హత్యా?ఆత్మహత్యా?

Funday crime story of the week 05-05-2019 - Sakshi

ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరుతుండగా అందిన వార్త  ‘ప్రముఖ యువ నటి లలితారాణి ఆకస్మిక మరణం’. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న లలితారాణి, నందకుమార్‌ తమ పెళ్లి వార్తను ఒక వారంలో విడుదల చేస్తామన్న లోపే ఇలా జరగడం విచారకరం అని అన్ని టీవీ చానల్స్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ ప్రసారం చేస్తూ, మధ్య మధ్యలో ఆమెది సహజ మరణమా? ఆత్మహత్య?అని మరొక ట్విస్ట్‌కు తెరలేపుతున్నాయి. అది చూసి  నివ్వెరపోయాడు జగదీష్‌ ఎందుకంటే అతను కూడా ఆమెకు అభిమాని. ఆమె ఇప్పుడిప్పుడే ధ్రువతారగా వెలుగుతోంది, ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగానే పారితోషకం తీసుకొంటోంది అలాంటి నటీమణి మరణం పలు అనుమానాలకు దారి తీస్తోంది. జగదీష్‌ భృకుటి ముడిపడింది ఇందులో ఏదో మర్మం దాగివుంది అని ఆలోచిస్తూనే జీపు ఎక్కాడు.‘‘సార్‌! స్టేషన్‌ వచ్చింది’’ అని డ్రైవరు అన్నాక గాని ఈ లోకంలోకి రాలేదు. కుర్చీలో కూర్చున్నాడో లేదో టేబుల్‌పైన ఫోన్‌ మోగింది. ‘‘హలో ఎవరు?’’‘‘సార్‌! నా పేరు ప్రభాకరం. నా కూతురు సినిమా హీరోయిన్‌ లలితారాణి మరణించింది... మీరు వెంటనే రావాలి’’జగదీష్‌ తన అసిస్టెంట్‌ ప్రసాద్‌తో కలిసి లలితారాణి బంగళాకు పోలీసు వెహికిల్‌లో బయలుదేరి వెళ్ళాడు. అప్పటికే ఆమె అభిమానులు గేటు బయట బారులు తీరి ఉన్నారు. ‘‘ఏంటి ప్రసాద్‌! మనకంటే ముందే ఇంతమంది రావడం’’ అని జగదీష్‌ అనేలోపే ‘‘ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రభావం సార్‌!’’పోలీసు కారును చూడగానే గూర్ఖా గేటు తీశాడు అదే అదనుగా కొందరు అభిమానులు లోపలకు చొరబడబోయరు గూర్ఖా వారిని వారించాడు. లలిత నాన్న ప్రభాకరం, అతని చిన్న భార్య తులసి, హీరో నందకుమార్‌ విషణ్ణ వదనాలతో లలితారాణి డెడ్‌ బాడీకి కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. ఒక పక్కగా పనిమనిషి లక్ష్మి, ఆమె భర్త తోటమాలి శంకరయ్య వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువవుతోందని తెలిసి పోలీసు ప్రధాన కార్యాలయానికి  ఫోన్‌ చేసి తగినంత బలగాన్ని పంపమన్నాడు జగదీష్‌.  ‘‘ఎలా జరిగింది?’’ అని ప్రభాకరాన్ని అడిగాడు. 

‘‘నిన్న రాత్రి షూటింగ్‌ నుంచి బాగా పొద్దు పోయాక అంటే సుమారు పన్నెండు గంటల  ప్రాంతంలో వచ్చింది. మేడ మీద తన గదిలోకెళ్లిపడుకుంది. తెల్లారి ఎనిమిది గంటలైనా తలుపు తీయలేదు. లక్ష్మి కాలింగ్‌ బెల్‌ కొట్టింది. తలుపు కూడా తట్టింది. కిందికి వచ్చి మాకు విషయం చెప్పడంతో మేము పరుగున వెళ్లి తలుపును గట్టిగా తోస్తే బోల్ట్‌ ఊడి వచ్చింది. నిద్రపోతున్నట్టుగానే ఉంది. శరీరం పట్టుకొని చూస్తే పూర్తిగా చల్లబడింది. వెంటేనే మా ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్‌ చేశాను. చనిపోయి కొన్ని గంటలవుతోందని చెప్పాడు’’‘‘ఆత్మహత్య చేసుకుందని కొన్ని టీవీ చానల్స్‌ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. రాణి ఆత్మ హత్య చేసుకొనేంత పిరికిది కాదు సార్‌!’’ అంది తులసి. ‘‘అన్ని విషయాలూ బయటకు వస్తాయి. ముందుగా క్లూస్‌ టీమ్‌ వారు వారి పనులు చేసుకుని  ఫోటోలు అవి తీసుకున్నాక డెడ్‌ బాడీని పోస్ట్‌మార్టంకు పంపే ఏర్పాట్లు చేద్దాము’’ అని ప్రభుత్వ ఆసుపత్రికి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ పంపమన్నాడు. రిపోర్ట్‌ రావడానికి సాయంత్రం కావచ్చు అని ఇదే విషయాన్ని అభిమానులందరికీ చెప్పాడు.‘‘సార్‌ మా అభిమాన నటిది ఆత్మహత్య కాదు. ఇది కచ్చితంగా హత్యే వారిని ఎలాగైనా మీరు పట్టుకోవాలి’’ అన్నాడు ఒక అభిమాని.‘‘కడసారి చూపుకోసం ఎంతసేపయినా వేచివుంటాము సార్‌! అన్నారు’’ ముక్త కంఠంతో. ‘‘మీ అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. దయచేసి మాకు సహకరించండి. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అన్నాడు జగదీష్‌. అంబులెన్స్‌ డెడ్‌ బాడీని తీసుకెళ్లాక  ప్రభాకరంగారిని ఉండమని మిగతా వారిని పంపించి, జగదీష్, ప్రసాద్‌ల పర్యవేక్షణలో క్లూస్‌ టీమ్‌ లలితారాణి గదిలో ఆధారాల కోసం అన్వేషణ మొదలు పెట్టింది. టీపాయ్‌ మీద ఉన్న హ్యాండ్‌ బ్యాగ్, దాని పక్కన సెల్‌ ఫోను తప్ప వారికి ఏమీ లభించలేదు. వాటిని స్వాధీనం చేసుకొని తలుపు గడియను బాగుచేయించి, తాళం వేయించి సీల్‌ చేసి కిందికి వచ్చారు. 

ఆ సమయానికి గుంటూరు నుంచి లలిత మేనత్త, ఆమె కొడుకు అంటే లలిత బావ చంద్రం వచ్చారు.  వారిని మా అక్క, మా మేనల్లుడు అని జగదీష్‌కు పరిచయం చేశాడు ప్రభాకరం. ‘‘పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చాక మాట్లాడదాము’’ అని జగదీష్‌  ప్రభాకరానికి చెప్పి, సిబ్బందితో కలసి బయల్దేరాడు.పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చింది. ప్రభాకరాన్ని రమ్మని కబురు పెట్టాడు జగదీష్‌. కొద్దిసేపటికి ప్రభాకరంతో పాటు నందకుమార్, చంద్రం కారులో వచ్చారు.‘‘అధిక మోతాదులో నిద్ర మాత్రలు వాడడం వల్ల లలితారాణి చనిపోయింది. ఆమె చనిపోయిన సమయం రాత్రి ఒంటిగంట’’ అని చెప్పి ప్రభాకరానికి రిపోర్ట్‌ ఇచ్చి డెడ్‌ బాడీని తీసుకెళ్లమన్నాడు జగదీష్‌.వారు వెళ్ళాక ‘‘ప్రసాద్‌! ఆ హాండ్‌ బ్యాగ్లో చిన్న పాకెట్‌ డైరీ, బాల్‌ పెన్, సెల్‌ఫోన్‌ మనకు ఏమైనా ఉపయోగపడ్డాయా?’’ అన్నాడు జగదీష్‌. ‘‘హాండ్‌ బ్యాగ్, అట్టతో ఉన్న పాకెట్‌ డైరీ, బాల్‌ పెన్‌ల మీద లలితారాణి వేలి ముద్రలు తప్ప వేరే వాళ్లవి లేవు సార్‌! సెల్‌ ఫోన్‌ డేటా కూడా ఉపయోగ పడలేదు. కానీ డైరీలో ఈ వాక్యాలు చూడండి సార్‌!’’‘బావకు నా ముఖం చూపించలేను.నాన్నకు పిన్నికి తలవంపులు తెచ్చాను’‘‘దీనిని బట్టి ఆమె ప్రెగ్నెంట్‌ అని అర్థమవుతోంది. అందువల్లే ఆత్మ హత్య చేసుకొని వుండవచ్చుకదా?’’ అన్నాడు ప్రసాద్‌. డెడ్‌ బాడీని అంబులెన్స్‌లో ఎక్కించే సమయంలో ప్రభాకరాన్ని, చంద్రాన్ని పిలిపించి డైరీలోని ఆ రెండు వాక్యాలను చూపించాడు. ‘‘ఆమె అంత్యక్రియలు రేపు అయిపోగానే ఎల్లుండి పరిశోధన మొదలుపెడతాము. అది పూర్తి అయ్యేవరకు ఈ విషయాలను మీరిద్దరూ చాలా గోప్యంగా ఉంచాలి అని చెప్పాడు.  ‘‘అలాగే సార్‌’’ అన్నారు వారు. తమ అభిమాన నటిది ఆత్మహత్య కాదు, హత్య అని పలుచోట్ల ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు కొందరు అభిమానులు.  పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్యన అభిమానులు సినీ పరిశ్రమ వారి ప్రముఖుల అశ్రునయనాల మధ్య లలితారాణి అంత్యక్రియలు జరిగాయి. జగదీష్, ప్రసాద్‌ను తీసుకొని తన మిత్రుడు డిటెక్టివ్‌ అయిన విశ్వంను కలవడానికి అతని ఇంటికి వెళ్లారు. ఎన్నో పరిశోధనలలో విశ్వం, జగదీష్‌కు సహాయపడ్డాడు. జగదీష్, ప్రసాద్‌లను సాధారంగా ఆహ్వానించాడు విశ్వం. స్నాక్స్‌ తింటూ టీ తాగుతున్న సమయంలో లలితారాణి తాలూకు డైరీని చూపించి,ఆ రెండు వాక్యాలను చదవమన్నాడు జగదీష్‌. అది చదివిన తరువాత విశ్వం ఫోన్‌ చేసి ఫోరెన్సిక్‌ లాబొరేటరీలో పనిచేసే కిరణ్‌ను వెంటనే రమ్మన్నాడు. కిరణ్‌ పావు గంటలో అక్కడకు చేరుకున్నాడు. విశ్వం అన్ని విషయాలూ చెప్పాడు. దస్తూరీ రిపోర్ట్‌ రావడానికి రెండు రోజుల సమయం పట్టవచ్చని డైరీని తీసుకు వెళ్లాడు.‘‘నీకు ఏ సమయంలోనైనా అందుబాటులో వుంటాను. నీ పరిశోధనను మొదలు పెట్టు’’ అన్నాడు జగదీష్‌తో విశ్వం. ‘‘అలాగే ఇప్పుడే లలితారాణి ఇంటికి వెళుతున్నాం..ఉంటా విశ్వం’’ అని చెప్పి బయలుదేరుతూ ప్రభాకరానికి వస్తున్నామని ఫోన్‌ చేశాడు. 

అక్కడకు చేరుకున్నాక ప్రభాకరం, తులసి, చంద్రం, లక్ష్మి, శంకరయ్యల నుంచి జగదీష్, ప్రసాద్‌లు విడి విడిగా విషయాలను సేకరించారు.రెండు రోజులకు వేలిముద్రల పరిశోధన రిపోర్టును, డైరీని కిరణ్‌ జగదీష్‌కు అందించాడు. ఆ రెండు వాక్యాలు లలితారాణివి కావని ఆ రిపోర్టులో ఉంది. లలితారాణి చనిపోయిన రోజున ఉదయం షూటింగ్‌ జరిగిన ప్రదేశం నుంచి కొన్ని వివరాలు సేకరించాడు ప్రసాద్, వాటిని జగదీష్‌ కు అందించాడు. రెండు రోజుల తరువాత అన్ని విషయాలను సమకూర్చుకొని జగదీష్‌. ప్రసాద్‌  కలిసి మళ్లీ విశ్వం వద్దకు వెళ్లారు. ‘‘మీరు సేకరించిన విషయాలలో ఎలాంటి లోపం లేదు రేపు ప్రెస్‌ వారిని కూడా పిలిచి దోషిని అరెస్ట్‌ చేయండి!’’ అన్నాడు విశ్వం. ప్రభాకరం ఇంట్లో అందరూ అందుబాటులో ఉండాలని ఒక ముఖ్యమైన విషయం ప్రకటిస్తానని ప్రెస్‌ వారికి కూడా కబురు పెట్టాడు. నందకుమార్, పల్లవి కూడా అక్కడకు చేరుకున్నారు.ప్రెస్‌ వారితో పాటు అందరూ సమావేశమయ్యారు. ‘‘ఏ విషయమో చెప్పండి సార్‌!’’ అన్నారు ప్రెస్‌ వాళ్లు. ‘‘ఆ విషయానికి వచ్చేముందు మీకు ఓ చిన్న కథ చెబుతాను...ఒక ఊరిలో ఒక అక్క, తమ్ముడు ఉన్నారు అక్కకు కొడుకు పుట్టాక బావ చనిపోయాడు. తమ్ముడికి  కూడా వివాహమయ్యింది. అతను పట్నంలో కాపురం పెట్టాడు, అక్కడే వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఏడాదికి అతనికి అమ్మాయి పుట్టింది...మేనల్లుడికే తన అమ్మాయిని ఇస్తానని అక్కకు వాగ్దానం చేశాడు.వ్యాపారంలో బాగా నష్టం రావడంవల్ల దిగులుతో అతని భార్య కన్నుమూసింది. బిడ్డను చూసుకోవడానికని అక్క తమ్ముడికి మళ్లీ పెళ్లి చేసింది. కాలచక్రం గిర్రున తిరిగింది అల్లుడు ఏజీ బియస్సీ చేసి వ్యవసాయం చూసుకుంటున్నాడు. కూతురు ఇంటర్లో చేరింది. ఆ అమ్మాయి ఒకసారి కాలేజీలో డ్రామా వేసింది. అది చూసిన ఒక నిర్మాత ఆమె సినిమాకు పనికొస్తుందని చెప్పి ప్రముఖ హీరో పక్కన హీరోయిన్‌ చేశాడు. అలా ఆమె మంచి పేరు తెచ్చుకుంది ఆమెకు బావ అంటే ఎంతో ఇష్టం. కానీ ఒకసారి సముద్రంలో బోటులో షూటింగ్‌ సన్నివేశాలు చిత్రికరిస్తుండగా ఆ స్పాట్‌లో బోటు ప్రమాదం నుంచి ఆమెను హీరో కాపాడాడు. 

అప్పటి నుంచి హీరో ప్రేమలో పడింది. హీరో కూడా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అసలు చిక్కు అప్పుడే మొదలయ్యింది. హీరోకు కూడా ఒక మరదలు ఉంది. ఆమె బావను తప్ప ఎవ్వరినీ చేసుకోనని చెప్పింది.ఒక రోజు ఆమె హీరోయిన్‌ బావను కలిసి, నీవు నీ మరదలిని పెళ్లి చేసుకుంటేనే నా బావ నాకు దక్కుతాడు అని గట్టిగా చెప్పింది. కానీ లాభం లేక పోయింది. ఒక రోజు షూటింగ్‌ చేస్తున్న ప్రాంతానికి వెళ్లింది. షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పారు. అప్పుడు సమయం రాత్రి పదకొండు అయ్యింది. మేకప్‌ తీసివేయడానికి హీరో, హీరోయిన్‌లు మేకప్‌ రూమ్‌కు వెళ్లారు. ఆఫీస్‌ బాయ్‌ మూడు గ్లాసులతో పళ్ల రసాన్ని తెచ్చి టీపాయ్‌ మీద పెట్టి వెళ్లాడు. ఒకటి మాములుది, రెండు చల్లనివి.. మామూలు గ్లాసులో ఆమె ఇంటి నుంచి తెచ్చిన నిద్ర మాత్రలను కరిగించిన ద్రవాన్ని కలిపింది.ఎవరికి వారు వాళ్ల కార్లలో ఇళ్లకు బయలుదేరారు. హీరోయిన్‌ను ఆమె కారు డ్రైవరు పది నిముషాల్లో ఆమెను ఇంటి వద్ద దింపాడు. తక్కువ మోతాదు ఉన్న నిద్ర మాత్రలను ఎక్కువ శాతంలో కరిగించిన ద్రవం ఉన్న పళ్ల రసాన్ని ఆమె తీసుకోవడం వల్ల అది మెల్లగా ప్రభావం చూపి ఆమె కన్ను మూసింది’’‘‘ఆమెది ఆత్మహత్యగా రిపోర్ట్‌ వచ్చింది. ఎవరో ఆవిడ చెప్పండి సార్‌ టెన్షన్‌ గా వుంది’’ అన్నాడు ఒక విలేఖరి. ‘‘ఒక రోజు మేము హీరోగారి ఇంటికి వెళ్లాము అతనితో మాట్లాడుతుండగా అప్పుడు అతని మరదలు స్నాక్స్‌ కాఫీ తీసుకొచ్చింది. మాటల మధ్యలో మా మరదలు కవితలు బాగా రాస్తుందని చెప్పాడు. నా అసిస్టెంట్‌ డైరీ పెన్ను ఇచ్చి ‘మేడమ్‌ మా పోలీసు డిపార్ట్‌మెంట్‌ మీద ఒక కవిత వ్రాయండి వచ్చే సావనీర్లో వేస్తాము’ అన్నాడు. ఆమె కవిత వ్రాసేలోపల ఆమె గదిలోకి వెళ్లి సోదా చేశాడు. అక్కడ నిద్ర మాత్రల ప్రిస్క్రిప్షన్‌తో పాటు కొన్ని నిద్ర మాత్రలు డ్రెస్సింగ్‌ టేబుల్‌ సొరుగులో దొరికాయి’’ ‘‘సార్‌ ఆమె కవితలు వ్రాయడానికి హత్యకు ఎలాంటి సంబంధం ఉంది?’’ అన్నాడు ఒకతను. హీరోయిన్‌  డైరీలో రెండు వాక్యాలు రాసి వున్నాయి.ఒకటి’ మా బావకు నా ముఖం చూపించలేను...  రెండవది నాన్నకు పిన్నికి తలవంపులు తెచ్చాను’ ఇవి, కవితలు వాసిన వారు ఒక్కరే. ఇక కథను ముగిస్తున్నాను..ఆ హీరోయిన్‌ లలితారాణి ఆమెను హత్య చేసింది ఎవరో కాదు నందకుమార్‌ గారి మరదలు పల్లవి. అక్కడే ఉన్న పల్లవి ముఖంలో రంగులు మారాయి. ‘‘పల్లవిగారు ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకుంటారా?’’‘‘అవును నా బావ నాకు దక్కేలా లేడని నేనే ఈ పని చేశాను’’‘‘పోలీసులు పల్లవిని అరెస్ట్‌ చేశారు. నందకుమార్‌తో పాటు అందరూ నివ్వెరపోయి చూడ సాగారు. ‘‘చిక్కుముడిని ఎంతో చాకచక్యంగా విడదీసిన జగదీష్‌ను, ప్రసాద్‌ను అందరూ ప్రశంసించారు’’.
యు.విజయశేఖర రెడ్డి  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top