వేప చెట్టూ–పాదుకలూ

Saipatham antarvedam 39 - Sakshi

సాయిపథం – అంతర్వేదం 39

నాకు నా గురువు మంచి కథలని చెప్తూ ఉండేవాడు. ఆ కథల్లో బాగా నచ్చిన ఓ కథని చెప్తాను.  ఓ పండితుడైన రాజు దగ్గర మహావిద్వాంసుడొకాయన  ఆస్థానపండితునిగా ఉంటుండేవాడు. రోజూ ఇద్దరూ కాసేపు ఈ పాండిత్య చర్చ చేసుకుంటూ ఆనందిస్తూ ఉండేవాళ్లు. ఆ ఇద్దర్లో ఎవరికీ ‘నేనెక్కువ –నేనే ఎక్కువ...’ లాంటి అభిప్రాయమే ఉండేది కాదు. ఒకరోజున పండితుడైన రాజు ఆ విద్వాంసుడ్ని ‘‘అనన్యా శ్చింత యంతో మాం యే జనాః పర్యుపాసతే’’ ‘‘తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌’’ అనే శ్లోకానికి అర్థాన్ని చెప్పవలసిందని అడిగాడు. ‘విద్వాంసుడివైన నువ్వు నన్ను అడగడమేమిటి?’ అని పండితుడు ఒకటికి రెండుమార్లు అన్నప్పటికీ రాజు విడవలేదు. దాంతో పండితుడు చెప్పాడు. ఏ ఒక్కరూ నాకు దిక్కులేరనే సంపూర్ణ భావంతో ఎవరైతే నన్ను ఉపాసిస్తారో అలాంటివాళ్లకి లేనిదాన్ని అందిస్తూ – ఉన్నదాన్ని పోకుండా రక్షిస్తూ నిరంతరం వాళ్లను రక్షిస్తూ ఉంటాను’ అని భగవంతుడైన కృష్ణుడు చెప్పడం దీని భావమని. రాజు నవ్వుతూ – మన్నించాలి నన్ను పండితులవారు.. దీని భావాన్ని మీరు సరిగా చెప్పినట్లు లేదు. రేపటి రోజున ఆలోచించుకుని వచ్చి చెప్పండి’ అన్నాడు. మరునాడు ఆ మరునాడూ కూడా ఇదే ఇదే తీరుగా చెప్తే రాజుగారు మరో రోజు సమయం తీసుకోమంటూంటే... అర్థం కాని పండితుడు దిగాలుగా కూచున్నాడు ఇంట్లో.

భార్య కూడా విద్వాంసురాలు కావడమే కాక పండితపుత్రిక. దాంతో ఈ కథనంతా విని – అవును! మీకు ఆ శ్లోకం సరిగా అర్థం కాలేదు. ‘ఏ దిక్కూ లేరంటూ నన్నుపాసిస్తే అన్నీ ఆ దైవమే ఇస్తాడు’ అని గదా దానర్థం. మరి అదే నిజమని చెప్తూ ఉన్న మీరు ఆ రాజుగారి దివాణంలో కొలువు చేస్తూ ఆయనిచ్చేది తీసుకుంటూ ఉంటే ఆ శ్లోకభావం మీకేం అర్థమైనట్లు?’ అంది. పండితునికి బుర్ర తిరిగిపోయింది.ఆనాటి నుండి తీవ్రంగా మంత్రమననాన్ని చేస్తూ రాజుగారి కొలువుకి వెళ్లడం మానేశాడు పండితుడు. పది పదిహేను రోజులకి రాజే స్వయంగా పండితుడి ఇంటికొచ్చి ఒక వంశం సుఖంగా జీవించేందుకు కావలసిన భూమిని దానం చేసేస్తూ – పండితుడా! మీకిప్పుడు ఆ శ్లోకం అర్థమైందన్నాట్ట. అంటే ఏమన్నమాట? కేవలం అర్థం తెలియడం కాదు– ఆచరణలో ఉండాలని కదా దానర్థం. ఈ రోజున ఎందరో ఇదే పద్ధతిలో ఉన్నారు. దేవుళ్లంతా ఒక్కటే అని పైకి అంటూ ఉండటం మళ్లీ దేవుళ్లని మారుస్తూ ఉండటం ‘కలిసిరాలేదు’ అనుకుంటూ. ఇది సరికాదు. నేను మంత్రించుకుంటూ ఉండే అల్లా నామాన్నే జపించవలసిందని ఎవరినీ కోరను. నీదైన రామ–కృష్ణ – ఈశ్వర – అంబా.... ఏదో ఒక నామాన్ని మాత్రమే జపించుకుంటూ ఉండవలసిందని కోరుతాను. కొందరు ఈ రహస్యం కూడా తెలియక నా నామజపాన్ని చేస్తూ కనిపిస్తారు. అదీ సరికాదు. నేనే ఆ దైవాన్ని జపిస్తూ ఉంటే వాళ్లెందుకు అర్థం చేసుకోలేరో తెలియదు. వారించినా ప్రయోజనం కనిపించలేదు.ఈ విషయం మీకు అర్థమయిందో లేదో తెలియదు. అర్థం కావాలనుకుంటూ చెప్పాను. విన్నారు కాబట్టి అర్థమయిందని నేననుకుంటాను. అర్థం కావాల్సింది ఇంకా ఉందని మీకనిపించినా లేక అర్థం అయినా సంతోషమే’ అని ముగించాడు సాయి.

నడిచి తిరుగుతూండే (జంగమాలు) వాటికి మాత్రమే కాదు స్థిరంగా ఉండే (స్థావరాలు) చెట్లూ ఇళ్లు కొండలూ.. ఇలాంటి వీటికి కూడా చిరకాలపు గుర్తింపు ఉండనే ఉంటుంది. ఆ దృష్టితో గనుక చూస్తే ఇలా ఉదయం విమానం మీద ఎగిరి సాయి దర్శనాన్ని చేసేసి.. మళ్లీ సాయంత్రానికి తిరుగు విమానంలో వెళ్లిపోయిన పక్షంలో షిర్డీలో కనిపించే ఆ వేపచెట్టూ దానికున్న గుర్తింపు ఆ పాదుకలూ వాటి వెనుక చరిత్ర తెలుసుకోగల సదవకాశం ఉండకపోవచ్చు గానీ.. తీరికగా వీలు చేసుకుని గనుక వస్తే.. వేపచెట్టు ముందు నిలబడి నాటి దృష్టితో గమనించగలిగితే ఆనందంతో తన్మయత్వంతో ఒళ్లంతా గగుర్పొడవటమే కాక మనసంతా చల్లబడిపోతుంది తన్మయత్వంతో. వివరించుకుంటూ వెళదాం... 

మౌనసాక్షి
ఈ వేపచెట్టుని కుగ్రామమైన షిర్డీలో ఎందరో ఎన్ని దశాబ్దాల నుండో చూస్తూ ఉన్నా ఆ వేప చెట్టుకి ఓ గుర్తింపు కలిగిన చూపు (దర్శనం) అనేది 1854లోనే ప్రారంభమైంది. అప్పుడే వేపచెట్టు ఎందరో పనులకోసం పొరుగు ప్రాంతాలకి వెళ్తూండే ఆ బాట పక్కగా ఉంటూ ఉండేది. ఆనాటి మార్గం కూడా గోతులు గొప్పులు రాళ్లు రప్పలతో ఉండేది. జీవిక కోసం ఆ సామాన్య ప్రజలు తమ తమ వృత్తికి సంబంధించిన పనిముట్లతో మధ్యాహ్న భోజనపు చద్దిమూటలతో పిల్లల్ని చంకలకెత్తుకుని అలా వెళ్తూ ఉండేవాళ్లు ఇదే వేపచెట్టు సాక్షిగా. ఈ రోజునైతే చుట్టూ భవంతులూ ఈ చెట్టు చుట్టూ జన సందోహం.. అప్పటి రోజుల గురించి చెప్పినా కూడా నమ్మవీల్లేనంతగా ఉండచ్చుగానీ, ఇది యథార్థం. అలాంటి ఆ నడబాట పక్కన దట్టంగా ఆకులతో నిటారుగా బలంగా ఉండేది ఈ వేపచెట్టు. ఇలా ఉండగా ఓ రోజున దానికింద కొత్తగా ఓ 16 సంవత్సరాల యువకుడు పద్మాసనంలో కూచుని కనిపించాడు. ఇటూ అటూ వెళ్తూ వస్తూన్న జనానికి ఆ రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య మాట్లాడుకోవడం కూడా ఓ తప్పుగానే ఉండేది కాబట్టి ఎవరూ అతడ్ని, అతడు ఎవర్నీ పలకరించకుండానే రోజులు వెళ్లిపోతూ ఉండేవి. బాగా మాసిన గుడ్డలో ఉన్న మణి, కొద్దిగా ఆ గుడ్డకున్న చిరుగుల్లో నుంచి కనిపిస్తున్నట్టుగా ఆ యౌవనవంతుడైన బాలుని ముఖంలో చెప్పలేని తేజస్సు, ఏదోతెలియని గొప్పదనం అతనిలో ఉన్నట్టూ అందరికీ అనిపిస్తూ ఉండేది గాని, ఎవరి జీవనపు పరుగుల్లో వాళ్లుండేవారు తప్ప ఇతడ్ని పట్టించుకున్న వాళ్లే లేరు.ఎప్పుడూ కళ్లు మూసుకుని తపస్సు చేసుకుంటున్న మహర్షిలా కనిపిస్తూ ఉండేవాడు. పోనీ! ఏ పగటివేళలోనో పద్మాసనం తపస్సూ అనుకుంటే ఆశ్చర్యం లేదు గానీ, షిర్డీకి పొరుగూరు పనులన్నీ ముగించుకుని రాత్రివేళ వస్తూ ఉండే జనులకు కూడా అదే చెట్టు కింద అదే జపంతో కనిపిస్తూ ఉండేవాడు ఈ యువకుడు. దాంతో జనంలో కదలిక ప్రారంభమైంది.

ఎవరితను? ఎక్కడి వాడు? ఎవరి సంతానం? ఎందుకొచ్చి ఉంటాడు? తిండెక్కడ? నిద్ర ఎక్కడ?... అనుకున్నారే గానీ ఎవరూ తమ ఇళ్లకి రమ్మని అనలేకపోయారు– ఇతను ఓ అపరిచితుడు కావడం వల్ల.ఒకసారి తీవ్ర వర్షం వచ్చింది. ఆ చెట్టు కిందే కనిపించాడు ఈ యువకుడు ఒళ్లంతా తడిసి కూడా. మరోసారి వెచ్చటి వేసవి గాడుపు. అయినా అక్కడే ఉన్నాడీ యువకుడు. ఇలాగే శీతాకాలంలోనూ గాలి దుమారాల్లో కూడా అదే చెట్టు కిందా అదే ధ్యానముద్రలో అదే పద్మాసనంలో కనిపిస్తూ ఉండేసరికి జనంలో ఓ చిన్న చర్చ ప్రారంభమైంది.ఇతనిది శరీరమేనా? ఇతనేమైనా ఓ యోగి జాతికి చెందిన వాడే అయ్యుండి మనిషిలా కనిపిస్తున్నాడా? అయినా ఆ శరీరంనిండా బురఖాలా కప్పుకున్న చొక్కాలాంటి (కఫనీ) వస్త్రమేమిటి? అసలు కత్తిరించుకోని శిరోజాలతో ఉన్న ఆ కేశాలేమిటి? స్నానం ఎక్కడ?... ఇలా సమాధానం తెలియవీల్లేని ప్రశ్నలు మరిన్ని అయ్యేసరికి అతడ్నే అడిగారు కొందరు.. రోజూ చూస్తూన్న కారణంగా పరిచయమైనట్లుగా భావించి.తనది కబీరు మతమనీ, తన తండ్రి పేరు సాయిబాబా అనీ, తన వయసు కొన్ని యుగాల సంఖ్య అనీ, తన ఊరు బ్రహ్మలోకమనీ చెప్పేసరికి, జనమంతా అనుకున్నారు– ‘ఇతడ్ని ఏమీ అడగకుండా ఉంటే బాగుండేదేమో’ అని. కొందరికి ఏదో అర్థమైనట్లు అనుకున్నారు.కొందరేదో తెలియనితనంతో ఉండిపోయారు. అయితే అందరూ కలిసి తేల్చిందేమంటే– ఇతడొక ఫకీరు. పిచ్చివాడు– తిండీతిప్పలూ లేకున్నా ఉండే గూడూ (ఇల్లు) నిద్రా లేకున్నా జీవించగల ఓ గోసాయి(ప్రపంచాన్ని విడిచేసిన విరక్తుడు/సన్యాసి) అనీను. 16 సంవత్సరాల యౌవనదశలో ఇలా ఉండగలగడం అన్నికాలాలనూ తట్టుకుంటూ రాత్రింబవళ్లూ వేప చెట్టు(చిన్న ఆకులు కల చెట్టు కారణంగా పెద్ద నీడనియ్యలేనిది – పుష్పాలనీ ఫలాలనీ ఆహారంగా ఇయ్యలేనిది) కిందే ఉండగలగడం కారణంగా ఇతనిలో ఏదో శక్తి ఉందని మాత్రం భావించారు అందరూ.

కొందరు దూరం నుండి దణ్ణం పెట్టుకోవడం ఆరంభించారు. కొందరు గౌరవంతో తలదించుకుని భక్తి ప్రపత్తులతో వెళ్లిపోసాగారు. ఇంకొందరు నమస్కరిస్తూ కాసేపు నిలబడి వెళ్లిపోవడం చేయసాగారు.ఒకరోజున ఓ పేదరాలు తన కూతురు వ్యాధితో బాధపడుతూంటే ఏ దిక్కూ తోచక సాయి దగ్గరకొచ్చి ఆయనకి తన పిల్ల బాధపడుతూ ఉన్న వ్యాధిని గురించి వివరించి చెప్పింది. నోరు ఏ మాత్రమూ మెదపకుండా సాయి అలా లేచి కొంత దూరం వెళ్లి పిచ్చిపిచ్చిగా ఎత్తుగా పెరిగిన మొక్కల మధ్య పరిశీలించి ఓ మొక్క ఆకుల్ని తెచ్చి గట్టిగా రెండు అరచేతుల మూలలమీదా నొక్కి మర్దించి పసరుని ఆ పిల్ల నోటిలో పోశాడు.మర్నాడు ఆమె ఎంతో ఆనందంగా పిల్లని తీసుకొచ్చి పాదాల మీద ఉంచి తానూ పాదాభివందనం చేసింది. ఇంకేముంది? ఈ ఫకీరు గొప్ప హకీం (ఆకులూ అలములతో రోగాన్ని నయం చేయగల వైద్యుడు) అనే పేరు వ్యాపించేసింది. దాంతో వరుసలో వ్యాధిగ్రస్తులంతా రావడం మొదలెట్టారు. మనం దానిముందు నిలబడి ఈ చరిత్రని నెమరేసుకుంటూ ఉంటే మౌనంగా వింటోంది వేపచెట్టు!

ఇదేమిటి? ఆశ్చర్యం?
ఇలా సాయి దగ్గరికి జనం తండోపతండాలుగా వస్తూ ఉంటే సాయి ఓ రోజున దగ్గర్లోని గ్రామమైన ‘రహతా’కి వెళ్లి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కల్ని తెచ్చాడు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎవరికైనా చెప్పాల్సిన అవసరమేముంది? పైగా ఎవరాయనకి అంత పరిచయం ఉన్నవాళ్లు గనుక? ఇలా మొక్కల్ని తేవడానికి ముందే సాయి అక్కడున్న రాళ్లని రప్పల్నీ తొలగించి నేలని చదును చేసి దగ్గర్లో ఉన్న బావి నీటితో ఆ ప్రదేశాన్ని మొక్కలు పెరిగే విధంగా పదును చేశాడు. చేదబావి దగ్గర ఉండేది గాని, మొక్కలకి నీళ్లు పోయడానికి ఏ పాత్రా ఉండేది కాదు సాయికి.ఈ స్థితిని గమనించిన తాత్యా (వామన్‌ తాత్యా) అదే కుమ్మరి (కుండల్ని చేసే వృత్తి కలవాడు) రోజూ సాయికి రెండు కాల్చని కుండలని (పచ్చి కుండలు) ఇస్తూండేవాడు. సాయి ఆ పచ్చి కుండలతో నీటిని తెచ్చి తాను రహతా నుండి తెచ్చిన మొక్కలకి స్వయంగా నీళ్లు పోస్తూ ఉండేవాడు.

