పాపం'మగ'నుభావులు

Special Story On Men's Day Special On 17/11/2019 - Sakshi

నవంబరు 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా...

మగాళ్లకూ కష్టాలు ఉంటాయి. మగాళ్లకూ కన్నీళ్లు ఉంటాయి. మగాళ్లూ మనుషులే! మగాళ్లకూ అన్యాయాలు జరుగుతుంటాయి. మగాళ్లు కూడా వివక్షకు బాధితులవుతుంటారు. ‘మగా‘నుభావులు ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని గుర్తిస్తున్నారు... అందుకని తమదైన రోజును సగర్వంగా జరుపుకొంటున్నారు...

మగాళ్లకు సంబంధించి సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. చాలా భ్రమలు ఉన్నాయి. ప్రచారంలో ఉన్న అపోహలు, భ్రమలు మగ బతుకుల గురించిన వాస్తవాలను మరుగున పడేస్తున్నాయి. సమాజం మగాళ్లను ఒక స్టీరియోటైప్‌లో ఊహించుకుని, వాళ్లను అలాగే తయారు చేయాలనుకుంటుంది. అందుకు భిన్నంగా ఉన్నవాళ్లను ఎద్దేవా చేసి, వాళ్లకు మనశ్శాంతి నశించేంత వరకు హింసిస్తుంది. సమాజం దృష్టిలో మగాడంటే కండరగండడు. మగాడంటే ధీరగంభీరుడు. మగాడికి కన్నీళ్లుండరాదు. మగాడనే వాడు కష్టాలకు చలించరాదు. మనసుకు కష్టం కలిగి కళ్లల్లో నీళ్లు చిప్పిల్లినప్పుడు వాటినెవరి కంటా పడనీయకుండా ముఖం పక్కకు తిప్పేసుకోవాలి.

కళ్లు చెమ్మగిల్లిన ముఖాన్ని ఎవరైనా గమనిస్తే ‘వాడేం మగాడ్రా.. కాసింత కష్టానికే ఏడ్చేస్తున్నాడు’ అని అలవోకగా అనేసి బహిరంగంగా చులకన చేసేస్తారు. సమాజానికి సూక్ష్మరూపం కుటుంబం. సమాజంలో ఉన్న అపోహలకూ భ్రమలకూ కుటుంబాలు అతీతం కావు. సమాజంలో తరతరాలుగా పాతుకుపోయి ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా మగపిల్లలను తీర్చిదిద్దడానికి కుటుంబాలు శాయశక్తులా ప్రయత్నిస్తాయి. మగపిల్లలు ఎప్పుడైనా ఏడిస్తే, ‘మగాళ్లు ఎప్పుడైనా ఏడుస్తారా?’ అని గద్దించి, వాళ్ల నోళ్లు మూయిస్తారు. మగాళ్లు ఎలా ఉండాలో అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచే మగపిల్లలకు నూరిపోస్తారు. బడుల్లో చేరినా మగపిల్లల బతుకులకు కాస్త తెరిపి ఉండదు.

మగాళ్లూ ఉద్యమిస్తున్నారు
హక్కుల కోసం మగాళ్లూ ఉద్యమిస్తు న్నారు. మన దేశంలో పురుషులు కాస్త ఆలస్యంగా మేల్కొన్నారు. నవ శతాబ్ది ప్రారంభమైనది మొదలుకొని హక్కుల సాధన కోసం ఉద్యమాల బాట పట్టారు. న్యాయమైన హక్కుల కోసం పురుషుల ఉద్యమాలు ప్రారంభమై దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా, వారి ఉద్యమాలకు తగిన ప్రచారం దక్కడం లేదు. గుర్తించకపోయినా, పురుషులు మాత్రం ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ముంబై నుంచి రుడాల్ఫ్‌ డిసౌజా పురుషుల హక్కుల ఉద్యమాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు.

భార్యల నుంచి మానసిక, శారీరక వేధింపులకు గురవుతున్న పురుషులకు చట్టపరంగా ఆదుకోవడానికి 2005లో ‘సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’ సంస్థను ప్రారంభించి, జాతీయ స్థాయిలో పురుషుల సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు. ‘సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’ తరఫున తొలిసారిగా 2007 నవంబరు 19న ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’ సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించారు. మన దేశంలో వరకట్న నిరోధక చట్టాలు వివక్షతో కూడుకుని ఉంటున్నాయని, చాలామంది అమాయకులు ఈ చట్టాల కారణంగా తప్పుడు కేసుల్లో చిక్కుకుని నానా అగచాట్లు పడుతున్నారని రుడాల్ఫ్‌ డిసౌజా చెబుతున్నారు.

