అతని ఆకాశం

అతని ఆకాశం - Sakshi


కథ: అతనికి అది మాత్రమే వాస్తవం! తన మంచం మీద పడుకుని అతను ఆ మాత్రం ఆకాశాన్ని మాత్రమే చూడగలడు. కిటికీ వైపు ముఖం తిప్పి, అందులోంచి వచ్చే చల్లటిగాలిని అనుభవించడం అతనికి అలవాటు. మొదటి అంతస్తులో తన గదిలో మంచాన పడి ఉన్న అతడికి కిటికీలోంచి కనిపించే ఆ ఆకాశం ముక్కే సర్వస్వం. అతనికి తెలుసు ఆకాశమంటే ఆ మాత్రమే కాదనీ, అతనికి తెలుసు జీవితమంటే తనలాగా యేళ్ళకేళ్ళుగా ఆ నాలుగు గోడల మధ్య మంచాన పడి ఉండడం కాదనీ. తన బతుకు పొడిగించడానికి మంచం పక్కనే ఉన్న మందుసీసాలకు అవతల కూడా ఎంతో జీవితం ఉందని అతనికి తెలుసు. తన చెమటతో తడిసిన పరుపులోనే అలాగే అలాగే పడుకుని ఉండడం కాదని కూడా తెలుసు. కాని, తని వంతుకు వచ్చిన జీవితం అది మాత్రమేనని అతనికి కచ్చితంగా తెలుసు.

 

 జీవితం ఆకాశం లాంటిదే. విశాలమైంది. అంతు చిక్కనిది. దాన్ని స్పృశించాలంటే బయటపడాలి. తనలోంచి తాను బయటపడాలి. గదిలోంచి తాను బయట పడాలి. విస్తృతంగా పరుచుకున్న దాని విశాలత్వాన్ని చూడాలంటే కళ్ళు విప్పి, తల నాలుగువైపులా తిప్పి, చేతులు పూర్తిగా విప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. అది చేతులకు అందకపోవచ్చు. కాని అగాథమైన దాని ‘నీలిమ’ కళ్ళకు అందుతుంది. చేతులు? చేతుల గురించి ఆలోచన రాగానే అతను తన ఎడమ చేతితో కుడిచేతిని స్పృశించాడు. మెత్తగా తట్టాడు. డాక్టర్లన్నారు అతని కుడిభాగం చచ్చిపోయిందని! అది సాధ్యమా? మనిషిలోని సగభాగం చచ్చిపోయి, సగభాగం బతికి ఉండడానికి వీలుందా? ఒక సగం స్వంతదైనట్లు, మరో సగం పరాయిదైనట్లు ఒక సగంతోనే పరిచయం ఉన్నట్లు, మరో సగంతో లేనట్లు ఏమిటిదీ? సంతోషమూ, బాధా అంతా సగానికే పరిమితం. మరో సగానికి స్పర్శ జ్ఞానమే లేదు. శిలువ వేయబడ్డ ఏసుక్రీస్తు సకల మానవాళిని పాపవిముక్తులను చేయడానికి చిత్రహింసలు అనుభవించాడు. మరి తను ఎవరి కోసం ఈ శిక్షను అనుభవిస్తున్నట్టూ? తనకు అసలు విముక్తి ఉందా? ఉంటే ఎప్పుడు? తన పెద్దకోడలు తన ముఖం మీదనే అంటుంది. ‘‘ఎప్పటి పాపమో ఇప్పుడు అనుభవిస్తున్నాను. మీరే కాదు మేమూ అనుభవిస్తున్నాం. మేం ఎప్పుడు చేసిన పాపమో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం. లేకపోతే మీ ఒకటీ రెండూ కడుక్కుంటూ గొడ్డుచాకిరీ చేయాల్సిన ఖర్మ మాకెందుకు చెప్పండీ?’’ అని!

 

 అతని దగ్గర సమాధానం లేదు -  సగం చచ్చి సగం బతికే ఈ జీవితం చితి మీద కాలుతున్నట్లుగా ఉంది. ఎన్ని చావులు? మనిషి ఒకే సమయంలో ఎన్ని చావులు చావగలడు? మనుమడు వరుణ్ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘తాతగారూ! మీరిప్పుడు పాలు తాగుతారా? అమ్మ అడిగి రమ్మంది’’ అని అన్నాడు. వాడు స్కూలు యూనిఫాం వేసుకుని స్కూలుకు వెళ్ళే హడావుడిలో ఉన్నాడు. ‘‘ఆ... తాగుతాను! మరి నువ్వు నా దగ్గర కాసేపు కూచుంటావా?’’

