అంతరిక్షంలో అడ్డాలు

Special Story On Adams In Space On 24/11/2019 - Sakshi

భూమ్మీద జనాభా పెరుగుతోంది. చోటు చాలక జనాలకు ఇరుకిరుకుగా మారుతోంది. జనాభాతో పాటు కాలుష్యమూ పెరుగుతోంది. ఊపిరి తీసుకోనివ్వక ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే పరిస్థితులు కొనసాగితే భూమ్మీద మానవాళి అంతరించక తప్పదనే శాస్త్రవేత్తలు హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. అంత విపత్తు ముంచుకు రాకముందే భూమిని విడిచి వేరే చోటు చూసుకోవడమే మేలని కొందరు మేధావులు ఆలోచనలు చేస్తున్నారు. అంతరిక్షంలో అడ్డాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలూ సాగిస్తున్నారు.

భూమికి దగ్గర్లోనే ఉన్న అంగారక గ్రహాన్ని రేపటి ఆవాసంగా మార్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా అనే పెదవి విరుపులు అక్కడక్కడా వినిపిస్తున్నా, అంగారకుడిని ఆవాసంగా చేసుకోవడానికి సాగుతున్న సన్నాహాలు మాత్రం ఆగడం లేదు. సమీప భవిష్యత్తులోనే అంగారకుడిపై జెండా ఎగరేయడానికి మరింత ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేకాదు, ఇదివరకు ఎన్నడూ జరగనంత శరవేగంగా ప్రస్తుత శతాబ్దిలో అంతరిక్ష ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని వినూత్న లక్ష్యాలతో కొనసాగుతున్నాయి.

వాటిపై కొంచెం దృష్టి సారిద్దాం...
అంగారకుని ఉపరితలంపై ఏమున్నదో, జీవజాలం మనుగడకు అక్కడ ఏమాత్రమైనా ఆస్కారమేమైనా ఉంటుందో లేదో ఇప్పటి వరకు ఇదమిత్థంగా తేలలేదు. మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ప్రయోగించిన ‘మంగల్‌యాన్‌’ 2014 సెప్టెంబరు 24న అంగారకుని కక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది. ‘మంగల్‌యాన్‌’గా మన శాస్త్రవేత్తలు నామకరణం చేసిన ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’ వ్యోమనౌకలోని ‘మార్స్‌ కలర్‌ కెమెరా’ (ఎంసీసీ) తొలిసారిగా అంగారకుని పూర్తి గోళాకార ఫొటోలను తీసి భూమి మీదకు పంపింది. ఈ ఫొటోలను 2014 సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. ఎంసీసీ పంపిన ఫొటోల ఆధారంగానే ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2015 సెప్టెంబరు 24న సమగ్రంగా 120 పేజీలతో రూపొందించిన ‘మార్స్‌ అట్లాస్‌’ను విడుదల చేశారు. ‘మంగల్‌యాన్‌’ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంది.

ఈ సమాచారం ప్రకారం అంగారకుని ఉపరితలం మానవులకు ఆవాసంగా పనికొస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే, అమెరికాకు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’ సంస్థ సమీప భవిష్యత్తులోనే మనుషులను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అంతేకాదు, అంగారకునిపై శాశ్వత నివాసయోగ్యమైన సుస్థిర నగరాన్ని నిర్మించాలనేదే తన లక్ష్యంగా ప్రకటించుకుంది. అంగారకునిపైకి 2022 నాటికి ఒక సన్నాహక వ్యోమనౌకను పంపనున్నామని, 2024 నాటికి అక్కడికి మనుషులను పంపనున్నామని ‘స్పేస్‌ఎక్స్‌’ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించడం విశేషం.

శత కోటీశ్వరుడైన ఎలాన్‌ మస్క్‌ ఇటీవలి కొంతకాలంగా తన సంస్థ లక్ష్యాలను ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ వస్తున్నారు. తన సంస్థలోని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న రాకెట్‌ నమూనాలను బయటి ప్రపంచానికి వెల్లడిస్తూ వస్తున్నారు. ఎలాన్‌ మస్క్‌ లక్ష్యాలు, ఆయన చేస్తున్న ప్రకటనలపై ప్రపంచవ్యాప్తంగా పత్రికలు, ప్రసార సాధనాల్లో విస్తృతంగా కథనాలు వెలువడుతున్నాయి. ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలోని ‘స్పేస్‌ఎక్స్‌’ ప్రయోగాల్లోని సాధ్యాసాధ్యాల సంగతి ఎలా ఉన్నా, అక్కడక్కడా కొందరు శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలను కొట్టి పారేస్తూ ప్రకటనలు చేస్తున్నా, ఇవి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. మానవాళి భవితవ్యంపై కొత్త కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.