రుడాల్ఫ్‌ డిసౌజా కంటే ముందుగా 1988లోనే సుప్రీంకోర్టు న్యాయవాది రామ్‌ప్రకాశ్‌ చుగ్‌ ‘సొసైటీ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయెల్టీ టు హజ్బండ్స్‌’ అనే సంస్థను ప్రారంభించారు. ‘‘దేశంలోని వరకట్న నిరోధక చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగానే ఉన్నాయి. భార్యల నుంచి హింసను, బెదిరింపులను ఎదుర్కొనే భర్తలను కాపాడేందుకు ఎలాంటి చట్టాలూ లేవు. వరకట్న నిరోధక చట్టాలను అడ్డుపెట్టుకుని భర్తలను బెదిరించి, కేసుల్లో ఇరికించి అధిక మొత్తంలో డబ్బును రాజీ రూపంలో వసూలు చేసుకోవాలనుకునే భార్యల నుంచి అమాయక భర్తలకు ఎలాంటి రక్షణ లేదు. ఈ పరిస్థితి వైవాహిక సామరస్యాన్నే కాదు, కుటుంబ వ్యవస్థనే దెబ్బతీస్తోంది’’ అని చుగ్‌ అభిప్రాయపడుతున్నారు.

పురుషుల హక్కులకు కూడా రక్షణ కల్పించే చట్టాల కోసం ఆయన చాలాకాలంగా పోరాటం సాగిస్తున్నారు. గృహహింస చట్టాలను ‘చట్టపరమైన ఉగ్రవాదం’గా ‘సేవ్‌ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్‌’కు చెందిన స్వరూప్‌ సర్కార్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఈ చట్టపరమైన ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే దేశంలో ఎందరు భగత్‌సింగ్‌లు, ఎందరు నేతాజీలు పుట్టుకు రావాలో నాకు తెలియదు’’ అని కూడా స్వరూప్‌ సర్కార్‌ వ్యాఖ్యానించారు. స్వరూప్‌ సర్కార్‌కు మద్దతుగా సచిన్‌ దలాల్‌ అనే వ్యక్తి ‘‘ఇక దేశంలో వివాహ వ్యవస్థకు శిలువ వేసినట్లే.. 498–ఏ సెక్షన్‌తో సంతృప్తి చెందని వారు చట్టపరంగా భర్తను, కుటుంబాన్ని లూటీ చేయడానికి గృహహింస చట్టాన్ని కూడా తెచ్చారు’’ అని విమర్శిస్తూ రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాశారు.

మహిళలకో కమిషన్‌ ఉంది.. మరి పురుషులకేదీ?
మహిళల హక్కుల పరిరక్షణ కోసం, వారికి జరిగే అన్యాయాలను అరికట్టడం కోసం జాతీయ మహిళా కమిషన్‌ ఏర్పాటైంది. మరి పురుషులకు అలాంటి కమిషన్‌ ఏదీ? అని లక్నోకు చెందిన ‘నేషనల్‌ కోయలిషన్‌ ఆఫ్‌ మెన్‌’ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. జాతీయ స్థాయిలో పురుషుల కోసం కూడా ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలేవీ పురుషుల పక్షం తీసుకోకుంటే, పురుషుల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీని పురుషులే ఏర్పాటు చేసుకోవాలని కూడా డిమాండ్‌ చేస్తోంది.

పురుషుల దినోత్సవం చరిత్ర
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదలైన తొంభై ఏళ్లకు గాని అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకోవడం అధికారికంగా మొదలవలేదు. మొదటిగా థామస్‌ ఓస్టర్‌ అనే అమెరికాలోని మిసోరి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ 1992 ఫిబ్రవరి 7న పురుషుల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. మాల్టా దీవిలో 1994 నుంచి ఏటా ఫిబ్రవరి 7వ తేదీనే పురుషుల దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలోని యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టిండీస్‌కు చెందిన హిస్టరీ ప్రొఫెసర్‌ జిరోమ్‌ తీలక్‌సింగ్‌ 1999 నవంబరు 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు ఎనభై దేశాలు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషుల హక్కులు, పురుషుల ఆరోగ్యం, పురుషులు ఎదుర్కొంటున్న వివక్ష తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇదిలా ఉంటే, నవంబరు నెలను పురుషుల మాసంగా కూడా అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. భారత్‌లో 2007 నుంచి నవంబరు 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం మొదలైంది. అయితే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలకు లభిస్తున్న ప్రాధాన్యం అంతర్జాతీయ పురుషుల దినోత్సవ కార్యక్రమాలకు రావడం లేదు.

‘మగా’నుభావురాలు
స్వాతంత్య్రానికి మునుపటి కాలంలో మహిళల హక్కుల కోసం కొందరు పురుషులు పోరాటాలు చేశారు. రాజా రామ్‌మోహన్‌రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు నాటి సమాజంలో మహిళల పట్ల సాగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారంటే, అప్పటి సమాజంలో మహిళల దుస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే రీతిలో నేటి సమాజంలో ఒక మహిళ స్వయంగా ముందుకు వచ్చి పురుషుల హక్కుల కోసం పోరాడుతుంది. అలాగని వర్తమాన సమాజంలో మహిళల పట్ల అన్యాయాలేవీ జరగడం లేదని చెప్పడానికి లేదు. ‘‘దేశంలో సగటున ప్రతి 15 నిమిషాలకు ఒక మగువపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 69 నిమిషాలకు ఒక మహిళ వరకట్న దాహానికి బలైపోతోంది.

