ఏ కారణం వల్ల  ఆ సమస్యతో పుడతారు?

Fundy health counseling - Sakshi

సందేహం

నేను ప్రెగ్నెంట్‌. నా వయసు 27. మొన్న ఒకరోజు మా దూరపు బంధువుల ఇంటికి వెళ్లాను. ఆ ఇంట్లో ఆటిజం ఉన్న ఒక అమ్మాయిని చూశాను. చాలా బాధగా అనిపించింది. ఆమెని చూసినప్పటి నుంచి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. నాకు పుట్టబోయే శిశువుకి ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందేమోనని చాలా భయంగా ఉంది. ఏ కారణాల వల్ల పిల్లలు ఆటిజం సమస్యతో పుడతారు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చా? – యన్‌.శాలిని, కాజీపేట
ఆటిజం సమస్య ఉన్న పిల్లల్లో మానసిక ఎదుగుదలలో లోపాలు, వినికిడి లోపాలు, పనితీరులో లోపాలు, మాట్లాడటంలో లోపాలు తలెత్తుతాయి. అంతేకాకుండా వారిలో బుద్ధిమాంద్యం, మతిమరుపు వంటి అనేక లక్షణాలు ఉండవచ్చు. జన్యుపరమైన కారణాలు, తల్లి గర్భంతో ఉన్నప్పుడు, రుబెల్లా, టాక్సోప్లాస్మా వంటి వైరల్, బ్యాక్టీరియా, ప్రొటోజోవల్‌ ఇన్‌ఫెక్షన్‌లకు గురవ్వడం, తల్లిలో మానసిక ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, పొగతాగడం, మద్యం సేవించటం వంటి వాటి వల్ల, కొన్నిరకాల మందుల వల్ల ఎక్కువగా ఫిట్స్‌కు వాడే మందుల వల్ల, గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడుకి సరిగా రక్తప్రసరణ లేకపోవడం వల్ల, ఆక్సిజన్‌ సరిగా అందకపోవడం వల్ల, కాన్పు సమయంలో ఆక్సిజన్‌ సరఫరా సరిగా లేకపోవడం, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల పిల్లల్లో ఆటిజం సమస్య రావచ్చు. ఈ సమస్య అసలు రాకుండా నివారించలేము. కాకపోతే గర్భం రాకముందే రుబెల్లీ పరీక్ష చేయించుకోవడం, అవసరమైతే రుబెల్లా వ్యాక్సిన్‌ తీసుకోవడం, గర్భం సమయంలో మితమైన పౌష్టికాహారం తీసుకోవటం, మానసిక ఒత్తిడిలేకుండా ఉండటం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, సౌకర్యాలు ఉన్న హాస్పిటల్‌లో నిపుణుల చేతిలో కాన్పుకావటం వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆటిజం వచ్చే అవకాశం కొద్దిగా తగ్గుతుంది. వేరే వాళ్ల పిల్లలకి ఆటిజం ఉంటే మన పిల్లలకి రావాలని ఏం లేదు కదా. దానికోసం ఇప్పటి నుంచే బాధపడి మానసిక ఒత్తిడి పెంచుకోవద్దు. మనం ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తే అన్నీ పాజిటివ్‌గా జరుగుతాయి. అయ్యేవాటిని ఎవరూ ఆపలేము. తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా ఉంటే నిద్ర బాగా పడుతుంది.

నా వయసు 35. ఈ మధ్య నేను బాగా బరువు పెరిగాను. ఏదైనా పని చేయాలంటే ఇబ్బందిగా ఉంటోంది. వైద్యం గురించి తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఒకరు ‘ఆస్టియోపొరాసిస్‌ కావచ్చు. ఒకసారి చెక్‌ చేయించుకో’ అని చెప్పారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? నివారణ చర్యలు ఏమిటి? ఇప్పుడు నేను తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి దయచేసి చెప్పగలరు? – కె.తులసి, పాడేరు
మీరు బరువు పెరగటం వల్ల, ఆయాసపడటం, పనులు చేసుకోవటానికి ఇబ్బందిపడటం వంటి సమస్యలను ఎదర్కొంటున్నారు. అంతేగానీ మీ సమస్యకు ఆస్టియోపొరాసిస్‌కు సంబంధం లేదు. మీరు బరువు తగ్గటానికి వాకింగ్‌తో పాటు చిన్న చిన్న వ్యాయామాలు, మితమైన డైటింగ్‌ వంటివి చెయ్యవచ్చు. ఎముకలలో సాంద్రత తగ్గటం, గుజ్జు తగ్గి ఎముకలు పెలుసుగా మారటాన్ని ఆస్టియోపొరాసిస్‌ అంటారు. సాధారణంగా ఎముకలలో పాత కణాలు పోయి, కొత్త కణాలు తయారు అవుతూ ఉండి, ఎముకలు పటిష్టంగా ఉంటాయి. శరీరంలో కాల్షియం తక్కువ ఉన్నప్పుడు వయసు పెరిగే కొద్ది.. మరిన్ని ఇతర కారణాల వల్ల ఎముకల గుజ్జు తొందరగా కరిగిపోయి, ఎముకలు బలహీనంగా మారి చిన్నగా కిందపడినా సరే ఎముకలు విరుగుతూ ఉంటాయి. దీనిని నివారించడానికి నడకతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు, యోగా వంటివి చేస్తూ ఎక్కువ బరువు పెరగకుండా చూసుకుంటూ ఉండాలి. ఇక ఆహారంలో క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివి తీసుకోవాలి. డాక్టర్‌ సలహా మేరకు క్యాల్షియం, విటమిన్‌ డి, మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకోవడం మంచిది.  అవసరాన్ని బట్టి ఎముకలలో గుజ్జు పెరగడానికి కూడా మందులు వాడుకోవచ్చు.

నా వయసు 29. నేను  rheumatoid arthritis(r.a) సమస్యతో బాధ పడుతున్నాను. ఈ సమస్య ఉన్నవాళ్లు గర్భం దాల్చవచ్చా? గర్భం దాలిస్తే ఎలాంటి సమస్యలు  ఎదురవుతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.– జి.ప్రభ, కొత్తవలస
rheumatoid arthritis (RA)అంటే కీళ్ల వ్యాధి అంటారు. ఇది జన్యుపరమైన సమస్యల వల్ల కొందరిలో రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచెయ్యక యాంటిబాడీస్‌ జాయింట్స్‌ (కీళ్ల)పైనే దాడి చేసి వాటిని దెబ్బతీస్తాయి. తద్వారా జాయింట్స్‌లో వాపులు, నొప్పులు, జ్వరం, అలసట, నడవడానికి ఇబ్బంది వంటి అనేక లక్షణాలు ఉంటాయి. వీళ్లకి చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి, నొప్పులు, వాపులు తగ్గటానికి, జబ్బు ఇంకా పాకకుండా ఉండటానికి అనేక రకాల మందులు కాంబినేషన్‌లలో దీర్ఘకాలం వాడటం జరుగుతుంది. ఖఅ ఉన్నవాళ్లు గర్భందాల్చటంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. కొందరికి దీని వల్ల గర్భందాల్చటానికి ఇబ్బంది ఉండవచ్చు. గర్భం దాల్చిన తర్వాత 60శాతం మందిలో ఖఅ లక్షణాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గర్భం సమయంలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది కాబట్టి. 20 శాతం మందిలో లక్షణాలు యథావిధిగా ఉంటాయి. 20 శాతం మందిలో లక్షణాలు తీవ్రం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖఅకి వాడే చాలా మందుల వల్ల అబార్షన్, బిడ్డలో అవయవలోపాలు, బరువు తక్కువ పుట్టడం, నెలలు నిండకుండా కాన్పులు అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి గర్భందాల్చక ముందే డాక్టర్‌ని సంప్రదించి వారి సలహా మేరకు వాడే మందులను మార్చుకుని, లక్షణాలను బట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం, అతి తక్కువ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్న మందులను వాడుకుంటూ గర్భం దాల్చిన తర్వాత డాక్టర్‌ పర్యవేక్షణలో అవసరమైన పరీక్షలు చెయ్యించుకుంటూ 9 నెలల పాటు చాలా వరకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. గర్భిణికి కూడా బరువు పెరిగే కొద్ది ఖఅ వల్ల ఒళ్లునొప్పులు, నీరసం, జాయింట్‌ (కీళ్లనొప్పులు) వంటి అనేక ఇబ్బందులు ఉండవచ్చు. కీళ్లవాపుల వల్ల సాధారణ కాన్పుకి ఇబ్బంది ఉండవచ్చు. డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడుకుంటూ ఎక్కువ బరువు పెరగకుండా మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ మెల్లగా నడక, చిన్న చిన్న వ్యాయామాలు, ప్రాణాయామం, ధ్యానం వంటివి చెయ్యడం వల్ల శరీరం, కండరాలు, ఎముకలు, జాయింట్స్‌ ఇంకా ఎక్కువ బిగిసిపోకుండా ఉంటాయి.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌హైదరాబాద్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top