అంగారకునిపై శాశ్వత నగరం...ఇరవై ఏళ్లలోనే!
అంగారకునిపై శాశ్వత నగర నిర్మాణం మరో ఇరవై ఏళ్లలోనే సాధ్యమవుతుందని ‘స్పేస్‌ఎక్స్‌’ సీఈవో ఎలాన్‌ మస్క్‌ చెబుతున్నారు. ప్రస్తుతం ‘స్పేస్‌ఎక్స్‌’ రూపొందించిన ‘స్టార్‌షిప్‌’ విమానాలకు వంద టన్నుల బరువును అంతరిక్షంలోకి తీసుకుపోయే సామర్థ్యం ఉంది. ఫాల్కన్‌ రాకెట్ల ద్వారా ఇవి అంతరిక్షానికి చేరుకుంటాయి. అంగారకునిపై నగరాన్ని నిర్మించాలంటే, అందుకు అవసరమైన సామగ్రిని, సిబ్బందిని తీసుకుపోవడానికి వెయ్యి ‘స్టార్‌షిప్‌’ విమానాలు అవసరం అవుతాయని, ఒక్కో స్టార్‌షిప్‌ తయారీకి 20 లక్షల డాలర్లు (రూ.14.40 కోట్లు) అవసరమవుతాయని ఎలాన్‌ మస్క్‌ చెబుతున్నారు. రోజుకు మూడు చొప్పున ఏడాదికి దాదాపు వెయ్యి ‘స్టార్‌షిప్స్‌’ను అంగారకునిపైకి పంపగలిగితే, రానున్న ఇరవయ్యేళ్లలోనే అంగారకునిపై శాశ్వత సుస్థిర నగరాన్ని సిద్ధం చేయగలమని చెబుతున్నారు.

ఇప్పటికే ‘స్పేక్స్‌ఎక్స్‌’ సంస్థ వంద ‘స్టార్‌షిప్స్‌’ను సిద్ధం చేసింది. ఒకవైపు ‘స్పేస్‌ఎక్స్‌’ అంగారకునిపైకి మనుషులను పంపేందుకు సిద్ధపడుతుంటే, మరోవైపు అమెరికన్‌ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2024 నాటికి మరోసారి చంద్రునిపైకి వ్యోమగాములను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ‘నాసా’, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ), రష్యన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (రాస్‌కాస్మోస్‌), ‘ఇస్రో’ వంటి సంస్థలు చంద్రుడు, అంగారకుడు సహా వివిధ అంతరిక్ష గోళాల్లో ఏముందో, అక్కడి వాతావరణం ఎలా ఉందో తెలుసుకునే దిశగా ప్రయోగాలు సాగిస్తుంటే, ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలోని ‘స్పేస్‌ఎక్స్‌’ సంస్థ ఏకంగా గ్రహాంతర ఆవాసాల ఏర్పాటే లక్ష్యంగా ప్రయోగాలను సాగిస్తోంది. తన లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం లెక్కకు మిక్కిలిగా వ్యోమనౌకలను, రాకెట్లను సిద్ధం చేసుకుంటోంది.

అంగారకునిపై జీవం కోసం వెదుకులాట!
అంగారకునిపై జీవం కోసం వెదుకులాటకు పలు దేశాల అంతరిక్ష పరిశోధన కేంద్రాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అమెరికన్‌ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అంగారకునిపై జీవాన్వేషణ కోసం వచ్చే ఏడాది ఒక రోవర్‌ను అంగారక ఉపరితలంపై ఉన్న ‘జెజెరో’ బిలం వద్దకు పంపడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ప్రాంతంలో జీవానికి కీలకమైన కార్బొనేట్స్, నీటితడి గల సిలికా వంటి పదార్థాల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. అంగారకునిపై ‘జెజెరో’ బిలం దాదాపు 350 కోట్ల కిందట ఒక సరస్సుగా ఉండేదని వారు భావిస్తున్నారు. దీనిపై మరింత క్షుణ్ణంగా పరిశోధనలు సాగించే లక్ష్యంతోనే ‘నాసా’ వచ్చే ఏడాది అంగారకునిపైకి రోవర్‌ను పంపడానికి సమాయత్తమవుతోంది.

అంగారకునిపై ఒకప్పుడు ద్రవరూపంలో నీరు ఉన్న పరిస్థితి నుంచి ఉపరితలంపై అంతా గడ్డకట్టుకుపోయిన ఎడారి వాతావరణం ఎలా ఏర్పడిందనే దానిపై ‘నాసా’ రోవర్‌ సమాచారం సేకరిస్తుంది. రోవర్‌తో పాటు ‘నాసా’ పంపే ఆర్బిటర్‌ అంగారకుని చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తూ, అత్యంత స్పష్టమైన అంగారకుని ఉపరితలం ఫొటోలను  పంపుతుంది.‘నాసా’ 2020 జూలైలో ‘మార్స్‌ మిషన్‌’ను ప్రయోగించ నుంది. ఇందులోని రోవర్‌ అంగారకుని ఉపరితలంపైకి 2021 ఫిబ్రవరిలో చేరుకోనుంది. ఒకవైపు ‘నాసా’ ప్రయత్నాలు ఈ దశలో ఉంటే, ‘స్పేస్‌ఎక్స్‌’ ఏకంగా అంగారకునిపై నగర నిర్మాణానికి పథక రచన సాగిస్తుండటం విశేషం.

అంతరిక్ష విహారయాత్రలకు సన్నాహాలు
శాస్త్ర పరిశోధనల కోసం వ్యోమగాములు అంతరిక్ష యాత్రలు చేయడం సరే, వినోదం కోసం, విలాసం కోసం అంతరిక్షంలో విహారయాత్రలు చేయాలనే ఉబలాటం చాలామందికే ఉంటుంది. అలాంటి వారి కోరిక తీర్చడానికి పలు సంస్థలు అంతరిక్ష విహారయాత్రలు చేపట్టడానికి సన్నాహాలు సాగిస్తున్నాయి. ప్రస్తుత శతాబ్ది తొలి దినాల్లోనే రష్యన్‌ అంతరిక్ష పరిశోధక సంస్థ పర్యాటకుల కోసం అంతరిక్ష విహారయాత్రలు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రష్యన్‌ సోయుజ్‌ వ్యోమనౌకల్లో 2001–2009 మధ్య కాలంలో ఏడుగురు పర్యాటకులు అంతరిక్ష విహారయాత్రలకు వెళ్లి వచ్చారు. అయితే, రష్యన్‌ అంతరిక్ష పరిశోధక సంస్థ 2010 నుంచి పర్యాటకుల కోసం అంతరిక్ష విహార యాత్రలను నిలిపివేసింది.

తొలిసారిగా డెన్నిస్‌ టిటో అనే ఔత్సాహికుడు 2001లో రష్యన్‌ వ్యోమగాములతో కలసి అంతరిక్ష విహారయాత్రకు వెళ్లి పది రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్‌) గడిపి వచ్చాడు. ఇటీవలి కాలంలో కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఔత్సాహిక పర్యాటకుల కోసం అంతరిక్ష విహారయాత్రలు నిర్వహించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాల్లో అమెరికన్‌ సంస్థ ‘స్కేల్డ్‌ కాంపోజిట్స్‌’ 2004లో ప్రయోగించిన ‘స్పేస్‌షిప్‌ వన్‌’ భూ ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుని విజయవంతంగా తిరిగి వచ్చింది.  ఇలా రెండువారాల వ్యవధిలో రెండుసార్లు తన ప్రయోగంలో విజయవంతం కావడంతో కోటి డాలర్ల (రూ.71 లక్షలు) బహుమతి కూడా గెలుచుకుంది. అమెరికన్‌ నేవీ మాజీ అధికారి అయిన బ్రియాన్‌ బిన్నీ ‘స్పేస్‌షిప్‌ వన్‌’ను భూ ఉపరితలానికి 112 కిలోమీటర్ల ఎత్తు వరకు విజయవంతంగా నడిపి రికార్డు సృష్టించాడు.

