చివరకు మిగిలింది

Nand Gopal smiled on the face - Sakshi

కొత్త కథలోళ్లు

ఉత్తరీయం సర్దుకుంటూ రైలుదిగాడు నందగోపాల్‌. ఆయనకు యాభై సంవత్సరాలు పైనే ఉంటాయి. రైలు దిగిన ప్రయాణికులు ఆటోలు ఎక్కుతున్నారు.‘‘ఎక్కడికి వెళ్లాలి సార్‌?’’ ఒక ఆటో అతను అడిగాడు.‘‘పాలెం’’ చెప్పాడు నందగోపాల్‌.‘‘రామమందిరం సెంటర్‌ వరకూ వెళుతుందండీ! ఊళ్లోకి ఆటోలు రావు’’ అన్నాడు.‘‘సరే’’ అని బ్యాగ్‌ లోపల పెట్టి కూర్చున్నాడు నందగోపాల్‌.స్టేషన్‌ బయట ఉన్న చిన్న చిన్న కాకా హోటళ్ళు, వచ్చే పోయే జనాన్ని చూస్తూ ఉన్నాడు నందగోపాల్‌. తను ఊరు వదలి వెళ్ళి పాతికేళ్ళు అయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పుట్టిపెరిగిన ఊరిని చూస్తున్నాడు. ఊరు చాలా మారిపోయింది.‘‘రామమందిరం సెంటర్‌ వచ్చిందండీ’’ ఆటో అతను చెప్పాడు. అతనికి డబ్బిచ్చి కిందికి దిగాడు నందగోపాల్‌.ఆలోచిస్తూ చిన్నగా నడుస్తున్నాడు. అదే కరణంగారి ఇల్లు! తన చిన్నప్పుడు కరణంగారి ఇల్లే పోస్టాఫీసు, తనకి ఆరేడు ఏళ్ళ వయసు ఉంటుంది.

‘‘మా నాన్న ఇంగ్లాండు కవర్‌ తెమ్మన్నారండీ!’’ అని అడిగేవాడు.కరణంగారి భార్య లలితాసహస్రనామం చదువుకుంటూ పూజగదిలో నుంచి వచ్చి చదవటం ఆపకుండానే కిటికీ వైపు రమ్మని సైగ చేసేది. పోస్టాఫీసుగా వాడుకుంటున్న గది కిటికీలో నుంచి కవర్‌ అందించేది.వరండాలో ఉయ్యాల బల్ల మీద కూర్చొని సన్నజాజిపూల దండ గుచ్చుతున్న కరణంగారి అమ్మాయి–‘‘ఇంగ్లాండు కవర్‌ కావాలా! అమెరికా కవర్‌ వద్దా!’’ అని ఫక్కున నవ్వేది.నందగోపాల్‌ ముఖం మీద చిరునవ్వు కదిలింది. ఆ ఇల్లు దాటి వచ్చాడు. అదిగో! ఆ ఖాళీ స్థలంలోనే అట్లతద్దికి ఉయ్యాల కట్టేవారు. అమ్మాయిలందరూ ఉయ్యాల చుట్టూ చేరి   ఊగేవారు. నందగోపాల్‌కి కూడా ఉయ్యాల ఊగాలని కోరికగా ఉండేది. అమ్మతో చెబితే ‘‘ఆడపిల్లలు ఆడే ఆటలు మగపిల్లలు ఆడకూడదు. అందరూ నవ్వుతారు’’ అనేది.‘‘అంటే మగపిల్లాడిగా పుట్టినందుకు ఈ జన్మలో ఉయ్యాల ఎక్కకూడదా! ఆ అనుభూతి తెలుసుకోవాలంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందేనా! అప్పుడు కూడా మగవాడిగానే పుడితే ఎలా?’’ ఇలా రకరకాల ఆలోచనలు వచ్చేవి నందగోపాల్‌కి.ఒకసారి తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ అన్న రాజగోపాల్‌కి చెప్పాడు.

రాజగోపాల్‌ తనకన్నా మూడేళ్ళు పెద్ద. తమ్ముడు చెప్పింది విని ‘‘ఓస్‌! అంతేనా! నేను రోజూ స్కూల్‌కి వెళ్లే దారిలో పిల్లలపార్కు ఉంది. అందులో ఆడాళ్ళు, మగాళ్ళు అందరూ  ఊగుతారు. రేపు సాయంత్రం నిన్ను కూడా తీసుకువెళతాను. ఆడుకోవచ్చు’’ అన్నాడు రాజగోపాల్‌. నందగోపాల్‌ మనసు ఆనందతరంగిణి అయింది.ఆదివారం సాయంత్రం చీకటి పడే వరకు  పార్కులో ఆడుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. నందగోపాల్‌ అలిసిపోయి నిద్రలో తూలిపోతుంటే తమ్ముడి భుజం చుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకుని, ‘‘అదిగో! ఆ కనిపించే తాటిచెట్లు దాటి నాలుగు అడుగులు వేస్తే  మన ఊరు వచ్చేస్తుంది. నిద్రపోకు, మేలుకో’’ అంటూ బుజ్జగిస్తూ నడిపించేవాడు రాజగోపాల్‌.తనను అంత ప్రేమగా చూసిన అన్నయ్యను పాతికేళ్ళ తర్వాత ఇప్పుడు నిర్జీవంగా చూడబోతున్నాడు. అన్న కొడుకు కళ్యాణ్‌ నిన్న ఫోన్‌ చేసి చెప్పాడు. ఉన్న పళాన బయలుదేరాడు తను. కొద్దిదూరంలో టెంట్‌ వేసి కనబడుతుంది. దగ్గరకు వస్తున్నకొద్దీ నందగోపాల్‌  గుండె వేగంగా కొట్టుకోసాగింది.దూరం నుంచి నడచి వస్తున్న ఈ కొత్తమనిషి వంక అందరూ తలతిప్పి చూడసాగారు.

నందగోపాల్‌ టెంట్‌ దగ్గరకు వచ్చాడు. ఎవరూ మాట్లాడలేదు. ఏం అడగాలో తోచలేదు. ఇంతలో ఏదో పని మీద అటుగా వచ్చిన కళ్యాణ్, నందగోపాల్‌ని చూసి ‘‘రా బాబాయ్‌! ఇల్లు తెలిసిందా!’’ అంటూ చేతిలో బ్యాగు అందుకున్నాడు.రాజగోపాల్‌ని మార్చురీబాక్సులో పడుకోబెట్టారు.నందగోపాల్‌ అన్న మొహం వంక తదేకంగా చూశాడు. ఈయనని చూసి, మాట్లాడి ఇరవై అయిదేళ్ళు అయింది. అక్కడక్కడ నాలుగైదు నల్లవెంట్రుకలు తప్ప తలంతా నెరిసిపోయింది. పెదవులు నల్లగా ఉన్నాయి. మొహంలో జీవకళ లేదు. నందగోపాల్‌ గుండెలో నుంచి సన్నటి బాధ మెలితిరిగి కన్నీళ్ల రూపంలో బయటికివచ్చింది.కళ్యాణ్‌ గభాలున ఆయన్ని పట్టుకుంటూ ‘‘ఇలా రా బాబాయ్‌!’’ అని లోపల ఒక గదిలో కూర్చోబెట్టి ‘‘లక్ష్మీ! తాతయ్య దగ్గర కూర్చో! పెద్దతాతయ్య మనవరాలు బాబాయ్‌!’’ అని చెప్పి అవతలకి వెళ్లాడు.నందగోపాల్‌ పడక్కుర్చీలో వెనక్కి వాలాడు. ‘‘ఈ అమ్మాయి పెద్దక్క మనవరాలా! తననెప్పుడూ ఇంతక్రితం చూడలేదు’’ అనుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా ఈ తాతయ్య ఎవరో తెలియదు. ముళ్ళమీద కూర్చునట్లు కూర్చుంది.

అది గమనించి ‘‘నాకేమీ ఫర్వాలేదు. నువ్వెళ్ళమ్మా!’’ అన్నాడు. అన్నదే తడవుగా ‘‘బతుకు జీవుడా’’ అన్నట్లు ఆ అమ్మాయి లేచి వెళ్ళిపోయింది.నందగోపాల్‌కి అన్న గుర్తుకు వచ్చాడు.రాజగోపాల్‌కి పెళ్ళయి చిన్నవదిన కొత్త కుటుంబసభ్యురాలిగా వచ్చినప్పుడు నందగోపాల్‌ ఎంతో సంతోషించాడు. వదినతో పాటు వదిన తల్లి కూడా ‘ఒక్కగానొక్క కూతురిని వదలి ఉండలేను’ అని ఇక్కడే తిష్ట వేసింది. ఆమె దుర్బోధల వల్ల కుటుంబంలో కలతలు మొదలైనాయి. రాజగోపాల్, నందగోపాల్‌ మధ్య ఎడం పెరిగింది. రాజగోపాల్‌కి ఇద్దరు పిల్లలు పుట్టినా వాళ్లని వదిన ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకుంటూ మిగిలిన కుటుంబసభ్యులకు చేరువకానీయలేదు.ఆరోజు నందగోపాల్‌కి బాగా గుర్తు. అప్పటికి కళ్యాణ్‌కి ఏడేళ్లు, వాడి తమ్ముడికి మూడేళ్లు. నందగోపాల్‌ వసుంధరని ప్రేమించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. తండ్రి పోయాడని తెలిసి నందగోపాల్‌ వచ్చాడు. అన్నలిద్దరూ ఆస్తి చెరిసగం పంచుకుంటున్నారు. ‘‘నందూ తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఇంట్లో నుంచి వెళ్లిపోయి నాన్నగారిని ఎంతో బాధ పెట్టాడు.

అలాంటి వాడికి వాటా ఎలా ఇస్తాం?’’ అన్నాడు రాజగోపాల్‌. ‘‘అవునవును’’ అన్నాడు పెద్దన్నయ్య.‘‘మీ ఇద్దరివీ పెద్ద చదువులు, గవర్నమెంట్‌ ఉద్యోగాలు. నాది చిన్న చదువు, ప్రైవేట్‌ ఉద్యోగం. ఏ ఆధారం లేకుండా ఎలా బతకను?’’ అన్నాడు నందగోపాల్‌.‘‘నీ గురించిన మనోవ్యథతోనే నాన్నగారు పోయారు. తండ్రిని చంపిన వెధవ్వి. ఆస్తి అడగడానికి సిగ్గు లేదూ’’ అన్నాడు చిన్నన్నయ్య.‘‘మీరిద్దరూ ఎంత స్వార్థపరులో నాకు తెలియదా! నేను కాదు, మీ మూలంగానే నాన్న పోయి ఉంటారు’’ అన్నాడు నందగోపాల్‌.అంతే! అన్నలిద్దరూ అతని మీద పడి కొట్టారు. తల్లి ఏడుస్తూ అడ్డు వచ్చింది. ‘‘నందూ! నీకు దణ్ణం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్లిపోరా! మీరందరూ కొట్టుకుంటుంటే నేను చూడలేను. వెళ్లిపోరా’’ రెండు చేతులు జోడించి బావురుమంది.నందగోపాల్‌ వెర్రివాడిలా ఒక్కక్షణం తల్లి వంక చూశాడు. మరుక్షణం విసురుగా వెళ్లిపోయాడు. దెబ్బలు శరీరానికి తగిలాయిగానీ గాయం గుండెలో అయింది నందగోపాల్‌కి. ఎన్నిరోజులైనా ఆ గాయం మానలేదు. మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లలేదు.సంవత్సరాలు గడిచిపోయాయి.

నందగోపాల్‌కి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. అతనికి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, ఎలాగైనా నాది అనే ఒక స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని. అన్నలు తన వాటా ఇచ్చినట్లయితే ఎప్పుడో ఏర్పాటు చేసుకునేవాడు. ఆ విషయం గుర్తుకు రాగానే నందగోపాల్‌  మనసు వికలమయ్యేది.కొడుకు, కూతురు పెద్దయ్యారు. కొడుకు ఉద్యోగం రాగానే లోన్‌ తీసుకొని ఇల్లు కట్టాడు. కొంతకాలం తరువాత...కళ్యాణ్‌ దగ్గరి నుంచి ఫోన్‌ వచ్చింది రాజగోపాల్‌ చనిపోయాడని. తన అడ్రస్‌ కోసం ఎంతో ప్రయత్నించాడట. ఇరవై అయిదేళ్ల క్రితం ఉన్న పంతం, పట్టుదల ఇప్పుడు లేదు నందగోపాల్‌లో. అన్న చేసిన అవమానం గుర్తొచ్చినా ఆవేశం రావడం లేదు. చిన్నప్పుడు తనని పార్క్‌కి తీసుకువెళ్లి నిద్రలో తూలుతుంటే బుజ్జగిస్తూ నడిపించిన అన్న గుర్తొస్తున్నాడు. తనకు అర్థం కాని లెక్కలు వివరించి, పరీక్ష పాసయ్యేటట్లు చేసిన అన్న గుర్తొస్తున్నాడు. అందుకే చివరిసారిగా చూడడం కోసం అక్కడికి వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు.‘‘మిమ్మల్ని రమ్మంటున్నారు’’ ఒక కుర్రాడు వచ్చి చెప్పాడు.

పడక్కుర్చీలో పడుకుని ఆలోచనలో మునిపోయిన నందగోపాల్‌  ఉలిక్కిపడి కళ్లు  తెరిచాడు. లేచి, ఆ గదిలో నుంచి బయటకు వచ్చాడు. రాజగోపాల్‌ని సాగనంపడానికి సిద్ధం చేశారు.నడుము వంగిపోయి, శరీరం ముడతలు పడిపోయి ఉన్న తల్లి భోరున ఏడుస్తోంది. ఆడవాళ్లు ఆమెను గట్టిగా పట్టుకున్నారు.అన్నను చూస్తున్న కొద్దీ నందగోపాల్‌ మనసు పరిపరివిధాల పోతుంది. ఒంట్లో ఓపికున్నంత వరకు మన కన్నా గొప్పవాడు లేడన్నట్లు విర్రవీగుతాము. రాజగోపాల్‌ కూడా అదే చేశాడు. తనను కట్టుబట్టలతో వెళ్లగొట్టాడు. చిల్లిగవ్వ కూడా దక్కకుండా చేశాడు. నిలువ నీడ లేకుండా చేశాడు.ఈ పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఇంటికి రమ్మని అనలేదు.ఎన్ని పండగలు, ఎన్ని సంబరాలు చేసుకున్నారు? ఒక్కదానికైనా పిలవలేదు. ఆఖరికి పెద్దన్నయ్య, పెద్ద వదిన పోయినప్పుడు కూడా తనకు తెలియజేయనీయలేదు. తర్వాతెప్పుడో తెలిసింది.అంత కఠినంగా ఉండాల్సిన తప్పు తనేం చేశాడు?చివరకు ఏంమిగిలింది? తగాదాలకు కారణమైన నేల అలాగే ఉంది, మనుషులే లేకుండా పోయారు. అనుబంధాలు పోయాయి.

ఆనందాలు పోయాయి.రాజగోపాల్‌ మీద మట్టి కప్పుతూ ఉంటే చూడలేకపోయాడు నందగోపాల్‌. ఇవతలకు వచ్చాడు. అతని మనసు దీనంగా, విషాదంగా అయింది. కార్యక్రమం ముగిసిన తరువాత అందరూ స్నానాలు చేసి ఇంటికి వచ్చారు. అన్న జ్ఞాపకచిహ్నంగా ఉంచిన దీపానికి నమస్కరించాడు.లోపల గదిలో తల్లి మంచం మీద కూర్చొని ఉన్నది. నందగోపాల్‌ తల్లి పక్కనే కూర్చొని ‘‘నేనమ్మా, నందూని’’ అన్నాడు.ముడతలు పడిన చేతులతో కొడుకుని తడిమి, తడిమి చూసుకుంది ఆ తల్లి. కన్నీళ్ళు పెట్టుకుంది. గతాన్ని గుర్తు తెచ్చుకొని నందగోపాల్‌ చిన్నప్పటి విషయాలన్నీ చెప్పింది. తల్లి చెప్పేవన్నీ వింటూ మౌనంగా కూర్చున్నాడు నందగోపాల్‌.ఆ మర్నాడు నందగోపాల్‌ భార్య,కొడుకు, కూతురు కారులో వచ్చారు. అతనికి ముందురోజు సెలవు దొరకలేదు. నందగోపాల్‌ రైలులో వాళ్లకన్నా ముందే వచ్చేశాడు.‘‘మీ అన్నయ్యరా బుజ్జీ’’ కొడుకుకి కళ్యాణ్‌ని పరిచయం చేశాడు. కళ్యాణ్‌ తమ్ముడి భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకున్నాడు. పిన్నిని, చెల్లెల్ని కూడా ఎంతో ఆదరంగా చూశాడు.

మూడు రోజులు గడిచిపోయాయి. వచ్చిన బంధువులందరూ దాదాపుగా వెళ్లిపోయారు.‘‘బాబాయ్‌! నాన్న, పెదనాన్న నీకు చేసిన అన్యాయం తెలిసింది. వాళ్లు చేసిన అన్యాయం సరిదిద్ది నీ వాటా స్థలం, పొలం నీకు అప్పగించాలని ఇన్నాళ్ళూ ఎదురుచూశాను. ఇవిగో కాగితాలు’’ అందించబోయాడు కళ్యాణ్‌.నందగోపాల్‌ అందుకోలేదు.‘‘ఇప్పుడీ ఆస్తితో నాకు పనిలేదురా కళ్యాణ్‌! కష్టాలు పడాల్సిన రోజులన్నీ అయిపోయాయి. భగవంతుడి దయవల్ల నా బిడ్డలిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు. నన్ను కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఈ స్థలం, నా వంతు పొలం నువ్వు, అన్నయ్య పిల్లలు సమానంగా తీసుకోండి’’ అన్నాడు.కళ్యాణ్‌ మనసు మూగబోయినట్లయింది‘‘నా మాటగా ఒక్క విషయం గుర్తుంచుకో కళ్యాణ్‌! అన్నయ్య పిల్లలు, నా పిల్లలు, మీరిద్దరు అందరూ కలసిమెలసి ఉండండి. అకారణ వైరాలతో ద్వేషం పెంచుకోకండి. ఆస్తి తగాదాలు, చెప్పుడు మాటలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. మనుషుల మధ్య ఆగాధాలు పెంచుతాయి. మీ తరంలోనైనా తోడబుట్టిన వాళ్లందరూ కలసి మెలసి ఉంటూ ఆనందంగా జీవించండి.

ఇన్నాళ్లు అమ్మకి నేను చేసింది ఏమీలేదు. అమ్మని నాతో పాటు తీసుకువెళతాను. కొద్దిరోజులైనా ఆమెకు సేవ చేసి కొడుకుగా నా రుణం తీర్చుకుంటాను’’ అన్నాడు నందగోపాల్‌.‘‘అలాగే బాబాయ్‌! మేమెప్పుడూ తగాదాలు పడము. నువ్వు చెప్పినట్లే చేస్తాం’’ అన్నాడు కళ్యాణ్‌. కళ్యాణ్, కొడుకు పక్కపక్కన కూర్చొని తన మాటలు శ్రద్ధగా వినటం చూసి చాలా ఆనందంగా అనిపించింది నందగోపాల్‌కి.భోజనాలు అయిన తరువాత నందగోపాల్‌ వాళ్లు బయలుదేరారు. డ్రైవింగ్‌ సీట్లో కొడుకు, పక్కనే కూతురు కూర్చున్నారు. వెనకసీట్లో మధ్యలో తల్లిని కూర్చోబెట్టుకొని చెరొక పక్కన నందగోపాల్, వసుంధర కూర్చున్నారు. కారు బయలుదేరింది.కళ్యాణ్, అతని భార్య, తమ్ముడు వాకిలి దాకా వచ్చారు. కారు కనుమరుగు అయ్యేదాకా అలాగే చూస్తూ నిలబడిపోయారు.         
గోనుగుంట మురళీకృష్ణ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top