పచ్చికుండలేమిటి? నీటిబరువుతో ఉన్న పచ్చికుండలని భుజానపెట్టుకున్నా కూడా విచ్చిపోకుండా ఉండటమేమిటి? అని అంతా ఆశ్చర్యపడుతూ ఈ సాయి సామాన్యుడు కాడనే దృఢనిర్ణయానికి ఏకగ్రీవంగా వచ్చేశారు. దాంతో సాయికి పేరు ప్రతిష్టా పెరిగిపోసాగింది. చిత్రమేమంటే అలా రోజూ తెచ్చిన పచ్చికుండలతో నీళ్లు పోయడం ముగించాక సాయి ఆ కుండల్ని తిరిగి తాత్యాకి ఆములో (కుండల్ని కాల్చే బట్టీ) వేసుకునేందుకు వీలుగా ఇచ్చేవాడు కాడు. వాటిని ఈ వేపచెట్టు మొదట్లోనే బోర్లించి పెట్టేవాడు. ఆ నీటి తడి కారణంగా అవి విచ్చిపోయి మట్టిపెళ్లలుగా అయిపోతూ ఉండేవి. ఇలా రోజూ పూలమొక్కల్ని స్వయంగా నీరు పోసి పెంచుతూ ఉండటంతో మొక్కలు పెద్దవై ఓ తోటగా కనిపించసాగింది జనులకి. దానికి సాయి ‘లెండీ’ తోట అని పేరు పెట్టాడు– ఎంతో మురిపెంగా చూసుకోసాగాడు. ఇలా క్రమక్రమంగా సాయి కీర్తీ ప్రతిష్ఠా పెరిగిపోతుండేసరికి అందరికీ అసలు ‘ఈ సాయి ఎవరు? వివరాలేమిటి?’ అనే ఆలోచన మరింతగా పెరిగి ఓ రోజున ఆ గ్రామదేవత అయిన ‘ఖండోబా’ దేవాలయానికి వెళ్లారు.సహజంగా ఏవైనా అనుమానాలు షిర్డీ ప్రజలకి గాని ఉన్న పక్షంలో ఆ గ్రామదేవత ఆలయంలో ఎవరికో ఒకరికి పూనకం వచ్చిన సమయంలో ఆ పూనిన వ్యక్తిని అడుగుతూ ఉండేవారు సందేహనివృత్తికి. అలా ఈ సాయి గురించి అడగ్గానే ఆ వ్యక్తి చెప్పాడు– గునపాన్ని (గడ్డపార– పలుగు) తేవలసిందని ఆజ్ఞాపించి ఆ నేలని తవ్వించి అక్కడ అడ్డుగా ఉన్న పెద్ద రాతిని తొలగించి ఇంకా వెలుగుతున్న దీపాలనీ జపమాలలనీ... ఇలా (లోగడ అనుకున్నాం కదా!) అందరికీ కనిపించేలా చేశాడు. దాంతో అందరికీ అర్థమైంది. సాయి సామాన్యుడు కాడనీ తీవ్రంగా తపస్సు చేసినవాడేననీ– అది కూడా 12 సంవత్సరాల పాటు అనీను. అప్పుడు ఆ సంఘటనని నిజమేనని దృఢం చేస్తూ సాయి కూడా ఆ ప్రదేశాన్ని తెరిచి ఉంచకూడదనీ దాన్ని గురుస్థానంగా భావిస్తూ ఎవరూ ప్రవేశించరాదనీ చెప్తూ ఆ ప్రదేశం తన గురుస్థానం (తన గురువు తపస్సు చేసిన చోటు అని అందరూ భ్రమపడేలాగా) అని అందరూ నమ్మేలా చెప్పి దగ్గరుండి ఆ స్థానాన్ని మూయించేసాడు.

చెట్టు కింద తపస్సా?
ఇలా ఆ చెట్టునే తన నివాసస్థలంగా భావిస్తూ ఉన్న సాయి మూడేళ్లపాటే అక్కడుంటూ తపస్సు చేసుకుంటూ కాలాన్ని గడిపాడు. ఈ విషయాన్ని వింటూ ఉంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మహర్షులంతా ఏవో పర్ణశాలల్ని కట్టుకుని తపస్సులు చేసుకున్నారు. రాముడంతటి వాడు కూడా లక్ష్మణునితో పర్ణశాలని వేయించుకుని తపస్సు చేసుకుంటే ఈ సాయి మాత్రమే ఎందుకిలా చెట్టునే ఆశ్రయించుకుని తపస్సు చేశాడు? అనే అనుమానం వస్తుంది మనకి. పోనీ! అలాగే ఇప్పుడు కూడా ఏ వేపచెట్టుకిందో కూర్చుని ఎవరైనా తపస్సు –జపం– ధ్యానం గానీ చేసుకుంటూ కనిపిస్తున్నారా? అంటే అది లేనేలేదు కదా! అనిపిస్తుంది కూడా. పైగా ఈ రోజున ఈ చెట్టు చుట్టూ భవంతుల సమూహం కదా కనిపిస్తోంది! మరి ఏ ప్రాచీనమైన కట్టడమూ లేదు కదా తపస్సు చేసుకునేందుకు!ఇలా ఆలోచిస్తే ఆ చెట్టు గొప్పదనం మనకి తెలియదు. కారణం మరోటుంది. అసలు చెట్టుకీ తపస్సులకీ సంబంధం ఉంది. అందుకే ఏ మహర్షిని చూసినా చెట్టుతో సంబంధం ఉన్నవారుగానే కనిపిస్తారు ఎక్కువ సందర్భాల్లో. ఏ పురాణాన్ని వినబోయినా ‘సూతుడు శౌనకాది మహర్షులకి ఇలా చెప్పాడు... అంటూ ప్రారంభమవుతుంది. ఆ స్థలాన్ని వర్ణిస్తూ – పక్కనే సరస్వతీ నది ప్రవహిస్తోందనీ, సూతుడు పెద్దదైన వటవృక్షం కింద కూర్చుని చక్కని ఓ అరుగుని వేదికగా చేసుకుని చెప్తున్నాడనీ కనిపిస్తుంది.
 