విమానయాన సంస్థ ‘వర్జిన్‌ గ్రూప్‌’ అనుబంధ సంస్థ అయిన ‘వర్జిన్‌ గాలక్టిక్‌’ కూడా అంతరిక్ష పర్యాటకంపై దృష్టి సారించింది. ఈ సంస్థకు చెందిన ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ’ గత ఏడాది డిసెంబరులో విజయవంతంగా అంతరిక్షానికి చేరుకుని విజయవంతంగా తిరిగి వచ్చింది. అంతకు ముందు 2014లో ఈ సంస్థ అంతరిక్షానికి చేరుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘వర్జిన్‌ గాలక్టిక్‌’ అంతరిక్ష విహారయాత్ర కోసం పర్యాటకుల నమోదు కూడా ప్రారంభించింది. అంతరిక్ష విహారయాత్రకు వెళ్లదలచుకున్న పర్యాటకులు ఈ సంస్థకు 2 లక్షల పౌండ్లు (రూ.1.84 కోట్లు) ముందస్తు డిపాజిట్‌ మొత్తంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అరవై దేశాల నుంచి దాదాపు ఆరువందల మంది ‘వర్జిన్‌ గాలక్టిక్‌’ నిర్వహించబోయే అంతరిక్ష యాత్రలో పాల్గొనేందుకు ముందస్తు డిపాజిట్లు చెల్లించారు. ‘వైట్‌నైట్‌టూ’, ‘స్పేస్‌షిప్‌టూ’ వ్యోమనౌకల ద్వారా ఈ అంతరిక్ష విహార యాత్రలను నిర్వహించనున్నట్లు ‘వర్జిన్‌ గాలక్టిక్‌’ చెబుతోంది. ఇదిలా ఉంటే, ‘వర్జిన్‌’కు పోటీ సంస్థలైన ‘బ్లూ ఆరిజిన్‌’, ‘బోయింగ్‌’ వంటి సంస్థలు కూడా పర్యాటకులతో అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

అంతరిక్ష కక్ష్యలో హోటల్‌
వ్యోమనౌకలో పర్యాటకులను అంతరిక్షానికి తీసుకుపోయి, అక్కడి నుంచి నేల మీదకు తిరిగి తీసుకొస్తే పెద్ద థ్రిల్లేముంటుంది? అంతరిక్ష కక్ష్యలోనే కొన్నాళ్లు విలాసాలను అనుభవించి తిరిగి వస్తే కదా అసలు థ్రిల్లు అనే ఆలోచనతో ‘ఆరియన్‌ స్పాన్‌’ అనే అమెరికన్‌ సంస్థ అంతరిక్ష కక్ష్యలో ఏకంగా ఒక హోటల్‌నే నడిపించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. అంతరిక్షానికి చేరుకున్నాక అక్కడ గురుత్వాకర్షణ ఉండదనే సంగతి తెలిసినదే. అయితే, ‘ఆరియన్‌ స్పాన్‌’ తమ హోటల్‌ గదుల్లోను, కారిడార్‌లోను కృత్రిమ గురుత్వాకర్షణను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకుంటోంది. కృత్రిమ గురుత్వాకర్షణ ఫలితంగా పర్యాటకులు భూమ్మీద హోటళ్లలో గడిపినట్లే, అంతరిక్షంలో ఏర్పాటు చేయనున్న తమ హోటల్‌లోనూ మామూలుగా నడవడానికి వీలవుతుందని చెబుతోంది. ఈ హోటల్‌లో బార్, రెస్టారెంట్, స్విమ్మింగ్‌పూల్‌ వంటి సమస్త విలాసాలను, అధునాతనమైన గదులను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతోంది.