 ‘‘కాసేపు నువ్వు నా దగ్గర కూచుని తాగిస్తే గబగబా తాగుతాను’’ అన్నాడతను, ఆశగా మనుమడి వైపు చూస్తూ - ఆ రకంగానైనా ఒకసారి కోడల్ని తప్పించుకోవచ్చునని.  వరుణ్ కింది నుంచి పాలు తెచ్చాడు. స్టూలు మంచం దగ్గరికి లాక్కుని దానిపై కూర్చున్నాడు. స్పూన్‌తో మెల్లగా పాలు తాగించడం ప్రారంభించాడు. ముసలి తాత గబగబా తాగలేడని వరుణ్‌కి తెలుసు. ‘‘తాతయ్యా! నువ్వు కథ ఎప్పుడు చెప్తావు? తాతయ్యా! నువ్వు మేడ దిగి ఎప్పుడు కిందికి వస్తావు? వంటి ప్రశ్నలు గుప్పించసాగాడు వరుణ్. వాటికి సమాధానాలు తన దగ్గర లేవు. పైగా సమయం వృథా చేయకుండా పాలు తాగాలన్న తొందర.

 అతను మనుమడికి ఏమీ ఇవ్వలేడు. కథ చెప్పలేడు. నవ్వలేడు. నవ్వించలేడు. బయటకు తీసుకుని వెళ్ళి సరదాగా తిప్పలేడు. ఒకరి నుంచి తను తీసుకోవడమే గాని, వేరొకరికి తనేమి ఇవ్వగలడు? అనే ఆలోచన అతణ్ణి ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది.



 రోడ్డు మీద వరుణ్ కోసం వచ్చిన సైకిల్ రిక్షా బెల్ మోగింది. అప్పటికి గ్లాసులో నాలుగోవంతు పాలు మిగిలే ఉన్నాయి. బెల్ వినిపించడంతో వరుణ్‌కు ఓపిక నశించింది. కదలకుండా కూచుని ఒక్కొక్క స్పూను తాగించలేకపోయాడు. మామూలుగా అయితే ఈపాటికి ఎగిరి గంతేసి రిక్షాలో కూలబడేవాడు. కాని ఇప్పుడు చేతిలో గ్లాసుంది. పైగా తాతగారికి పాలు తాగించే పనిలో ఉన్నాడు. ‘‘తాతగారూ! నా రిక్షా!’’ అన్నాడు ఆదుర్దాగా. అనడంతోపాటు గ్లాసు అతని నోటికందించి పైకి ఎత్తేడు. నోటి చివరల నుండి పాలన్నీ కారిపొయ్యాయి. గ్లాసు స్టూలు మీద పెట్టి వరుణ్ అక్కణ్ణించి తుర్రుమన్నాడు. పాలతో బట్టలు తడిసి అదొక రకమైన వింత వాసన వచ్చింది. అతని మూతి, మెడ, ఛాతీ తడిగా జిగటగా అయ్యాయి.



 కాసేపటికి కొడుకు కమల్ వచ్చాడు. రోజుటిలాగానే ‘‘నాన్నగారూ ఎలా ఉంది ఇవాళ?’’ అని అన్నాడు. అలా అడిగినప్పుడల్లా ఏదైనా చెప్పుదామని అతను అనుకుంటాడు. కానీ, చెప్పలేకపోతాడు. ఎందుకంటే ప్రశ్నించిన వారికి తన సమాధానం వినాలన్న కుతూహలం ఉండాలి కదా! వస్తాడు, ఓ ప్రశ్న వేస్తాడు. అటూ ఇటూ అల్మారోల్లోకి తొంగి చూసి, ఏదో కూనిరాగం తీస్తూ వెళ్ళిపోతుంటాడు. అలాంటప్పుడు... నగర పొలిమేరలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు టోల్‌టాక్స్ కట్టాల్సి వచ్చినట్లు అతని గదిలోకి ప్రవేశించే వాళ్ళంతా మొక్కుబడిగా ఒక ప్రశ్న వేస్తారు. అంతే! అలా ఆ గదిలోని నిశ్శబ్దాన్ని ఛేదించడం కూడా యాంత్రికంగా జరిగే ఒక తంతు మాత్రమే. ‘‘ఆ.. బాగానే ఉన్నాను’’- అని అన్నంత మాత్రాన ఎదుటివాళ్లు ఏమైనా సంతోషపడిపోతారా? సమాధానం చెప్పకుండా, నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళేమైనా బాధపడిపోతారా? తన మాటకు, తన నిశ్శబ్దానికి, దేనికీ విలువలేదని అతను మొదటిసారి గ్రహించినప్పుడు చాలా బాధపడ్డాడు. ఇప్పుడిక బాధపడడానికి భాష కూడా మిగిలిలేదు. ఉదయాలు, మధ్యాహ్నాలు, రాత్రులు కదలక కదలక కదుల్తూనే ఉన్నాయ్.

 ఠి ఠి ఠి

 ఒకరోజు సాయంత్రం వరుణ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘మన ఇంటి పక్క ఖాళీస్థలంలో ఎవరో ఇల్లు కడుతున్నారు తాతయ్యా! మేమిక గోళీలు ఆడుకునేది ఎక్కడా?’’ అన్నాడు సీరియస్‌గా ముఖంపెట్టి.  ‘‘పోనీ, ఇక్కడ ఆడుకో నా గదిలో’’ అన్నాడాయన.

 ‘‘ఏమిటీ? ఇక్కడా? నేను, సోము, పప్పీ, విక్కీ ఇంతమందిమి ఇక్కడ ఈ గదిలో పడతామా? అయినా మీ గదిలో అల్లరి చేయవద్దని అమ్మ చెప్పింది’’

 ‘‘యేం ఫరవాలేదు నాన్నా... అందరూ ఇక్కడే ఆడుకోండి. మీ ఆట నేను కూడా చూస్తాను’’

 ‘‘తాతయ్యా! నిజంగానే ఇక్కడ ఆడుకోమా?’’ అన్నాడు వరుణ్. ‘‘తాతగారూ మీరు కూడా చిన్నప్పుడు గోళీలు ఆడారా?’’ అని కూడా అడిగాడు.

 ‘‘ఆ.. ఆ.. ఆడేవాణ్ణి!’’ అన్నాడు అతను గతంలోని మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ, వర్తమానంలోని అసహాయపు పరిస్థితిని బేరీజు వేసుకుంటూ - మనుమణ్ణి ఒకసారి దగ్గరికి తీసుకోవాలని అనిపించినా, తన పరిస్థితి గుర్తుకు తెచ్చుకుని ‘‘సరే ఎవరు బాగా ఆడతారో నేను ఇక్కడి నుంచే చూస్తాను’’ అని అన్నాడు.

 వరుణ్ సంతోషంగా చప్పట్లు కొడుతూ ‘‘భలే భలే మీరు చూస్తే వాడు సోముగాడు తొండి చెయ్యలేడు. వాడొక తొండి వెధవ తాతగారూ! నా గోళీలన్నీ వాడే దొబ్బేస్తుంటాడు. ఇప్పుడిక మీరు నా పార్టీయే. నా వైపే మాట్లాడాలి’’- అన్నాడు వరుణ్.

 తను ఎవరివైపూ ఉండకుండా న్యాయం చెప్పగలడా? జీవితంలోని మంచికీ, చెడుకూ అంతుపట్టని దీనస్థితిలో ఉన్నతను ఎవరి పక్షాన ఉంటే మాత్రం ఏమిటీ?

 నాలుగురోజులు పిల్లల ఆటతో ఆ గది కంపించిపోయింది. ఎందుకోగాని ఐదో రోజు పిల్లలెవరూ రాలేదు. ఆరుబయట హాయిగా ఆడుకోవాల్సిన ఆట, గదిలో ఆడడం వారికి నచ్చలేదు.

 ఠి ఠి ఠి

 మరికొన్ని రోజులకు పక్కనున్న ఖాళీ స్థలం నుంచి ‘‘ధమ్ ధమ్’’అని శబ్దాలు వినిపించాయి. గది తుడవడానికి పని మనిషి దేవకి వచ్చినప్పుడు ఆయన ఆ చప్పుడు గురించి వాకబు చేశాడు. పక్కన ఇల్లు కట్టడానికి పునాదులు తీస్తున్నారని  చెప్పింది దేవకి.