ఎందుకు చెట్టుని ఆశ్రయించాలి మహర్షులు?
చెట్టుకి వేళ్లుంటాయి. అవి దాటి గొప్పదనం తెలిసినవారికి ఔషధులుగా పనిచేస్తాయి. చెట్టుకి కాండం (మాను) ఉంటుంది. అది పశువులని బంధించడానికీ ఆ చెట్టుని ఆశ్రయించి ఉండేందుకు చెట్టునెక్కాలి కాబట్టి, కోతులకీ ఇతరమైన ఉడుతలూ మొదలైన అల్ప ప్రాణులకీ నిచ్చెనలాగా ప్రయోజనపడుతుంది. చెట్టుకుండే కొమ్మలు పక్షులకి ఇళ్లుగా ఉండే గూళ్లుగా వ్రేలాడేందుకు పనికొస్తాయి. చెట్టు ఆకులు కొన్నైతే ఔషధులుగా కొన్ని పువ్వులయితే స్త్రీల కొప్పుల్లో అలంకారాలుగా లేదా ఆహారపదార్థాలుగా పనికొస్తాయి. ఇక పిందెలూ కాయలూ పళ్లూ గురించి చెప్పవలసిందేముంది? వ్యక్తులకీ పక్షులకీ... ఇలా ఎన్నో ప్రాణులకి తినుబండారాలుగా ఉంటాయి. ఇవన్నీ చెట్టు జీవించి ఉన్న కాలంలో కనిపించే ప్రయోజనాలు అవుతూ ఉంటే, చెట్టనేది తాను మరణించాక కూడా వంటచెరకుగా ప్రయోజనాన్ని మనకి కలుగజేస్తుంది. కాబట్టి అలాంటి చెట్టు కింద తపస్సుగాని చేసుకుంటూ ఉన్నట్లయితే.. అదే తీరు పరోపకార లక్షణం ఆ కింద తపస్సు చేసుకునే ఉదారులక్కూడా లభిస్తుందనేది వారి ఉద్దేశం. ఇది నిజం కాబట్టే శ్రీమద్రామాయణంలో సీతమ్మ కూడా అయోధ్యని వీడి వెళ్తూ కొన్ని వృక్షాలకి నమస్కరించి మాత్రమే వెళ్తూ తిరిగి వచ్చింతర్వాత ఆ చెట్టుని గౌరవిస్తానంటూ పలికిందని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో వివరించాడు. అంతేకాదు. శ్రీరామచంద్రుడ్ని గురించి వర్ణిస్తూ వాలికి భార్య అయిన తార– నివాసవృక్ష స్యాధూనా మాపన్నానాం పరా గతిః ఆర్తానాం సంశ్రయశ్చైవ యశస శ్చైక భాజనమేరామచంద్రుడు సత్పురుషులైన అందరికీ నిరంతరం నివసించే ఇంటిలాంటివాడు. ఆపదల్లో ఉన్నవారికి ఎనలేని దిక్కు. ఆర్తులైనవారికి ఆశ్రయమిచ్చే సర్వరక్షకుడు. అన్ని విధానాలని గురించిన కీర్తులనీ మూటగట్టుకుని కనిపించే సర్వైక (ఏకైక అనకూడదు) మూర్తి ఆయన అంది.      
– సశేషం
డా. మైలవరపు శ్రీనివాసరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top