శ్రీవారి సన్నిధే వారి పెన్నిధి! | Tirumala Tirupati Devasthana Employees | Sakshi
Sakshi News home page

శ్రీవారి సన్నిధే వారి పెన్నిధి!

Oct 6 2013 2:49 AM | Updated on Aug 28 2018 5:55 PM

శ్రీవారి సన్నిధే వారి పెన్నిధి! - Sakshi

శ్రీవారి సన్నిధే వారి పెన్నిధి!

భక్తులకు ఏడుకొండలవాడి దర్శనాన్ని కల్పించి, ఆ దేవదేవుడి దీవెనలను అందించే తిరుమల తిరుపతి దేవస్థానం... కొన్ని వేలమందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది.

 భక్తులకు ఏడుకొండలవాడి దర్శనాన్ని కల్పించి, ఆ దేవదేవుడి దీవెనలను అందించే తిరుమల తిరుపతి దేవస్థానం... కొన్ని వేలమందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. ఈ కొలువులో దాదాపు 23 వేల మంది పని చేస్తున్నారు. వారంతా పలు రకాల విధులను నిర్వర్తిస్తూ స్వామివారి సన్నిధి సాక్షిగా జీవితాలను సాగిస్తున్నారు.
 
 టీటీడీలో మొత్తం 8 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 15 వేల మందికిపైగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 2013-14 బడ్జెట్ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగుల జీతభత్యాలు రూ.350 కోట్లు కాగా, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలు రూ.92 కోట్లు. ఈ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉండటం గమనార్హం. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ... తెలంగాణలోని పలు జిల్లాలకు  చెందినవారూ ఉన్నారు. తమిళనాడులోని వేలూరు, సేలం, తిరుత్తణి, తిరువళ్లూరు, చెన్నై, కర్ణాటకలోని బళ్లారి, కోలార్, బెంగళూరు ప్రాంతాలకు చెందినవారూ ఉపాధి పొందుతున్నారు. తిరుమల ఆలయం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉండటం వల్ల, తమిళ సంప్రదాయాలు ఎక్కువగా పాటించడం జరుగుతోంది. అందుకే అర్చకులు, ప్రసాదాలు తయారుచేసే పోటు ఉద్యోగుల్లో తమిళులే అధికం!
 
 జియ్యంగార్లు కీలకం!
 ఆలయ నిర్వహణకు సంబంధించి జియ్యంగార్ల సూచనలు, సలహాలు అత్యంత కీలకం. అదే విధంగా భక్తుల సదుపాయాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ధర్మకర్తల మండలి తీసుకునే నిర్ణయాలను అమలుపర్చే బాధ్యత కూడా జియ్యంగార్లదే. ప్రస్తుతం దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులు జియ్యంగార్ వ్యవస్థ కిందికే వస్తారు. ఇప్పుడు ఈవో నేతృత్వంలో ఇద్దరు జేఈవోలు, సీవీఎస్‌వో, డిప్యూటీ ఈవోలు, ఇతర అనుబంధ విభాగాల అధికారులు, అటెండర్‌స్థాయి  సిబ్బంది వరకు మొత్తం 8 వేల పైచిలుకు పనిచేస్తున్నారు. ఆలయ పూజాకార్యక్రమాల నిర్వహణలో ప్రధాన పర్యవేక్షకుడుగా పెద్ద జీయర్, ఈయనకు సహాయకుడిగా చిన్న జీయర్ వ్యవహరిస్తారు. వీరు ఆలయ నిర్వహణ, స్వామి వారి నిత్య కైంకర్యాల బాధ్యతను పర్యవేక్షిస్తారు.   పూజలు మాత్రం వైఖానస అర్చకులు నిర్వహిస్తారు. నిత్య పూజా కైంకర్యాల్లో లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించే బాధ్యతంతా వీరి పైనే ఉంటుంది. జియ్యంగార్లంటే సన్యాసులు కారు. సంసార సాగరాన్ని ఈదిన వారే. అయితే ఈ పదవిలోకి వచ్చిన క్షణం నుంచి వీరు సన్యాస ధర్మాలను తప్పక ఆచరించాలి. మఠం పరిపాలన, శ్రీవారి ఆలయంలో వేకువజామున సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తెరిచే కార్యక్రమం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని పూజా కార్యక్రమాలనూ జీయర్ లేదా వారి ప్రతినిధులు పర్యవేక్షించాలి. శ్రీవారి పూజలకు సంబంధించిన పువ్వులు మొదలు అన్ని రకాల వస్తువులూ వీరి చేతుల మీదుగానే అర్చకులకు అందాలి. జియ్యంగార్ల మఠాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం టీటీడీ ఏటా రూ.కోటిన్నర దాకా వెచ్చిస్తోంది.
 
 కొనుగోళ్లతో  వేలాది మందికి ఉపాధి
 నిత్యాన్నదానంలో ఏడాదికి 3,650 టన్నుల బియ్యం, 360 టన్నుల పప్పుదినుసులు అవసరమవుతాయి. అన్న ప్రసాదాలు, లడ్డు, వడలు తదితర  ప్రసాదాలు, అన్నదాన భోజనం తయారీ వంటి వాటి కోసం దేశ విదేశాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సరుకులు కొనుగోలు చేస్తోంది టీటీడీ. దీనికి ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. బియ్యం, చక్కెర, నెయ్యి, పప్పు దినుసులు, బెల్లం, అరటి ఆకులు, కూరగాయలు, పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, పాలు వంటి సరుకుల కొనుగోళ్లపై ఎక్కువ స్థాయిలో ఖర్చు అవుతోంది. ప్రసాదం వితరణ చేసే దొన్నెలు, పారిశుద్ధ్యానికి వినియోగించే చీపుర్లపై కూడా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  ఇవన్నీ ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల కొన్ని వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement