విషాదామృతం..! | songs | Sakshi
Sakshi News home page

విషాదామృతం..!

May 29 2016 1:54 AM | Updated on Sep 4 2017 1:08 AM

విషాదామృతం..!

విషాదామృతం..!

మణిరత్నం, శంకర్ వంటి దర్శకులతో పని చేయడమంటే మన జర్నీ మళ్లీ మొదలుపెట్టినట్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్లకున్న...

పాటతత్వం - జూన్ 2 మణిరత్నం పుట్టినరోజు
మణిరత్నం, శంకర్ వంటి దర్శకులతో పని చేయడమంటే మన జర్నీ మళ్లీ మొదలుపెట్టినట్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్లకున్న అనుభవం అపారం. అలాంటి దర్శకులతో పనిచేయడమంటే మనల్ని మనం మళ్లీ అన్వేషించుకున్నట్లే. మణిరత్నం గారి ‘రావణ్’ సినిమా వరకూ వే టూరిగారే పాటలు రాశారు. కానీ, ఆ తర్వాత ఆయన మరణించడంతో, ‘కడలి’ సినిమా తెలుగు వెర్షన్‌లో అన్ని పాటలూ రాసే అవకాశం నాకు దక్కింది. స్ట్రెయిట్ చిత్రాల్లోని పాటలకున్న వెసులుబాటు డబ్బింగ్  పాటలకు ఉండదు. నా దృష్టిలో డబ్బింగ్ పాటంటే చెక్కిన శిల్పానికి రంగులు అద్దడం అని నా ఫీలింగ్.

ఇదే విషయాన్ని ఓ సందర్భంలో నా దగ్గర వేటూరిగారు ప్రస్తావిస్తూ- ‘‘డబ్బింగ్ పాట అనేది వేరే రచయిత మథనం నుంచి పుట్టింది. అతని భావాన్ని మార్చి, కొత్తగా రాయకూడదు’’ అని చెప్పారు. రాజశ్రీ గారి తర్వాత  డబ్బింగ్ పాటలను కూడా అచ్చ తెలుగు పాటల్లా పొదగడంలో వేటూరి గారిని మించిన వాళ్లు లేరు. మణిరత్నం-వేటూరిగార్లది అద్భుతమైన కాంబినేషన్. ‘బొంబాయి’ లోని ‘ఉరికే చిలుకా...’, సఖి చిత్రంలోని ‘స్నేహితుడా...’, ‘పచ్చందనమే...’లాంటి పాటలు వేటూరి గారు రాసిన అనేక మైన ఆణిముత్యాల్లాంటి పాటలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

మణిరత్నం దర్శకత్వంలో ‘కన్నత్తిళ్ ముత్తమిట్టాళ్’ అనే తమిళ చిత్రానికి అనువాద రూపంగా తెలుగులో విడుదలైన చిత్రం ‘అమృత’. తల్లిని వెతుక్కోవడానికి శ్రీలంక వెళ్లిన అమృత అనే చిన్నారి అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కొంటుంది. మరోవైపు తల్లిలాంటి దేశాన్ని వదలి వెళ్లిపోయే తమిళ  లంకేయుల మానసిక సంఘర్షణ... ఈ నేపథ్యంలో వచ్చే పాటని  హృదయం ద్రవించేలా తెరపై ఆవిష్కరించారు మణిరత్నం. తమిళంలో ‘విడై కొడు ఎంగళ్ నాడే...’ అంటూ తమిళ రచయిత వైరముత్తు గారు రాస్తే... తెలుగులో వేటూరి గారు ‘కడసారిది వీడ్కోలు...’  అంటూ ఈ పాటను ఇంకా అందంగా రాశారు.
 
‘‘కడసారిది వీడ్కోలు... కన్నీటితో మా చేవ్రాలు’’
 అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో పుట్టిన ఊరిని, మట్టిని బలవంతంగా వె ళ్లాల్సి వస్తే  అంతకు మించిన నరకం ఉండదు. దానికి తగ్గట్టుగా కడసారిది వీడ్కోలు... కన్నీళ్లతో చేస్తున్నాం మా సంతకాలు అంటూ ఆ బాధితుల మనోవేదన ను వర్ణించారు.
 తమిళ రచయిత వైరముత్తుగారు ‘‘ఉదట్టిల్ పున్నగై పుదైత్తోం... వుయిరై వుడంబుక్కుళ్ పుదైత్తోం’’ అని రాశారు. ‘‘ మా చిరునవ్వుల్ని పెదవుల్లో సమాధి చేశాం... మా ప్రాణాల్ని మా దేహంలో సమాధి చేశాం’’ అన్నది అర్థం. దీనిని యథాతథంగా కాకుండా ‘‘ఆశలు సమాధి చేస్తూ బంధాలు బలి చేస్తూ ప్రాణాలనే విడిచి సాగే పయనమిది’’ అంటూ  వేటూరిగారు ఇంకా సులువైన పదాలతో  తెలుగులో రాశారు.
 
‘‘తల్లి నేలనూ పల్లె సీమనీ విడతరమా
 ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా’’
 ఎన్ని కోట్లు సంపాదించినా సొంత ఊరిలో ఉన్నప్పుడు ఉండే సంతోషమే వేరు. తరతరాల నుంచి  సొంత ఊరినే ప్రపంచమనుకున్న ఆ ప్రజలకు నీడ కరువైతే పరిస్థితి మరీ దారుణం.
 ‘‘జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం....’’
 జన్మనిచ్చిన ఊరికి దూరంగా వేరే ప్రాంతానికి వె ళ్లిపోతూ తాము కన్ను మూసే దేశం ఏది అనే ప్రశ్న సూటిగా గుండెల్లో గుచ్చుకుంటుంది.
 
‘‘పాడే జోలలు ఏడ్పుల పాలైపోతే
 ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే’’
 సంగీతమనే జీవన రాగం పిల్లల ఏడుపుల్లో తప్పిపోయింది. ఉదయించే సూర్యుడే హింసకు సాక్ష్యంగా నిలిచిన పొగ చాటున కనుమరుగయ్యాడు.
 ‘‘పూలలోనా నిన్నటి నిదురా
 ముళ్లు కదా ఇప్పటి నడకా’’
 నిన్న రాత్రి వరకూ పూల మీద నడిచాం. కానీ బతుకు బండి తలకిందులైంది. మరి రేపు రాత్రి ఏ ముళ్ల మీద నడవాలి? అంటూ రాశారు.
 
‘‘ఉసురే మిగిలుంటే మరలా దరిచేరమా
 మనసే మిగిలుంటే ఒడిలో తలదాచమా’’
 ఓ అడవుల్లారా పువ్వుల్లారా... ప్రాణం మిగిలి ఉంటే మళ్లీ వస్తాం. సొంతూరితో మమేకమవుతామనేది ఆ వలస ప్రజల ఆకాంక్ష.
 ‘‘తలపే అల్పం... తపనే అధికం
 బరువెక్కిన హృదయంతో మోసుకెళ్లిపోతున్నాం’’
 సముద్రం మీద వలస పక్షులు తీరం చేరే దాకా ప్రయాణిస్తూనే ఉంటాయి.  ఆలోచన లు తక్కువే కావచ్చు. కానీ తపన మాత్రం అధికంగా ఉంటుంది. ఎన్నో ఆశలతో ప్రయాణిస్తాం. తలపై మోసే సామాన్ల బరువు  కన్నా మనసులో ఇంకా భారాన్ని మోస్తూ వెళిపోతున్నాం.
 
ఒక్కో భాషకు, ఒక్కో అందం ఉంటుంది. కొన్ని  భావాలను ఈజీగా మాతృకలో ఒక పదంలో చెబితే.. మనం కొన్నిసార్లు అనువాద భాషా రచయితలుగా ఎక్కువ లైన్లలో చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కొన్నిసార్లు లోతైన భావాలున్న పదాలు ఆ పాటలో పడకపోవచ్చు. అప్పుడే అనువాద రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మణిరత్నం- ఏఆర్ రె హమాన్ కాంబినేషన్‌లో పనిచేయడం ఓ అదృష్టం. ఎందుకంటే రచయితకు స్వేచ్ఛనిస్తారు. అందుకే  వేటూరిగారు అంత అద్భుతంగా మాతృకకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ పాటను రాశారు. అందుకే ఈ పాట ఎప్పటికీ అలా సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోతుంది.
సేకరణ: శశాంక్.బి
- వనమాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement