమార్‌రెడ్డి-
ఢిల్లీకి ఫోన్ చేసి ఏం చేయాలో అడుగుతాను
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల కొత్త నినాదం
ఏమో గుర్రం ఎగరావచ్చు
కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్య
కాంగ్రెస్ రైలు బండిలో
గార్డులెక్కువై ప్రయాణీకులు తక్కువయ్యారు
తెలుగుతమ్ముడి కామెంట్
పూచికపుల్లతో కర్రసాము చేయడం మా చంద్రబాబు ప్రత్యేకత
రాజకీయమంటే?
- మేకల వల్ల ప్రమాదముందని తోడేళ్లు ఫిర్యాదు చేయడం
- శాంతి కోసం సింహం యజ్ఞం చేయడం