 మరొక రోజు దేవకి రాగానే మంచం మరోవైపుకి లాగించుకున్నాడు. కిటికీలోంచి శబ్దం ఎక్కువగా వస్తోందని కిటికీకి దూరంగా జరిగాడు. ఆ మార్పు అతనికి నచ్చింది. ఒకేమూల కూర్చుని ఒకే కోణంలో వస్తువుల్ని చూడడం కన్నా కోణం మారిస్తే అవి కొత్తగా కనిపిస్తాయని అతనికి తెలుసు.

 తెలిసినవాళ్ల ఇంట్లో పెండ్లి జరిగితే తమ ఇంటివాళ్ళు వెళ్ళివచ్చారు. దేవకిని కూడా తీసుకెళ్ళారు. పెళ్ళి విశేషాలు దేవకి పదిరోజులపాటు చెబుతూనే ఉంది. ఏముందీ? అన్ని కుటుంబాలలాగ అదీ ఒక కుటుంబం అవుతుంది. భార్య, భర్త, పిల్లలు, బాధ్యతలు, చదువులు- ఉద్యోగాలు- అనారోగ్యాలు - మూలకు పడటాలు - చివరికి చావు. అందులో కొత్తదనం ఏముందీ?

 పక్కన నాలుగంతస్తుల భవంతి పూర్తికావస్తోందని అప్పుడప్పుడు వరుణ్ చెబుతున్నాడు. దేవకి చెబుతోంది. అతనికి అవన్నీ కాలక్షేపం కబుర్లు. నాలుగంతస్తులంటే తమ మేడను మించి ఇంకా చాలా ఎత్తు ఉంటుందన్న మాట.

 

 

 ఎంత ఎత్తున్నా మనుషులు ఉండడానికే కదా? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, బాధలు, దుఃఖం, చివరికి చనిపోవడం! ఒకరికి తెలియకుండా చనిపోవడం, ఎవరిది వారికే తెలియకుండా చనిపోవడం. తనది మరీ విచిత్రం. శరీరంలో సగభాగానికి తెలియకుండా సగం చచ్చిపోయింది. ఉన్నఫళంగా ఎడమచేతితో కుడి చేతిని స్పృశించి చూసుకోవాలనుకున్నాడు. ఎందుకో గాని సాధ్యం కాలేదు. అంటే ఇంకో సగభాగం కూడా చల్లగా నిశ్శబ్దంగా చచ్చిపోయిందా? తనకు ఊపిరి ఆడుతోందా లేదా? అతనికి ఎన్నో అనుమానాలు.

 ‘‘దేవకీ?’’ అని అరిచాడు. అది చావు కేకలా ఉంది. వరుణ్ పరిగెత్తుకొచ్చాడు ‘‘తాతయ్యా! ఏంటీ? అలా అరిచారూ?’’- అంటూ. వెనకనే దేవకి పరిగెత్తుకొచ్చింది. ‘‘పెద్దయ్యగారూ! ఏమైందీ’’ - అంటూ.

 అప్పటికి ఆయన కాస్తా కోలుకున్నాడు. ‘‘ఇటు వైపు ఏమీ బాగులేదు. నా మంచం కాస్తా అటువైపుకు జరుపు. కిటికీలోంచి ఆ అనంతాకాశం కనిపిస్తే చూడాలని ఉంది. ఆరుబయటికి ఎలాగూ వెళ్ళలేను. కనీసం కిటికీలోనుంచైనా చూస్తా!’’ అంటూ ఆయాసపడుతూ గొణిగాడు.

 

 ‘‘ఉండండి. చేతులు కడుక్కుని వస్తా.’’ అంటూ పనిమనిషి మళ్ళీ కిందికి పరుగుదీసింది.

 ఇంట్లో పనంతా అయ్యాక తీరిగ్గా వచ్చింది. ఆయన అడిగినట్లే మంచం మళ్ళీ కిటికీ ఎదురుగా జరిపింది. మందుల టేబుల్ దగ్గరగా పెట్టింది. మంచినీళ్ళ చెంబు చేతికి అందేట్లుగా ఉంచింది. ఆ మార్పులో అతనికి మళ్ళీ కొత్తదనం కనిపించింది. పక్కన చప్పుళ్ళు కూడా లేవు. కిటికీలోంచి ఇక ఏ గోలా వినిపించదు. హాయిగా ఆకాశం చూస్తూ దాని నీలిమను కళ్ళనిండా నింపుకోవచ్చు - అని అనుకున్నాడు. అన్నీ ఊహించుకుని అప్పటిదాకా మూసుకున్న కళ్ళు ఒక్కసారిగా తెరిచాడు. అంతే - కిటికీలోంచి నీలాకాశానికి బదులు సిమెంటు గోడ కనిపించింది. అది అతణ్ణి మృత్యువులా భయపెట్టింది.