ఏటా లక్షలాది ఆడశిశువులు గర్భస్థ స్థితిలోనే భ్రూణహత్యలకు గురవుతున్నారు. ఇలాంటి అఘాయిత్యాలపై మహిళలు పోరాటాలు సాగిస్తున్నారు. వీటిపై కచ్చితంగా పోరాటాలు సాగాల్సిందే. అయితే, మగాళ్లు మాత్రం మనుషులు కాదా? సమాజంలో వారు మాత్రం వివక్షను ఎదుర్కోవడం లేదా? కొన్ని నేరాలకు వారు మాత్రం బాధితులు కావడం లేదా?’ అని ప్రశ్నిస్తున్నారు సామాజిక కార్యకర్త, పాత్రికేయురాలు దీపికా నారాయణ్‌ భరద్వాజ్‌. ‘‘మహిళల హక్కుల కోసం మగాళ్లు పోరాడటం లేదా? మరి మగాళ్ల హక్కుల కోసం మహిళలు పోరాడితే తప్పేముంది?’’ అని ప్రశ్నిస్తున్నారామె. ‘‘మాట్రీర్స్‌ ఆఫ్‌ మ్యారేజ్‌’’ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి, 498–ఎ సెక్షన్‌ కింద తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న పురుషుల తరఫున పోరాటం సాగిస్తున్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై నేను మాట్లాడను. ఇప్పటికే వాటిపై లక్షలాది మంది మాట్లాడుతున్నారు’’ అని అంటారామె.

ఆయుర్దాయంలో వెనుకబాటు
మగాళ్లు కండరగండలు. మగాళ్లు బలాఢ్యులు. మగాళ్లు మొండిఘటాలు... ఇలాంటి అభిప్రాయాలన్నీ మగాళ్ల గురించి లోకంలో ప్రచారంలో ఉన్నవి. ఇవి అర్ధసత్యాలు మాత్రమే. నిజానికి మగాళ్లు అంతటి బలాఢ్యులైతే, అంతటి మొండిఘటాలైతే వాళ్ల ఆయువు తొందరగా ఎందుకు తీరిపోతోంది. మహిళలతో పోల్చుకుంటే పురుషుల సగటు ఆయుర్దాయం తక్కువగా ఉంటున్న సంగతి జాతీయ, అంతర్జాతీయ గణాంకాలు తేటతెల్లం చేస్తున్న వాస్తవం. ‘స్టీరియో టైప్‌’ మగలక్షణాలను పంటిబిగువున భరించి, భరించి అలసి సొలసిన మగాళ్ల గుండెలు తొందరగా ఆగిపోతున్నాయి. సమాజం అప్రకటితంగా విధించిన మగ లక్షణాలను ప్రదర్శించుకునే ప్రయత్నంలో అమాయక పురుషులు తమ ఆయువునే పణంగా పెడుతున్నారు.

ఐక్యరాజ్య సమితి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళల సగటు ఆయుర్దాయం 71.1 ఏళ్లుగా ఉంటే, పురుషుల సగటు ఆయుర్దాయం 67 ఏళ్లు మాత్రమే. మన భారత్‌లో మహిళల సగటు ఆయుర్దాయం 67.5 ఏళ్లు అయితే, పురుషుల సగటు ఆయుర్దాయం 63.2 ఏళ్లు మాత్రమే. కుటుంబభారం నిర్వహించడంలో పురుషులు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నారు. అందుకు వాళ్లకు ఎలాంటి గుర్తింపూ ఉండదు. కుటుంబభారాన్ని మోసే మహిళల పట్ల సమాజంలో ఉండే సానుభూతి పురుషులపై మచ్చుకైనా కనిపించదు. ‘మర్ద్‌ కో దర్ద్‌ నహీ హోతా’ అనే దురభిప్రాయం సమాజంలో తరతరాలుగా పాతుకుపోయి ఉంది. ఇదే అభిప్రాయాన్ని నరనరాన జీర్ణించుకున్న ‘మగా’నుభావులు చిన్నా చితకా నొప్పులను పెద్దగా పట్టించుకోరు. వాటిని మౌనంగానే భరిస్తారే తప్ప వెంటనే వైద్య సహాయం కోసం ఆస్పత్రులకు వెళ్లరు. ఒక్కోసారి ఇలాంటి చిన్నా చితకా నొప్పులే ప్రాణాంతకంగా పరిణమించి, పురుషుల ఆయుర్దాయాన్ని అర్ధంతరంగా కబళిస్తున్నాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top