ఈ హోటల్‌ గదులకు ఏర్పాటు చేసిన కిటికీల గుండా సూర్యచంద్రులతో పాటు భూమిని కూడా తిలకించడానికి వీలవుతుందని చెబుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) అంతరిక్ష కక్ష్యలో చిరకాలంగా ఉన్నట్లే, ‘ఆరియన్‌ స్పాన్‌’ ఏర్పాటు చేయనున్న ‘అరోరా స్పేస్‌ స్టేషన్‌’ హోటల్‌ కూడా అంతరిక్ష కక్ష్యలో చిరకాలంగా ఉంటుంది. ఇందులో బస చేయదలచుకున్న పర్యాటకుల కోసం ‘ఆరియన్‌ స్పాన్‌’ ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభించింది. అంతరిక్ష హోటల్‌లో గడపదలచుకున్న పర్యాటకులు ఒక్కొక్కరు 70 లక్షల పౌండ్లు (రూ.64.64 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. తొలి విడత అతిథులకు 2022 నాటికి ఈ హోటల్‌లో ఆతిథ్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ‘ఆరియన్‌ స్పాన్‌’  చెబుతోంది.  అంతరిక్ష హోటల్‌లో బస చేసేందుకు దేశ దేశాల నుంచి సంపన్నులు బారులు తీరుతున్నారు. ఇందులో ఇప్పటికే కొన్ని నెలలకు సరిపడా బుకింగ్‌లు పూర్తయ్యాయంటే, జనాల్లో దీనిపై ఎలాంటి క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మనవాళ్లు ఇంకా దృష్టి పెట్డడం లేదు
అంతరిక్ష పర్యాటకంపై మనవాళ్లు ఇంకా దృష్టి పెట్టడం లేదు. అయితే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) తరహాలో ఒక సొంత పరిశోధక కేంద్రాన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేసేందుకు ‘ఇస్రో’ సన్నాహాలు చేస్తోంది. ఐఎస్‌ఎస్‌లో చేరదలచుకోలేదని, దాని బదులు మనదైన సొంత పరిశోధన కేంద్రాన్నే అంతరిక్షంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని ‘ఇస్రో’ అధినేత శివన్‌ ప్రకటించారు.  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్‌) అమెరికాకు చెందిన ‘నాసా’, యూరోప్‌కు చెందిన ‘ఈఎస్‌ఏ’, జపాన్‌కు చెందిన ‘జాక్సా’, రష్యాకు చెందిన ‘రాస్‌కాస్మోస్‌’, కెనడాకు చెందిన ‘సీఎస్‌ఏ’ భాగస్వాములుగా ఉన్నాయి. భారత్‌ ఇందులో భాగస్వామిగా చేరే బదులు సొంత పరిశోధక కేంద్రం ఏర్పాటు చేసుకోవడంపైనే మొగ్గు చూపుతోంది. ‘గగన్‌యాన్‌’ పేరిట ‘ఇస్రో’ తలపెట్టిన ఈ పరిశోధక కేంద్రాన్ని 2022లో అంతరిక్షంలోకి పంపేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు శివన్‌ వెల్లడించారు. అయితే, అంతరిక్షంలో పర్యాటకుల కోసం విహారయాత్రలు చేపట్టే ఆలోచనేదీ తమకు లేదని శివన్‌ స్పష్టం చేశారు. అంతరిక్షంలోకి పరిశోధక కేంద్రాన్ని పంపేందుకు ముందు 2020లో సూర్యునిపై పరిశోధనల కోసం ‘ఆదిత్య ఎల్‌1’ వ్యోమనౌకను సూర్యుని వద్దకు పంపనున్నట్లు తెలిపారు. – పన్యాల జగన్నాథదాసు

చంద్రుని మీదకు విహారయాత్ర
పర్యాటకులను చంద్రుని మీదకు విహారయాత్రకు తీసుకుపోయేందుకు అమెరికాకు చెందిన ‘బ్లూ ఆరిజిన్‌’ సన్నాహాలు చేసుకుంటోంది. ‘బ్లూ ఆరిజిన్‌’ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఇటీవల వాషింగ్టన్‌లో పరిమిత అతిథుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో తమ సంస్థ చంద్రుడి మీదకు పంపబోయే బ్లూమూన్‌ ల్యాండర్‌ను ప్రదర్శించారు. ఈ ల్యాండర్‌ ద్వారా 2024లో పర్యాటకులను చంద్రుని మీదకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. తమ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు మూడేళ్లుగా శ్రమించి, మనుషులతో పంపడానికి వీలయ్యే ల్యాండర్‌కు రూపకల్పన చేశారని జెఫ్‌ బెజోస్‌ తెలిపారు. మనుషులను చంద్రుడి మీదకు పంపడానికి ముందుగా వచ్చే వేసవిలో దీనిని ప్రయోగాత్మకంగా చంద్రుడి మీదకు పంపనున్నట్లు వెల్లడించారు. చంద్రుడి మీదకు విహారయాత్ర కోసం ఇప్పటికే ఆరుగురు పర్యాటకులు తమ సంస్థ వద్ద పేర్లు నమోదు చేయించుకున్నారని తెలిపారు. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top