 

 రచయిత్రి గురించి...

హిందీ సాహిత్య క్షేత్రంలో రాజీ సేథ్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె తీసుకునే ఇతి వృత్తాలు, ఆమె శైలీ అందుకు కారణం. 1935లో ఆమె నౌషేరాలో పుట్టారు. ఇప్పుడా పట్టణం పాకిస్తాన్‌లో ఉంది. దేశ విభజన సమయంలో ఆ కుటుంబం అస్తవ్యస్తమైపోయింది. మళ్ళీ కుదురుకోవడానికి చాలా కాలం పట్టింది. తొలిదశలో ఆత్మన్యూనతా భావంతో రచనలు ప్రచురించలేదు. తొలి రచన నలభయ్యవ యేట ప్రచురించిన రాజీ సేథ్, ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ‘‘సమానాంతర్ చల్ తే హై’’ ‘‘ఉస్కా ఆకాశ్’’ ‘‘తీస్‌రీ హథేలీ’’ ‘‘యాత్రాముక్త్’’ ‘‘అంధే మోడ్‌కి ఆగే’’ వంటి కథానికా సంపుటాలు ‘‘తథ్యం’’ అనే నవల ఆమెను రచయిత్రిగా ముందు వరుసలో కూర్చోబెట్టాయి. భర్త ఢిల్లీలో ఉన్నతాధికారి. లక్నో విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్ ఎం.ఎ. డిగ్రీ తీసుకుని, గుజరాత్ విద్యాపీఠ్‌లో కొంతకాలం పరిశోధన చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రకటింపబడే టాగూర్ అవార్డు ఫర్ లిటరేచర్ తొలిసారి ఈమెకు లభించింది. చావు, బతుకుల్ని తాత్త్విక కోణంలోంచి చూపే కథ ‘అతని ఆకాశం’ - వృద్ధ వికలాంగుల ఆలోచనలకు రూపం ఇచ్చింది. అది చావూ కాదు, బతుకూ కాదు. ఆరుబయట ఆకాశాన్ని కనీసం కిటికీలోంచి కూడా చూడలేని ప్రాణి దుర్భర వేదనని ఈ కథ కళ్ళకు కట్టించింది.

 

 ‘‘ఇటు వైపు ఏమీ

 బాగులేదు. నా మంచం కాస్తా

 అటువైపుకు జరుపు.  ఆరుబయటికి ఎలాగూ వెళ్ళలేను. కనీసం కిటికీలో

 నుంచైనా చూస్తా!’’

 - హిందీ మూలం: రాజీ సేథ్

 తెలుగు: డాక్టర్ దేవరాజు మహారాజు

 

 వసంతం

 కొమ్మ కొమ్మలో లేచివుళ్ళు

 నింపుకొచ్చింది గున్నమామిడి

 కోయిల గొంతులో

 అమృతం నింపడానికి

 

 మంచు

 ఉదయాన్నే పూలన్నీ

 ఏ పేరంటానికో సిద్ధమైనట్టు

 వంటినిండా పెట్టుకున్నాయి

 ముత్యాల సరాలు

 

 నిరీక్షణ

 ఎదురుచూపు

 అభిసారికై

 రెప్పల వాకిట్లో

 నిలుచుంది

 

 అమ్మ

 కళ్ళలో ప్రేమ

 గుండెలో తేమ

 స్పర్శలో క్షమ

 కలిగిందే అమ్మ

 

 హృదయం

 కన్నీటి వర్షం

 వెలిసిపోయాక

 హృదయం

 కాగితం పడవైంది

 

 క్రికెట్టు

 బ్యాటు పరుగునవచ్చి

 బాలును ముద్దాడితే

 సిగ్గుతో ఎగిరి

 సిక్సరయ్యింది

  - డేగల అనితాసూరి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top